Share News

Chabahar Port Waiver Revoked: చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:39 AM

అణుకార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి చాబహార్ పోర్టులో కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్, సహా పలు దేశాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను తాజాగా ఉపసంహరించుకుంది.

Chabahar Port Waiver Revoked: చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం
Chabahar Port waiver revoked

ఇంటర్నెట్ డెస్క్: అణుకార్యక్రమాలతో ముందుకెళుతున్న ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి చాబహార్ పోర్టులో కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్ సహా పలు దేశాలకు 2018లో ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసేందుకు నిర్ణయించినట్టు ప్రకటించింది. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫిరేషన్ యాక్ట్ (ఐఎఫ్‌సీఏ) కింద అప్పట్లో అమెరికా ఈ మినహాయింపులను ఇచ్చింది. దీని ప్రకారం, పోర్టు నిర్మాణం, ఇతర కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్ అనుమతి పొందింది (Chabahar Port waiver revoked).

ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మినహాయింపుల రద్దు తరువాత ఇరాన్‌తో లావాదేవీలు జరిపే దేశాలపై ఐఎఫ్‌సీఏ కింద ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ కార్యకలాపాలకు నిధులందే అక్రమ మార్గాలన్నిటినీ మూసివేయడమే అమెరికా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది (U.S. sanctions Chabahar).

అప్ఘానిస్థాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు చేరుకునేందుకు పాక్ మీదుగా ఉన్న మార్గానికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య సముద్ర మార్గాన్ని భారత్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇరాన్ మీదుగా అప్ఘానిస్థాన్, ఇతర సెంట్రల్ ఆసియా దేశాలకు చేరుకునేందుకు చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తోంది (IFCA sanctions India).


మినహాయింపుల ఉపసంహరణతో భారత్‌‌కు చిక్కులు తప్పేలా లేవు. చాబహార్ పోర్టును 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు భారత్ గతేడాది ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ కుదుర్చుకున్న తొలి అగ్రిమెంట్ ఇది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ 120 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు సిద్ధమైంది. పోర్టు పరిసరాల్లో మౌలికవసతుల ఏర్పాటుకు మరో 250 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక రుణాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అప్ఘానిస్థాన్‌తో, ఇతర సెంట్రల్ ఆసియా దేశాలకు వాణజ్య మార్గంగా చాబహార్ పోర్టు భారత్‌కు కీలకం. రష్యా, ఐరోపాతో భారత్‌ను అనుసంధానం చేసే మరో వాణిజ్య మార్గం నార్త్-సౌత్ కారిడార్‌ను చేరుకునేందుకు కూడా ఛాబహార్ పోర్టు ప్రధాన ద్వారం. అఫ్ఘానిస్థాన్ గోధుమలు, ఇతర సరుకులు ఇప్పటికే ఛాబహార్ పోర్టు ద్వారా భారత్‌కు చేరుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి:

అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం

అమెరికాలో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో నిలిపివేత.. దేశానికి ఇది శుభవార్త అన్న ట్రంప్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 19 , 2025 | 06:48 AM