Asthma Awareness: ఉబ్బసం నుంచి ఉపశమనం
ABN, Publish Date - May 06 , 2025 | 03:08 AM
ఉబ్బసం అనేది చికిత్సకు లొంగే పరిస్థితి మాత్రమే. వ్యాధిని ప్రేరేపించే అంశాలను గుర్తించి, సరైన పరీక్షలు, చికిత్సతో సమూలంగా అదుపులోకి తేయవచ్చు
ప్రపంచ ఆస్తమా దినోత్సవం
కీలెంచి వాత పెట్టాలనే సూత్రం ఉబ్బసానికి కూడా వర్తిస్తుంది. ఈ రుగ్మత ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే చికిత్స అందించడం సరి కాదు. ప్రేరేపించే అంశాలు, వయసు, తీవ్రతల ఆధారంగా తగిన చికిత్సా మార్గాన్ని ఎంచుకుంటే ఉబ్బసాన్ని అదుపు చేయడమే కాదు, దాన్నుంచి సమూలంగా విముక్తి పొందవచ్చు అంటున్నారు వైద్యులు.
ఉబ్బసాన్ని వ్యాధిగా పరిగణించకూడదు. దీన్నొక పరిస్థితిగానే భావించాలి. ఈ సమస్య చికిత్సకు లొంగడమే కాకుండా, సకాలంలో స్పందించి, తగిన చికిత్స తీసుకోగలిగితే దీన్నుంచి శాశ్వత విముక్తి కూడా పొందే వీలుంటుంది. నిజానికి ఉబ్బసం వ్యాధి, చికిత్స పట్ల ఉన్న అపోహలే వ్యాధి నియంత్రణకు అవరోధాలుగా మారుతున్నాయి. సమర్ధమైన చికిత్స అందుబాటులో ఉన్నా, వ్యాధిని అదుపులో ఉంచే ముందు జాగ్రత్త చర్యల పట్ల అవగాహన లేకపోవడం వల్ల సమస్యను అదుపు చేయలేకపోతున్నాం. ఉబ్బసాన్ని ప్రేరేపించే కారకాలను నిర్లక్ష్యం చేయడం, పక్కదారి పట్టించే లక్షణాలకు స్వీయ చికిత్సలను ఆశ్రయించడం... ఇలా ఈ వ్యాధిని చేతులారా పెంచి పోషించుకుంటున్నాం!
లెక్కలేనన్ని కారణాలు
ఉబ్బసానికి వయసుతో సంబంధం లేదు. ఈ సమస్య ఎవరికైనా, ఎప్పుడైనా తలెత్తవచ్చు. సాధారణ అలర్జీ కూడా దీర్ఘకాలంలో ఉబ్బసానికి దారి తీయొచ్చు. ఈ పరిస్థితికి ఇంకొన్ని కారణాలు ఏవంటే...
వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు
వాతావరణ కాలుష్యం వల్ల రావొచ్చు
జీవనశైలి, ఆహారశైలి మార్పులు రావొచ్చు
కృత్రిమ పదార్థ రంగులు, రసాయనాల వల్ల తలెత్తవచ్చు
ఫుడ్ అలర్జీ, డస్ట్ అలర్జీల వల్ల రావొచ్చు
కొందరు పుట్టుకతోనే రావొచ్చు
మరి కొందరికి బాల్యంలో తలెత్తవచ్చు
జన్యు ఉత్పరివర్తనల వల్ల రావొచ్చు
బొద్దింకలు, పూలపుప్పొడి వల్ల తలెత్తవచ్చు
పరిశ్రమల నుంచి వెలువడే పొగల వల్ల రావొచ్చు
ఈ లక్షణాల మీద కన్నేసి...
