Canada Foreign Students: కెనడాకు ఫారిన్ స్టూడెంట్ల రాకలో 60 శాతం కోత
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:53 PM
కెనడాలో కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా కోత పడింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కొత్త ఫారిన్ విద్యార్థుల సంఖ్య 150,220 మేర తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల రాక భారీగా తగ్గింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కొత్త విదేశీ విద్యార్థుల రాక గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 60 శాతం మేర తగ్గింది. కొత్త విద్యార్థుల సంఖ్య 150,220 మేర పడిపోయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో 11,390 మంది ఫారిన్ స్టూడెంట్స్కు కెనడాకు వెళ్లారు. గతేడాది ఇదే సమయంలో కొత్త విదేశీ విద్యార్థుల సంఖ్య 28,910గా ఉంది. అయితే, ఫాల్ సీజన్ సెప్టెంబర్ కంటే ముందే మొదలై ఉండటంతో విద్యార్థుల సంఖ్య తగ్గి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో 45,200 మంది కొత్త విద్యార్థులు వచ్చారు. అయితే, గతేడాది ఆగస్టు నాటి సంఖ్యతో (79,770) పోలిస్తే విద్యార్థులు ఏకంగా 43 శాతం మేర తగ్గారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి స్టడీ పర్మిట్లు ఉన్న వారి సంఖ్య 473,860 కాగా, స్టడీతో పాటు వర్క్ పర్మిట్ కూడా ఉన్న వారి సంఖ్య 251,300 (Canada Sees 60 percent Drop in Foreign Students).
ఇటీవల కాలంలో వలసల కట్టడికి కెనడా కఠిన చర్యలు తీసుకోవడంతో ఫారిన్ స్టూడెంట్స్ తగ్గిపోయారు. 2024తో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం తక్కువగా స్టడీ పర్మిట్లను కెనడా ప్రభుత్వం జారీ చేసింది. స్టడీ పర్మిట్ దరఖాస్తు ప్రక్రియను కూడా మరింత కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం ప్రతి దరఖాస్తుకు స్థానిక ప్రావిన్స్ లేదా టెరిటరీ ఎటస్టేషన్ లేఖను తప్పనిసరి చేసింది.
కరిక్యులమ్ లైసెన్సింగ్ ఎరేంజ్మెంట్ కోర్సుల్లో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ సౌలభ్యాన్ని గతేడాదే కెనడా రద్దు చేసింది. అంతర్జాతీయ విద్యార్థుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఓపెన్ వర్క్ పర్మిట్లను కూడా కేవలం మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్లోని వారికే పరిమితం చేసింది. అండర్ గ్రాడ్యుయేట్, కాలేజ్ కోర్సులు చదువుతున్న ఫారిన్ స్టూడెంట్స్కు ఈ అవకాశాన్ని తొలగించింది.
ఇవీ చదవండి:
నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్
భారత్కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్ల సూచన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి