China Banker Executed: రూ.1,404 కోట్ల లంచాలు.. చైనా బ్యాంకింగ్ అధికారికి మరణ శిక్ష అమలు
ABN, Publish Date - Dec 13 , 2025 | 10:58 PM
రూ.1404 కోట్ల లంచాలు తీసుకున్న ఓ సీనియర్ బ్యాంకింగ్ అధికారి చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనకు విధించిన మరణ శిక్షను చైనా తాజాగా అమలు చేసింది. ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అవినీతి, అక్రమాలకు పాల్పడి రూ.1404 కోట్లు కొల్లగొట్టిన ఓ చైనా బ్యాంకింగ్ అధికారికి అక్కడి ప్రభుత్వం తాజాగా మరణశిక్షను అమలు చేసింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను ఇటీవల సుప్రీం కోర్టు కూడా సమర్ధించడంతో ప్రభుత్వం తాజాగా తీర్పును అమలు చేసింది.
చైనా ఆర్థిక సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగం సంస్థల్లో అవినీతిని రూపుమాపేందుకు చైనా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చైనా హువరాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ బాయ్ టియాన్‌హుయీ అవినీతి బయటపడింది. ఉన్నతాధికారి అయిన ఆయన తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ సుమారు రూ.1404 కోట్లు దండుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది మే నెలలో ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. బాయ్ అసాధారణ రీతిలో లంచాలు పుచ్చుకున్నాడని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఆయన అవినీతి సమాజంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది. జాతీయ ప్రయోజనాలను కూడా బాయ్ పణంగా పెట్టాడని తెలిపింది. ఆయనకు అత్యంత కఠినమైన శిక్షే తగినదని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో సుప్రీం పీపుల్స్ కోర్టు కూడా ఏకీభవించింది. ఆయన అవినీతికి సంబంధించి దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు వెలుగు చూశాయని పేర్కొంది. తీర్పు సబబేనని పేర్కొంది.
చైనా మీడియా ప్రకారం, చైనా హువరాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లో బాయ్ 2014-18 మధ్య కాలంలో జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ సమయంలో వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరుకు సంబంధించి భారీగా లంచాలు పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. మరణశిక్ష అమలుకు ముందు బాయ్ తన కుటుంబసభ్యులను చివరిసారిగా కలుసుకున్నారు. అయితే, ఏ విధానంలో మరణ శిక్ష అమలు చేశారన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఇక ఈ ఉదంతం అంతర్జాతీయంగా కూడా సంచలనానికి తెరతీసింది.
ఇవీ చదవండి:
50 శాతం సుంకాల విధింపు.. మెక్సికోతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 13 , 2025 | 11:29 PM