US Murder case: అమెరికా జంటహత్యల మిస్టరీ గుట్టురట్టు.. క్లూ ఇచ్చిన ల్యాప్‌టాప్.!
ABN, Publish Date - Nov 19 , 2025 | 06:06 PM
అమెరికాలోని న్యూజెర్సీలో 2017 మార్చిలో జరిగిన జంటహత్యల కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యలు జరిగిన తర్వాత.. భారత్‌కు తిరిగి వెళ్లిపోయిన ఓ యువకుడే ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా న్యూజెర్సీలోని మాపుల్‌షేడ్(Maple Shade)లో ఎనిమిదిన్నరేళ్ల క్రితం కుమారుడితో సహా దారుణ హత్యకు గురైన శశికళా నర్రా(Sasikala Narra) మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. 2017లో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు అసలు నిందితుణ్ని పట్టుకున్నారు. నిందితుడికి చెందిన ల్యాప్‌టాపే అతణ్ని పట్టించడంలో కీలక ఆధారంగా పనిచేసింది.
అసలేం జరిగందంటే..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హనుమంతరావు నర్రా(Hanumantha Rao Narra) అనే వ్యక్తి.. అమెరికా న్యూజెర్సీలోని మాపుల్‌షేడ్ ప్రాంతంలో నివాసముండేవాడు. ఈయనకు భార్య శశికళ నర్రా(40), కుమారుడు అనీశ్ సాయి నర్రా(7) ఉండేవారు. 2017 మార్చి 23న హనుమంతరావు విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి.. వారి అపార్ట్మెంట్‌లో భార్య సహా కొడుకు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. తల్లీకొడుకులు ఇద్దరిపై కత్తితో దారుణమైన కత్తిపోట్లు ఉండటాన్ని గమనించి.. వెంటనే పోలీసులు సమాచారమిచ్చాడు(Maple Shade Police). కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తొలుత భర్త హనుమంతరావుపై అనుమానం వ్యక్తంచేశారు. దీనికి తోడు.. అతడికి కేరళకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాలున్నాయని, అతడే భార్యాబిడ్డల హత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపించడంతో అతడిపై విచారణ చేపట్టారు. అయితే.. ఘటనా స్థలంలో లభించిన డీఎన్ఏ నమూనాలు అతడితో సరిపోలకపోవడంతో వదిలేశారు. చివరకు ఆ నమూనాలు హమీద్‌వేనని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.
నిందితుడు దొరికాడిలా..
నిందితుడు నజీర్ హమీద్(Nazeer Hameed).. హనుమంతరావుకు సహోద్యోగి. హమీద్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివసించేవాడు. హనుమంతరావు, హమీద్‌ల మధ్య విభేదాలున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ దిశగా విచారణ చేపట్టారు. అయితే.. హత్య జరిగిన సుమారు 6 నెలలకే హమీద్ భారత్‌కు తిరిగి వెళ్లినట్టు తెలుసుకున్నారు. దీంతో భారత్‌లోని సంబంధిత అధికారుల ద్వారా సంప్రదింపులు జరిపి హమీద్ డీఎన్ఏ నమూనా కావాలని పలుమార్లు కోరారు. అయితే నిందితుడు వాటిని పట్టించుకోకుండా మొహం చాటేశాడు. దీంతో అక్కడి అధికారులు.. న్యాయస్థానం సహకారంతో అతడు పనిచేసే కాగ్నిజెంట్ సంస్థ(Cognizant Technology Solutions)తో మాట్లాడి ఇండియాలో అతడు వినియోగించిన ల్యాప్‌టాప్(Laptop)ను తెప్పించుకున్నారు. దానిపై అతడి డీఎన్ఏ నమూనాలు సేకరించి, ఘటనా స్థలంలోని డీఎన్ఏ నమూనాలతో పోల్చిచూశారు. అతడి నమూనాలు సరిపోలడంతో గుట్టు రట్టయింది. దీంతో హమీద్‌ను నిందితుడిగా పేర్కొంటున్నారు అమెరికన్ పోలీసులు. నిందితుడు హమీద్‌ను తమకు అప్పగించాలని భారత విదేశాంగ శాఖ(Indian Ministry of Home Affairs)ను కోరారు.
ఈ దారుణమైన హత్యల వెనకున్న అసలు ఉద్దేశం ఏంటనే విషయమై ఇంకా స్పష్టత రాకపోయినా.. హనుమంతరావుకు, హమీద్‌కు మధ్య ఉన్న వ్యక్తిగత కక్ష్యలే హత్యకు ప్రేరేపించినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..
ఆత్మాహుతి అంటే బలిదానం.. వెలుగులోకి ఢిల్లీ పేలుళ్ల నిందితుడి సెల్ఫీ వీడియో..
Updated Date - Nov 19 , 2025 | 07:12 PM