Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 71 మంది సజీవదహనం
ABN, Publish Date - Aug 20 , 2025 | 08:46 AM
అధిక వేగంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 71 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాబూల్, ఆగస్టు 20: ఆఫ్ఘానిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో మోటర్ సైకిల్‌తో ట్రక్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 71 మంది సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికులు.. బస్సు ప్రయాణికులేనని పోలీసులు తెలిపారు. ఇక ట్రక్కుతోపాటు బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు కూడా మరణించారని వివరించారు.
ఇక ప్రొవిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి ఈ ప్రమాద ఘటనకు స్పందించారు. అందుకు సంబంధించిన వీడియోను.. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. అయితే ట్రక్‌తోపాటు మోటార్ బైక్‌ను బస్సు ఢీకొన్న వెంటనే.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని అదుపు చేయడం కష్టసాధ్యమైందన్నారు. ఆ క్రమంలో బస్సులోని ప్రయాణికులను రక్షించడం సాధ్యం కాలేదని వివరించారు. ఇక బాధితుల గుర్తింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.
ఆఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా లక్షలాది మంది స్థానికులు.. ఇరాన్, పాకిస్థాన్‌లలో తలదాచుకొంటున్నారు. అయితే ఇటీవల వారిని ఇరాన్ బహిష్కరించింది. దీంతో ఆఫ్ఘాన్ వలసదారులను తీసుకువెళ్తున్న బస్సు.. రాజధాని కాబూల్‌కు వెళ్తుండా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక పోలీసులు వివరించారు. అంతేకాకుండా బస్సు అధిక వేగంతోపాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.
ఇక ఈ ఏడాది ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి 1.5 మిలియన్లకు పైగా ఆఫ్ఘాన్లు తిరిగి స్వదేశానికి చేరుకున్నారన్నారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతోన్న ఘర్షణలు, సంక్షోభాల కారణంగా.. ఆప్ఘానిస్థాన్ నుంచి కోట్లాది మంది ప్రజలు ఇరాన్, పాకిస్థాన్‌కు తరలిపోయి.. తలదాచుకొంటున్న సంగతి తెలిసిందే.
Updated Date - Aug 20 , 2025 | 09:08 AM