దగ్గు, పిల్లికూతలు, ఆయాసం.. ఈ మూడు ఉబ్బసం ప్రధాన లక్షణాలు. కానీ ఇవే లక్షణాలు సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్లలో కూడా కనిపిస్తాయి. కానీ అవి కొన్ని రోజులు వేధించి, తగ్గిపోతాయి. అలా కాకుండా పదే పదే అవే లక్షణాలు వేధిస్తూ ఉన్నా, ఒక రుతువులో మాత్రమే ఈ లక్షణాలు పెరుగుతున్నా ఉబ్బసంగా అనుమానించాలి. కొత్తగా బడికి వెళ్తున్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ప్రతి నెలా కనిపించినప్పుడు, ఆ లక్షణాలను ప్రేరేపించే అంశాలు, కుటుంబ చరిత్ర, తీవ్రతల ఆధారంగా ఉబ్బసాన్ని నిర్ధారించుకోవాలి. అయితే రుతుపరమైన వైరల్ ఇన్‌ఫెక్షన్లలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఉబ్బసాన్ని నిర్ధారించుకోవడం కోసం కొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. పెద్దల్లో కూడా అకస్మాత్తుగా ఉబ్బసం తలెత్తుతుంది.
పరీక్షలున్నాయి
ఉబ్బసాన్ని నిర్ధారించడం తేలికే! స్పైరోమెట్రీ, పీక్ ఫ్లో మెషిన్ పరీక్షలతో ఉబ్బసం తీవ్రత తెలుస్తుంది. మందులతో ఉబ్బసం లక్షణాలు అదుపులోకి రావడాన్ని బట్టి కూడా సమస్యను ఉబ్బసంగా నిర్ధారించుకోవచ్చు. లక్షణాలు పగలు తక్కువగా సాయంత్రం, రాత్రి వేళ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉబ్బసంగా నిర్ధారించుకోవచ్చు. అలాగే కొందరికి అలర్జీ పరీక్షలు కూడా అవసరమవుతాయి. అలాగే అలర్జీ సంకేతాలు, లక్షణాలకు సంబంధించిన ప్రశ్నావళులను పూరించడం ద్వారా, కలిగి ఉన్న అలర్జీల పట్ల స్పష్టత ఏర్పరుచుకుని, ఉబ్బసానికే దారి తీసే అవకాశాలను కూడా అంచనా వేయవచ్చు. వైద్యులు, ఈ పరీక్షలన్నిటినీ ఉబ్బసం నిర్వహణ సాధనాలుగా పరిగణిస్తారు. అలాగే కొందరు పిల్లల్లో వ్యాయామం చేసినప్పుడు మాత్రమే ఉబ్బసం ప్రేరేపితమవుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల చేత వ్యాయామం చేయించి, పల్మొనరీ ఫంక్షన్ టెస్ట్ చేపట్టి ఉబ్బసంగా నిర్థారించుకోవచ్చు. అలాగే కొందర్లో పిల్లికూతలు, ఆయాసం లేకుండా కేవలం దగ్గుతోనే ఉబ్బసం బయల్పడవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లల్లో పిల్లికూతల రూపంలో ఉబ్బసం బయటపడొచ్చు.
అలర్జీలున్నాయా?
గత రెండు దశాబ్దాల్లో మన దేశంలో ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోయాయి. ఇలా ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోయినప్పుడు మన శరీరం వ్యాధినిరోధకశక్తి స్పందన తీరు మారిపోతుంది. ఫలితంగా కొన్ని వాతావరణాలకు, భావోద్వేగాలకూ, పదార్థాలకూ శరీరం ప్రతికూలంగా స్పందించి, ఉబ్బసం లక్షణాలు వేధించడం మొదలుపెడతాయి. సాధారణంగా అలర్జీలన్నీ ఉబ్బసానికే దారి తీస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ముక్కు నుంచి నీరు కారే అలర్జిక్ రైనైటిస్ లాంటి 40% నుంచి 50% అలర్జీలు మాత్రమే ఉబ్బసానికి దారి తీస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో అలర్జీలు ఉబ్బసాలకు దారి తీసే అవకాశాలు ఎక్కువ. కానీ ఎక్కువ శాతం పిల్లల్లో అలర్జీ కారక ఉబ్బసం ఉన్నప్పటికీ, సరైన చికిత్సను అందించగలిగితే, వయసు పెరిగేకొద్దీ ఆ లక్షణాలన్నీ సమసిపోతూ ఉంటాయి.
