Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీకి రోహిత్ శర్మ సై!
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:36 AM
విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆడనున్నాడు. ముంబై తరఫున రెండు మ్యాచుల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో ఆడటానికి విరాట్ కోహ్లీ కూడా సుముఖంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో ముంబై తరఫున హిట్‌మ్యాన్(Rohit Sharma) రెండు మ్యాచుల్లో ఆడనున్నట్లు సమాచారం. సూర్య కుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, శివమ్ దూబె తదితరులు ప్రారంభ మ్యాచులకు గైర్హాజరు కానున్నారు.
‘యశస్వి, దూబె, రహానే తొలి రెండు మ్యాచులకు ముంబై జట్టులో ఉండరు. సెలక్షన్ ప్యానల్ యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వనుంది. యశస్వి అజీర్తి సమస్యలతో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు’ అని ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తెలిపారు. ముంబై జట్టు గ్రూప్ సిలో ఉంది. దీంతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవా, హిమాచల్ ప్రదేశ్ ఈ గ్రూపులోనే ఉన్నాయి. డిసెంబర్ 24న ముంబై తన తొలి మ్యాచును సిక్కింతో ఆడనుంది.
పంత్ కెప్టెన్సీలో కోహ్లీ..
మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టుకు టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచులు డిసెంబర్ 24 నుంచి జనవరి 8 వరకు అహ్మదాబాద్, రాజ్‌కోట్, జైపుర్ వేదికగా జరగనున్నాయి. నాకౌట్ మ్యాచులను జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరు మైదానంలో నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి:
గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య.. ఏం చేశాడంటే?
ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్