China K-Visa: చైనా కే వీసా.. హెచ్-1బీ వీసాకు పోటీగా..
ABN, Publish Date - Sep 22 , 2025 | 06:38 AM
హెచ్-1బీ వీసాకు వీసాకు పొటీగా చైనా కే-వీసాను ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి దీన్ని లాంచ్ చేయనుంది. ప్రపంచవ్యా్ప్తంగా స్టెమ్ రంగాల యువ వృత్తి నిపుణులు, విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ వీసాను చైనా ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ రంగాల యువ నిపుణులను ఆకర్షించేందుకు చైనా కొత్త వీసాను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కే వీసా పేరిట అక్టోబర్ ఒకటి నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. అయితే, హెచ్-1బీ వీసాపై ఆంక్షల నేపథ్యంలో చైనా కే-వీసాను లాంచ్ చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టెమ్ రంగాలకు చెందిన యువ నిపుణులను చైనాకు ఆకర్షించడమే ఈ వీసా లక్ష్యమని చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వీసాను చైనా ప్రారంభించిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి (China K-Visa).
చైనా న్యాయ శాఖ ప్రకారం, సైన్స్, టెక్నాలజీ రంగాల్లోని యువ నిపుణుల కోసం ఈ వీసాను సిద్ధం చేశారు. ప్రపంచవ్యా్ప్తంగా ప్రముఖ యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థల్లో స్టెమ్ రంగాల్లో బ్యాచ్‌లర్స్, ఆపై డిగ్రీలు చేసిన యువత ఈ వీసాకు అర్హులు. ప్రముఖ సంస్థల్లో బోధన, పరిశోధన చేస్తున్న యువ నిపుణులకు కూడా ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసాకోసం కావాల్సిన ఇతర డాక్యుమెంట్స్ వివరాలను చైనా ప్రభుత్వం ఇంకా ప్రచురించాల్సి ఉంది (foreign talent China visa).
ప్రస్తుతం చైనా జారీ చేస్తున్న 12 రకాల వీసాల కంటే కే-వీసా నిబంధనలు మరింత సరళతరం. పలు మార్లు చైనాకు వచ్చి వేళ్లే సదుపాయం, అధిక వీసా గడువు వంటి ఫీచర్లు ఉన్నాయి. కే-వీసా ఉన్న వారు ఉద్యోగ వ్యాపారాలతో పాటు విద్యా సంబంధిత అంశాల్లో కూడా పాలుపంచుకోవచ్చు. అంతేకాకుండా, చైనా సంస్థల నుంచి ఎటువంటి ముందస్తు ఉద్యోగ ఆఫర్‌లు లేకపోయినా ఈ వీసాను జారీ చేస్తారు (China attracting skilled professionals).
అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించే ప్రణాళికలో భాగంగా చైనా.. వలసల నిబంధనలను మరింతగా సడలిస్తోంది. ఇందులో భాగంగానే కేవీసాను ప్రకటించింది. ఇప్పటికే 55 దేశాల పర్యాటకులకు చైనా 240 గంటల గడువుతో వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. మరో 75 దేశాల వారికి వీసా నిబంధనల్లో ఇతర అనేక సడలింపులు కూడా ప్రకటించింది. అధికారిక డాటా ప్రకారం, ఈ ఏడాది ప్రథమార్థంలో దాదాపు 38 మిలియన్‌ల మంది ఫారినర్లు చైనాలో పర్యటించారు.
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన
భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 22 , 2025 | 06:51 AM