చికిత్స ఇలా...
అకస్మాత్తుగా తీవ్ర ఉబ్బసం దాడి చేసినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఆ సమయంలో నెబ్యులేజేషన్‌తో పాటు ఆక్సిజన్ కూడా అవసరమవుతుంది. ఇన్‌హేలర్స్, స్టిరాయిడ్స్ కూడా అవసరమవుతాయి. దీర్ఘకాల ఉబ్బసం ఉన్నవారు అలర్జీలను తగ్గించుకోవడం అవసరం. కొందరికి అగరబత్తీలు, సాంబ్రాణి వాసనలకు ఉబ్బసం లక్షణాలు వేధిస్తాయి. వీళ్లు మాస్క్‌లు వాడుకోవాలి. స్వీట్లు తిన్నప్పుడు లక్షణాలు తీవ్రమైతే వాటికి దూరంగా ఉండాలి. చల్లని పదార్థాలు, కొన్ని రకాల పండ్లు, వంకాయ, గుడ్లు, నట్స్‌తో కూడా కొందర్లో ఉబ్బసం తలెత్తుతుంది. ఆ కారకాలను కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి. ఇన్‌హేలర్స్ వాడుకుంటే వాటికి అలవాటు పడిపోతాం అనే ఒక ప్రధాన అపోహ కూడా సర్వత్రా నాటుకుపోయింది. వీటిని ఉబ్బసం చివరి దశలోనే ఇన్‌హేలర్స్ వాడుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇవి వ్యాధి ప్రారంభంలో వాడుకోవలసినవి. మిల్లీగ్రాముల పరిమాణంలో ఔషధాన్ని కలిగి ఉండే ఇన్‌హేలర్స్ మాత్రల కంటే సున్నితమైనవి. ఇవి మాత్రల్లా రక్తంలో కలిసి శరీరమంతా ప్రవహించకుండా, నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తాయి. పైగా వీటికి దుష్ప్రభావాలు ఉండవు. సమస్య కూడా వెంటనే పరిష్కారమవుతుంది. కాబట్టి ఇన్‌హేలర్స్ అన్ని విధాలా సురక్షితమైనవి.
గ్లోబల్ ఇనీషియేటివ్ ఆస్తమా అనే లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ, ప్రతి ఏటా మే ఆరును ఆస్తమా దినంగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది.
ట్రిగ్గర్ కావొచ్చు!
కొందరికి ఐదు నిమిషాల ముందు వరకూ లేని ఆయాసం హఠాత్తుగా మొదలవుతుంది. భయపడినా, విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమకు లోనైనా క్షణాల్లో ఉబ్బసం లక్షణాలు కనిపించి ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తాయి. ఇలాంటివాళ్లు ఇన్‌హేలర్స్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. క్రీడాకారులైతే ఆటకు ముందు వీటిని వాడితే, ఉబ్బసం వేధించకుండా ఉంటుంది.
ఇన్‌హేలర్స్ సురక్షితం
ఉబ్బసానికి ఉత్తమమైన చికిత్స నెబ్యులైజర్స్, ఇన్‌హేలర్స్, స్టిరాయిడ్స్. చాలామంది వీటిని వాడడానికి ఇష్టపడరు. వైద్యులు ఇన్‌హేలర్స్ సూచించినప్పుడు వేరే మందులను సూచించమని వైద్యులను ఒత్తిడి చేస్తారు. కానీ ఉబ్బసానికి ఇన్‌హేలర్స్ సురక్షితమైన చికిత్స. తీవ్రతను బట్టి కొందరికి స్టిరాయిడ్స్ కూడా అవసరం పడొచ్చు. ఈ రెండూ ఇతరత్రా దుష్ప్రభావాలు కలిగించకుండా నేరుగా ఊపిరితిత్తుల మీదే పనిచేస్తాయి.
-డాక్టర్ పి. నవీన్ సారధి
కన్సల్టెంట్ పిడియాట్రిక్ పల్మొనాలాజిస్ట్,
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్,
హైదరాబాద్.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..
Updated Date - May 06 , 2025 | 06:02 AM