Share News

Yashasvi Jaiswal: నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:58 AM

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్ అనంతరం స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న అతడిని ముంబైలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై యశస్వి స్పందించాడు.

Yashasvi Jaiswal: నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal

ఇంటర్నెట్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ముంబై, రాజస్థాన్ మ్యాచ్ సమయంలో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఉదర సంబంధ సమస్య ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో అతడిని ముంబైలోని ఆదిత్య బిర్లా హాస్పిటల్‌లో చేర్చారు. రెండు రోజుల్లో రెండు కిలోల వరకు బరువు తగ్గినట్లు, వైద్యులు 10 రోజుల వరకు విశ్రాంతి సూచించినట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన హెల్త్ అప్‌డేట్‌పై యశస్వి(Yashasvi Jaiswal) స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘నా ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు. నేను కోలుకుంటున్నా. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ చికిత్స అందిస్తున్న వైద్యులకు నా కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మైదానంలోకి రావాలని ఎదురుచూస్తున్నా’ అని జైస్వాల్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు.


డిసెంబర్‌ 24 నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా యశస్వి జైస్వాల్‌ ప్రారంభంలో కొన్ని మ్యాచులకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇటీవల టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లోనూ అతడికి జట్టులో చోటు దక్కే ఛాన్స్‌ ఉంది.


ఇవీ చదవండి:

గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య.. ఏం చేశాడంటే?

ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్

Updated Date - Dec 20 , 2025 | 11:58 AM