H-1b Visa US Fact Sheet: హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన
ABN , Publish Date - Sep 21 , 2025 | 02:29 PM
హెచ్-1బీ వీసా ఫీజు పెంపును అమెరికా ప్రభుత్వం తాజాగా సమర్థించుకుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయనేందుకు ఆధారాలుగా పలు గణాంకాలను శ్వేత సౌధం తాజాగా విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో ఎన్నారైలకు ఊహించని షాకిచ్చిన అమెరికా ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. హెచ్-1బీ వీసా దుర్వినియోగానికి సంబంధించి వాస్తవాల పేరిట ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. హెచ్-1బీలతో తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేసే విదేశీయుల కారణంగా అమెరికన్లు ఉపాధి కోల్పోతున్నారని చెప్పుకొచ్చింది (H-1b Visa US Fact Sheet).
శ్వేత సౌధం విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం, హెచ్-1బీ వీసాలున్న ఐటీ రంగ ఉద్యోగుల వాటా 2003లో 32 శాతం ఉండగా ప్రస్తుతం అది 65 శాతానికి పెరిగింది. ఈ వ్యవస్థ దుర్వినియోగం కారణంగా అమెరికన్లలో నిరుద్యోగిత పెరిగింది (US workers replaced by foreign labour).
ఇటీవల కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువులు పూర్తి చేసిన అమెరికన్లలో నిరుద్యోగిత 6.1 శాతానికి పెరిగిందని, కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌లో ఇది 7.5 శాతంగా ఉందని తెలిపింది. ఇది బయాలజీ, హిస్టరీ డిగ్రీలున్న విద్యార్థులతో పోలిస్తే రెట్టింపు అని తెలిపింది. 2000-2019 మధ్య కాలంలో అమెరికాలో విదేశీ స్టెమ్ రంగ నిపుణుల సంఖ్య రెట్టింపైందని తెలిపింది. కానీ స్టెమ్ రంగంలో ఉద్యోగాల లభ్యత మాత్రం 44.5 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది. ఫలితంగా అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని స్పష్టం చేసింది (US Defends $100,000 H-1B fee).
‘ఓ కంపెనీకి 2025 ఆర్థిక సంవత్సరంలో 5189 హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయి. ఆ సంస్థ ఈ ఏడాది 16 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. 1698 హెచ్-1బీ వీసాలు మంజూరు అయిన మరో కంపెనీ 2400 మంది అమెరికన్ వర్కర్‌లను తొలగిస్తున్నట్టు జులైలో ప్రకటించింది. మరో కంపెనీకి 2022 నుంచి ఇప్పటివరకూ 25,075 వీసాలు రాగా 24 వేల మంది అమెరికన్‌లను జాబ్స్‌లోంచి తొలగించింది’ అని శ్వేత సౌధం తన ప్రకటనలో తెలిపింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగాల్లో అమెరికన్లకు మళ్లీ ప్రాధాన్యత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రజలు ఇందుకే అధికారం ఇచ్చారని చెప్పింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో పుట్టిన వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన
చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి