Ind Vs SA: ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:33 PM
టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో సంజూ శాంసన్‌ను సౌతాఫ్రికాతో ఐదో టీ20లో ఆడించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంజూ రాణించాడు. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: సంజూ శాంసన్.. అవకాశం వచ్చినప్పుడల్లా తన ప్రదర్శనతో అలరిస్తున్నాడు. కానీ జట్టు యాజమాన్యం మాత్రం అతడిని ఎందుకో పరిశీలనలోకి తీసుకోవడం లేదు. గతేడాది కాలంగా టీమిండియా టీ20 జట్టులో సంజూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వచ్చి వరుస శతకాలతో రాణించాడు. ఆసియా కప్ 2025లో భాగంగా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీతో సంజూ స్థానం గల్లంతైంది.
గిల్‌ను ఆడించే క్రమంలో సంజూ(Sanju Samson) బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రయోగాలు చేశారు. మూడో స్థానంలో.. మిడిలార్డర్‌లో ఆడించారు. ఆ తర్వాత ఏకంగా జట్టులో నుంచే తప్పించారు. మరోవైపు గిల్ ప్రదర్శన బాగుందా అంటే.. అదీ లేదు. పునరాగమనం నుంచే దారుణంగా విఫలమవుతూ వచ్చాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కూడా గిల్ చేసిన పరుగులు మొత్తంగా 33. ఇందులో ఓ గోల్డెన్ డక్ ఉంది. పాదానికి గాయం కారణంగా ఐదో టీ20కి గిల్ దూరమవ్వడంతో.. యాజమాన్యం మళ్లీ సంజూ వైపే చూసింది. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఓపెనర్‌గానే బరిలోకి దింపింది. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు సంజూ. కేవలం 22 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.
ఎందుకు?
గిల్(Shubman Gill) మూడు మ్యాచుల్లో చేసిన పరుగుల(33) కంటే సంజూ ఒకే ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులే(37) ఎక్కువ. గిల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన సంజూ రాణించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri).. మేనేజ్‌మెంట్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
‘తుది జట్టులో సంజూ అసలు ఎందుకు లేడు? ఇలాంటి దూకుడుగా ఆడే ఆటగాడిగా పక్కన పెడతారా? ఓ ఆటగాడు గాయపడితే సంజూకి స్థానం దక్కుతుందా? టాపార్డర్‌లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికాలో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్’ అని రవి శాస్త్రి అన్నాడు.
ఇవీ చదవండి:
గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య.. ఏం చేశాడంటే?
ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్