Bangladesh Hindu Murder: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య: 10 మంది అరెస్ట్
ABN, Publish Date - Dec 21 , 2025 | 07:07 AM
బంగ్లాదేశ్‌లో 27 ఏళ్ల హిందూ యువకుడ్ని అత్యంత కిరాతంకంగా చంపేశారు. దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించారు. దేవదూషణ ఆరోపణలపై ఈ దాడి..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 20: బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలోని భాలుకా ప్రాంతంలో 27 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను ఒక ముఠా దాడి చేసి దారుణంగా హత్య చేసింది. డిసెంబర్ 18, 2025 సాయంత్రం సుమారు 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించారు.
బ్లాస్ఫమీ (దేవదూషణ) ఆరోపణలపై ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. సెక్కులరిజం భావాలతో మనుష్యులంతా ఒక్కటేనని చెప్పడమే సదరు యువకుడు చేసిన పాపమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్త అల్లర్ల నేపథ్యంలో జరిగింది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణం తర్వాత దేశంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ హత్యకు సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) 7 మందిని, పోలీసులు మరో 3 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది ఈ దారుణంలో పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ కూడా ఈ హత్యను ఖండిస్తూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించింది.
ఈ ఘటన బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది.ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదంతం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్
Updated Date - Dec 21 , 2025 | 07:20 AM