Share News

Pak Minister Khwaja: భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన

ABN , Publish Date - Sep 20 , 2025 | 02:52 PM

భారత్‌తో యుద్ధం వస్తే తమకు సౌదీ అరేబియా అండగా ఉంటుందని పాక్ రక్షణ శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. సౌదీ, పాక్ మధ్య ఇటీవల కుదిరినది సమగ్ర రక్షణ ఒప్పందం అని కామెంట్ చేశారు.

Pak Minister Khwaja: భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన
Pakistan Saudi defence pact

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో యుద్ధంలో తమకు సౌదీ రక్షణగా నిలుస్తుందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. సౌదీ, పాక్‌ మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక సమగ్ర రక్షణ ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు (Pak Minister Khwaja Asif).

‘కచ్చితంగా సౌదీ అరేబియా జోక్యం చేసుకుంటుంది. ఇందులో సందేహమే వద్దు’ అని జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ మంత్రి అన్నారు. పాశ్చాత్య దేశాల కూటమి నాటో తరహాలో తమ మధ్య సమగ్ర రక్షణ ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఒప్పందం రక్షణ కోసం ఉద్దేశించినదని, ఎవరిపైనో దాడి చేసేందుకు కాదని అన్నారు. సౌదీపై దాడి జరిగినా, పాక్‌పై దాడి జరిగినా ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటాయని అన్నారు. తాము ముందుగా యుద్ధానికి దిగేందుకు ఉద్దేశించిన ఒప్పందం కాదని అన్నారు. బెదిరింపులు వస్తే మాత్రం ఈ ఒప్పందం కింద చర్యలు మొదలవుతాయని అన్నారు.

సౌదీ అరేబియా‌కు తమ అణ్వాయుధాలను అవసరమైతే ఇస్తామని కూడా పాక్ మంత్రి చెప్పుకొచ్చారు. పాక్ అణ్వాయుధాల ప్రధాన లక్ష్యం భారత్‌పై దాడులకే అయినా సౌదీకి అవసరమైనప్పుడు ఇస్తామని తెలిపారు. అన్ని మిలిటరీ సాధనాలకు వర్తించే ఒప్పందం పాక్‌తో కుదుర్చుకున్నామని సౌదీ సీనియర్ అధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు (Saudi Role in India Pak War).


అరబ్ దేశాల కూటమి ఏర్పాటు గురించి కూడా పాక్ మంత్రి ఖ్వాజా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంపై ప్రకటనలు చేయడం తొందరపాటు అవుతుందని అన్నారు. అయితే, ఇందుకు దార్లు తెరిచే ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఉమ్మడిగా తమని తాము రక్షించుకోవాల్సిన బాధ్యత ఇస్లామిక్ దేశాలపై ఉందని కామెంట్ చేశారు (Pak Saudi Defense Pact).

ఇక ఈ ఒప్పందంపై భారత్ కూడా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అవగాహనకు తాజాగా అధికారిక హోదా ఇచ్చినట్టు అయ్యిందని కామెంట్ చేసింది. ఈ ఒప్పందం పర్యవసానాలను తాము పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకు మేలేనని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సౌదీ సంపదకు పాక్ ఆయుద్ధ సంపత్తి తోడయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. అరబ్ దేశాల కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్న పాక్‌కు తాజా ఒప్పందం ప్రోత్సాహకరమని కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం

అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 20 , 2025 | 03:05 PM