Share News

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..

ABN , Publish Date - Dec 20 , 2025 | 02:28 PM

వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
India T20 squad 2026

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ కప్ ఆడే టీమిండియాకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. ఈ టోర్నీలో శుభ్‌మన్ గిల్ కి చోటు దక్కలేదు. భారత గ్రూప్‌ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో ముంబై వేదికగా ఆడనుంది. ఇదే రోజు పాకిస్థాన్ , నెదర్లాండ్స్ మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. అలానే భారత్ గ్రూప్ స్టేజ్ లో తన చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో భారత జట్టు పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్‌ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్‌, మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరగనుంది.


t20.jpg


శుభ్‌మన్ గిల్ కు షాక్. .దూసుకొచ్చిన ఇషాన్:

టీ20 ప్రపంచ కప్ 2026కు ఆడే భారత జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీ20 భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ కు వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం దక్కలేదు. అలానే సౌతాఫ్రికాతో ఆడిన చివరి మ్యాచ్ లో సంజూ ఓపెనింగ్‌ స్థానం త్యాగం చేయించిన మేనేజ్‌మెంట్‌.. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌శర్మకు పెద్ద పీట వేసి లోయర్‌ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్‌ 2026 జట్టు నుంచి జితేశ్‌ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపిన ఇషాన్‌ కిషన్‌ను అనూహ్యంగా ఎంపిక చేసింది. అతడిని బ్యాకప్‌ ఓపెనర్‌గా ఉపయోగించుకుంటామని బీసీసీఐ తెలిపింది. అదే విధంగా.. నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ను మేనేజ్‌మెంట్‌ జట్టులోకి ఆహ్వానించింది. మరోసారి వరల్డ్‌కప్‌ జట్టులో భాగమయ్యే అవకాశం అతడికి ఇచ్చింది. ఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.


భారత జట్టు:

  • సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌)

  • అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌)

  • సంజూశాంసన్‌ (వికెట్ కీపర్)

  • అభిషేక్‌ శర్మ

  • తిలక్‌ వర్మ

  • హార్దిక్‌ పాండ్య

  • శివమ్‌ దూబె

  • రింకు సింగ్‌

  • బుమ్రా

  • అర్షదీప్‌ సింగ్‌

  • హర్షిత్‌ రాణా

  • వాషింగ్టన్‌ సుందర్‌

  • ఇషాన్ కిషన్‌

  • కుల్‌దీప్‌ యాదవ్‌

  • వరుణ్‌ చక్రవర్తి


ఇవీ చదవండి:

ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం

నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్

Updated Date - Dec 20 , 2025 | 04:07 PM