India-Mexico Talks: 50 శాతం సుంకాల విధింపు.. మెక్సికోతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 03:21 PM
మెక్సికో విధించిన 50 శాతం సుంకాలపై భారత్ దృష్టిసారించింది. మెక్సికో ఆర్థిక శాఖతో భారత్ వాణిజ్య శాఖ చర్చిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మెక్సికో ఏకపక్షంగా 50 శాతం సుంకం విధించడంతో కలకలం రేగుతోంది. ఈ విషయంలో మెక్సికోతో చర్చిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పరిష్కారం కోసం భారత్ మెక్సికోతో చర్చలు ప్రారంభించింది. అయితే, తమ దేశ ఎగుమతిదార్ల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకునే హక్కు కూడా తమకు ఉందని భారత వర్గాలు పేర్కొన్నాయి. భారత వాణిజ్య శాఖ మెక్సికో ఆర్థిక శాఖతో చర్చిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి (India-Mexico Tariffs-Talks).
భారత్‌తో పాటు చైనా, దక్షిణకొరియా, థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా తదితర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై మెక్సికో ఏకంగా 50 శాతం సుంకం విధించేందుకు సిద్ధమైంది. భారత్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ఏదీ మెక్సికోకు లేకపోవడంతో ఈ తరహా సుంకాలు విధించడం సాధ్యమైందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే, భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తక్కువ ధరకు వచ్చే దిగుమతుల నుంచి దేశీయ వ్యాపారాలను కాపాడుకునేందుకు ఈ సుంకాలు విధిస్తున్నట్టు మెక్సికో ప్రభుత్వం చెప్పింది. అయితే, మెక్సికో,కెనడాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై అమెరికా త్వరలో సమీక్ష జరపనున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ను మంచి చేసునేందుకు మెక్సికో అధ్యక్షురాలు ఈ తరహా సుంకాలు విధించినట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఇక మెక్సికో విధించిన సుంకాలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో, భారత్ నుంచి ఎగుమతయ్యే 75 శాతం ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది భారత్ 5.6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను మెక్సికోకు ఎగుమతి చేసింది.
ఇవీ చదవండి:
కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత
నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి