Cameron Green: ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్న గ్రీన్!
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:42 AM
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్. కేకేఆర్ అతడిని ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే గ్రీన్‌కు ఓ ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయం మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై కోట్లాభిషేకం జరిగింది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి కేకేఆర్ ఏకంగా రూ.25.20కోట్లు వెచ్చించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన మూడో విదేశీ ప్లేయర్‌గా గ్రీన్ నిలిచాడు. అయితే గ్రీన్ ఓ ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని మీకు తెలుసా? ఈ విషయంపై గురించి గ్రీన్(Cameron Green) 2023లోనే ప్రకటించాడు.
‘నాకు దీర్ఘకాలిక కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉంది. ఈ విషయం నేను పుట్టినప్పుడే నా తల్లిదండ్రులకు వైద్యులు చెప్పారు. మా అమ్మ టార్సీ 19 వారాల గర్భంతో ఉండగా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో ఈ విషయం బయట పడింది. నేను 12 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతకనని వైద్యులు చెప్పారని నా తండ్రి గ్యారీ చెప్పాడు. ఈ వ్యాధి కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. దురదృష్టవశాత్తు నా కిడ్నీలు మిగతా వారిలా రక్తాన్ని శుద్ధి చేయవు. అవి ప్రస్తుతం 60 శాతమే పని చేస్తున్నాయి. వ్యాధి తీవ్రత రెండో దశలో ఉంది. వాటిని బాగా చూసుకోవాలి. లేదంటే పూర్తిగా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం నా పరిస్థితి బానే ఉంది. నా అదృష్టం ఏమిటంటే ఇతరుల మాదిరిగా నేను శారీరకంగా ఎక్కువ దెబ్బ తినలేదు. నా ఆరోగ్య సమస్య గురించి జట్టులో కొందరికి తెలుసు. కోచింగ్ సిబ్బందికీ చెప్పా. ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోవాలి’ అని గ్రీన్ గతంలో వెల్లడించాడు.
ఏదైతేనేమీ.. గ్రీన్ మొత్తానికి మృత్యువునే జయించి నేడు క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా చరిత్ర సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అతడి ప్రదర్శన ఎలా ఉండబోతోంది అనేదాని మీదే అందరి చూపూ ఉంది. గ్రీన్ ఇప్పటి వరకు 29 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 41.6 యావరేజ్, 153.7 స్ట్రైక్ రేట్‌తో 707 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్‌లో 9.08 ఎకానమీతో 16 వికెట్లు తీసుకున్నాడు.
ఇవీ చదవండి:
గంభీర్ కోచ్ కాదు... కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు