Roll Ball World Cup: రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:45 AM
రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఆతిథ్య కెన్యా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది. ఎట్టకేలకు పుంజుకున్న భారత పురుషుల, మహిళల జట్లు ప్రపంచ కప్‌ను ముద్దాడాయి.
ఇంటర్నెట్ డెస్క్: క్రీడల్లో భారత జట్టు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది టీమిండియా ఎన్నో క్రీడల్లో ప్రపంచ కప్ అందుకుంది. ఈ జాబితాలో మరో ఆట చేరింది. అదే రోల్ బాల్. ఈ ఆట గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. భారత పురుషులు, మహిళల జట్లు ఈ రోల్ బాల్‌లో ప్రపంచ కప్ టైటిల్స్ గెలుచుకున్నాయి. ఈ టోర్నీ(Roll Ball World Cup) ఫైనల్లో పురుషుల జట్టు 11-10 తేడాతో, మహిళల జట్టు 3-2తో కెన్యా జట్టును ఓడించాయి.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కెన్యా.. భారత పురుషుల జట్టుకు గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో భారత్ వెనుకంజలో నిలిచినప్పటికీ.. పుంజుకుని విజయం సాధించింది. ఇది భారత పురుషుల జట్టుకు 5వ ప్రపంచకప్ టైటిల్. మహిళలకు మూడో ప్రపంచకప్ టైటిల్. ఈ మెగా ఈవెంట్‌లో భారత్, కెన్యా, పోలాండ్, అర్జెంటీనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలు పాల్గొన్నాయి.
అసలేంటీ రోల్ బాల్..?
రోల్ బాల్ అనేది స్వదేశంలోనే పుట్టిన ఓ వినూత్న క్రీడ. సింపుల్‌గా చెప్పాలంటే.. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, రోలర్ స్కేటింగ్ కలిసిన ఆట. ఈ క్రీడలో ఆటగాళ్ళు రోలర్ స్కేట్స్ ధరించి, బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ఎదుటి జట్టు గోల్ పోస్ట్‌లోకి పంపాలి. ప్రతి జట్టులో 12 మంది ఆటగాళ్ళు ఉంటారు. కానీ మైదానంలో ఒకేసారి 6 మంది మాత్రమే ఆడతారు. ఇందులో ఒక గోల్ కీపర్ ఉంటాడు. ఆటగాళ్ళు స్కేటింగ్ చేస్తూ బంతిని చేత్తో పట్టుకుని బాస్కెట్ బాల్ తరహాలో డ్రిబ్లింగ్ చేయాలి. బంతిని ఒక చేత్తో లేదా రెండు చేతులతో పాస్ చేయవచ్చు. కానీ గోల్ వేసేటప్పుడు మాత్రం ఒక చేయి మాత్రమే ఉపయోగించాలి. నిర్ణీత సమయంలో ఏ జట్టు ఎక్కువ గోల్స్ చేస్తే ఆ జట్టు విజేతగా నిలుస్తుంది. భారత్‌లో పుట్టిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఆడుతున్నారు.
ఇవీ చదవండి:
గంభీర్ కోచ్ కాదు... కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు