Share News

Canada Diwali: దీపావళి వేడుకల్లో రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. హిందువులతో ఘర్షణ

ABN , First Publish Date - 2023-11-14T22:09:50+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఎప్పుడైతే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడో.. అప్పటి నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కెనడాలో వాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు.

Canada Diwali: దీపావళి వేడుకల్లో రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. హిందువులతో ఘర్షణ

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఎప్పుడైతే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడో.. అప్పటి నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కెనడాలో వాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు. మొదట్లో దౌత్యాధికారుల్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్లు.. అక్కడ నివసిస్తున్న హిందువుల్ని సైతం టార్గెట్ చేస్తున్నారు. మధ్యలో కొంతకాలం పాటు వాతవరణం చక్కబడటంతో.. ఇక ఎలాంటి సమస్యా ఉండదని అంతా అనుకున్నారు. కానీ.. దీపావళి వేడుకల్లో ఖలస్తానీలు మరోసారి హంగామా సృష్టించారు. హిందువులతో ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


టోరంటో సన్ ప్రకారం.. కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందువులంతా కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తుండగా.. ఖలిస్తాన్ మద్దతుదారుల గుంపు అక్కడికి చేరుకుంది. ఖలిస్తాన్ జెండాలు చేతపట్టుకొని వచ్చిన వాళ్లు.. చేతికి దొరికిన వస్తువులను హిందువులపై విసిరారు. ఈ వీడియోని ఎక్స్ వేదికలో షేర్ చేసిన నెటిజన్ ప్రకారం.. ఈ ఘటన మాల్టన్‌లోని వెస్ట్‌వుడ్ మాల్ వద్ద చోటు చేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని, అక్కడి పరిస్థితుల్ని సద్దుమణిగేలా చూశారు. హిందువులపై దాడి చేయడానికి వచ్చిన వారిని అదుపు చేశారు. ఈ ఘటనపై తాము పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు ప్రకటించారు. ప్రార్థనా స్థలాలు, జాతి మైనారిటీలపై దాడులు.. విద్వేషపూరిత ప్రసంగాలను ప్రేరేపించే ‘‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దుర్వినియోగం’’ నిరోధించడాన్ని మరింత పటిష్టం చేయాలని కెనడాను భారత్ సిఫార్సు చేసిన వారం రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపణలు చేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. రోజులు గడిచేకొద్దీ ఈ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది తప్ప, తుది దశకు చేరుకోవడం లేదు. ఇరు దేశాల మధ్య దౌత్య సమానత్వం ఉండాలని చెప్పి.. ఇక్కడున్న కెనడా దౌత్యాధికారుల్లో చాలామందిని భారత్ తిరిగి కెనడాకు పంపించింది. అంతేకాదు.. నిజ్జర్ హత్య దర్యాప్తునకు సహకరించేందుకు తగిన సమాచారం అందించమని భారత్ కోరుతున్నా, కెనడా నుంచి సరైన స్పందన రావడం లేదు. చూస్తుంటే.. ఇరుదేశాల మధ్య వివాదానికి ఇప్పుడప్పుడే చెక్ పడేలా లేదు.

Updated Date - 2023-11-14T22:09:51+05:30 IST