Sourav Ganguly: మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:11 AM
మెస్సి కోల్‌కతా పర్యటనలో విధ్వంసం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ సాహా.. టీమిండియా క్రికెట్ దిగ్గజం గంగూలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాటిని ఖండించి దాదా.. కోర్టును ఆశ్రయించి సాహాపై పరువు నష్టం దావా వేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కతా పర్యటనలో విధ్వంసం చెలరేగిన విషయం తెలిసిందే. మెస్సి షెడ్యూల్ ప్రకారం ఎక్కువ సేపు గ్రౌండ్‌లో ఉండకుండా వెళ్లిపోయాడని.. అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురై స్టేడియంలోని కుర్చీలు ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనపై కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా టీమిండియా క్రికెట్ దిగ్గజం, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన దాదా.. సాహాపై రూ.50కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
సాహా ఏమన్నాడంటే..?
‘మెస్సి, ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు గంగూలీ మధ్యవర్తిగా వ్యవహరించాడు. గంగూలీకి డబ్బు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే ఉంటాడు. బెంగాల్ క్రికెట్‌ను నాశనం చేశాడు. మెస్సి ఈవెంట్‌తో అతడికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి’ అని సాహా(Uttam Saha) గంగూలీపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై స్పందించిన గంగూలీ.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు.
‘ఉత్తమ్ సాహా ఎటువంటి వాస్తవిక ఆధారాలు లేకుండా నా పై బహిరంగంగా ఆరోపణలు చేశాడు. ఇవి నా ప్రతిష్ఠకు భంగం కలిగించాయి. స్టేడియంలో జరిగిన ఈవెంట్‌కు అతిథిగా మాత్రమే హాజరయ్యాను. మెస్సి కార్యక్రమంతో నాకు అధికారికంగా ఎలాంటి సంబంధం లేదు’ అని దాదా పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా మెస్సి ఈవెంట్‌లో గందరగోళం నెలకొన్నప్పుడు స్టేడియంలోనే ఉన్న గంగూలీ.. నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
గంభీర్ కోచ్ కాదు... కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు