Ind Vs SA: ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:26 AM
సౌతాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తేడాతో కైవసం చేసుకుంది. జట్టు ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ స్పందించాడు. ఓటమిని తట్టుకోలేక పోతున్నట్లు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను సౌతాఫ్రికా కోల్పోయిన విషయం తెలిసిందే. 3-1 తేడాతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి, మూడు, ఐదో మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా.. రెండో టీ20లో సఫారీ సేన గెలుపొందింది. లఖ్‌నవూ వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దు అయింది. అయితే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐదో టీ20లో సౌతాఫ్రికా ఓటమి తర్వాత.. ఆ జట్టు కెప్టెన్ మార్క్‌రమ్(Markram) మాట్లాడాడు.
‘ఓటమిని తట్టుకోలేకపోతున్నా. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే బ్యాటర్లు సమష్టిగా రాణించాలి. డికాక్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్లు మాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. అందుకే ఓడిపోయాం. అయినప్పటికీ ఈ మ్యాచ్ మాకు ఎన్నో పాఠాలను నేర్పింది. టీ20 ప్రపంచ కప్ ముందు ఈ పాఠాలు మాకు ఎంతో విలువైనవి. ఎందుకంటే ప్రపంచ కప్‌లో చాలా మ్యాచులు ఇక్కడే ఆడనున్నాం. కాబట్టి ఈ అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని మార్క్‌రమ్ వెల్లడించాడు.
ఎప్పుడూ ఒకేలా ఉండదు..
‘టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐదో టీ20లో మేం అదే చేశాం. మేమే కాదు చాలా జట్లు ఇలానే చేస్తాయి. టీ20 ప్రపంచ కప్ ముందు ఈ సిరీస్‌లో మేం కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇది మా మంచికే అని భావిస్తున్నా. ఎందుకంటే ప్రపంచ కప్ గెలవాలంటే మేమేం చేయాలనే విషయంపై స్పష్టమైన అవగాహన వచ్చింది. భారత్ వంటి ప్రతిభావంత జట్టుతో ఆడటం మాకు కలిసొచ్చే విషయం. టీమిండియా అద్భుతంగా ఆడింది. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
Team India: నేడే టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఏం జరగబోతోందో?
Ind Vs SA: సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు ఉండిపోయింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్