Team India: నేడే టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఏం జరగబోతోందో?
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:24 AM
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన భారత జట్టును సెలక్టర్లు నేడు ప్రకటించనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఇంకా 50 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో ఎవరి ఉంటారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన భారత జట్టును శనివారం సెలక్లర్లు ప్రకటించనున్నారు. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. జట్టును ఇప్పుడే ప్రకటిస్తున్నప్పటికీ.. టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే అయిదారుగురిని స్టాండ్ బైలుగా ప్రకటించనున్నారు.
టీ20 ప్రపంచ కప్(India T20 World Cup 2026)కు ముందు జనవరిలో స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా సెలక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడే జట్టునే.. ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా సెలక్టర్లు ప్రకటించబోయే జట్టులో ఆశ్చర్యపరిచే పేర్లేమీ ఉండకపోవచ్చని అంచనా.
జట్టు అంచనా..
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. వాళ్లిద్దరూ జట్టులో ఆడటం ఖాయమే. టీ20 ప్రపంచ కప్‌ను సూర్యకు కెప్టెన్‌గానే కాక ఆటగాడిగానూ చివరి అవకాశంగా భావిస్తున్నారు. టీ20ల్లోకి పునరాగమనం చేసినప్పటి నుంచి నిలకడ అందుకోలేకపోతున్న గిల్‌పై వేటు వేసి యశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటివ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. సెలెక్టర్లు ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువే. సూర్య, గిల్‌లకు తోడు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతారు. జితేశ్‌ను తొలి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా ఎంపిక చేయనున్నారు. యాధావిథిగా సంజూ శాంసన్ రెండో వికెట్ కీపర్‌గా ఉంటాడు. హార్దిక్, దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్లుగా జట్టులో ఉండటం ఖాయం. బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు. యశస్వి జైస్వా్ల్, నితీశ్ కుమార్ రెడ్డి, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలను స్టాండ్ బైలుగా ఎంపిక చేసే అవకాశముంది.
ఇవీ చదవండి:
రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్
మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!