Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

ABN , First Publish Date - 2023-08-13T11:04:12+05:30 IST

ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, హిందూ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను కెనడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

న్యూఢిల్లీ : ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, హిందూ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను కెనడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా శనివారం బ్రిటిష్ కొలంబియాలోని సుర్రే పట్టణంలో ఓ ప్రముఖ హిందూ దేవాలయం గోడలు, తలుపులపై ఖలిస్థానీలు పోస్టర్లను అంటించారు. దీంతో హిందూ భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

సుర్రే పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరం ప్రధాన ద్వారం తలుపులపైనా, వెనుకగల గోడలపైనా ఖలిస్థానీలు భారత దేశానికి వ్యతిరేకంగా, ఖలిస్థానీలకు అనుకూలంగా పోస్టర్లను అంటించారు. ఓ పోస్టర్లో ‘‘వాంటెడ్’’ అని ఆంగ్ల అక్షరాల్లో రాశారు. దాని క్రింద ఒట్టావాలోని ఇండియన్ హై కమిషనర్, టొరంటో, వాంకోవర్‌లలోని ఇండియన్ కాన్సుల్ జనరల్‌ల ఫొటోలను ముద్రించారు. ఈ పోస్టర్‌ను ఈ దేవాలయం ప్రధాన ద్వారం తలుపులకు అంటించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న హత్యకు గురయ్యాడని, ఈ హత్య వెనుక భారత దేశం పాత్రపై దర్యాప్తు చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ మరొక పోస్టర్‌ను ఈ దేవాలయం వెనుకవైపు గల తలుపులకు అంటించారు.

ఈ దేవాలయం కమిటీ అధ్యక్షుడు సతీశ్ కుమార్ మాట్లాడుతూ, దేవాలయాన్ని అపవిత్రం చేసినట్లు గుర్తించి, తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఇటువంటి సంఘటన జరుగుతుందని తాము ఎన్నడూ ఊహించలేదన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కనిపించారని తెలిపారు.


ఇటువంటి పోస్టర్లు ఇటీవల సుర్రే పట్టణంలో తరచూ కనిపిస్తున్నాయి. వాంకోవర్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం భవనం వెలుపల ఆగస్టు 1న ఇటువంటి పోస్టర్ ఒకటి కనిపించింది. గత ఆదివారం సుర్రే పట్టణంలో జరిగిన సిక్కు మత ప్రదర్శనలో కూడా చాలా మంది ఈ పోస్టర్లను చేత పట్టుకుని నడిచారు.

సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs For Justice) అనే ఉగ్రవాద సంస్థకు బ్రిటిష్ కొలంబియాలో నాయకుడిగా ఉన్న నిజ్జర్‌ను సుర్రే పట్టణంలోనే హత్య చేశారు. ఆయన గురు నానక్ సింగ్ గురుద్వారా సాహిబ్‌కు అధిపతి. ఈ గురుద్వారా ప్రాంగణంలోనే జూన్ 18న ఆయన హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక భారత్ పాత్ర ఉందని ఈ ఉగ్రవాద సంస్థ ఆరోపిస్తోంది. అయితే ప్రత్యర్థులే ఆయనను హత్య చేశారనే కథనాలు కూడా వచ్చాయి.


ఇవి కూడా చదవండి :

Ajit meets Pawar: కుటుంబ సన్నిహితుని ఇంట్లో కలిసిన పవార్ ద్వయం... మళ్లీ ఊహాగానాలు

Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్

Updated Date - 2023-08-13T11:04:12+05:30 IST