Banana Leaf Benefits: మన పూర్వీకులు అరటి ఆకుల్లో ఎందుకు తినేవారో తెలుసా?
ABN, Publish Date - Aug 15 , 2025 | 08:20 PM
భారతదేశంలో నేటికీ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అరటి ఆకులపై తింటుంటారు. అరటి ఆకులపై వడ్డించిన ఆహారం తినడం వల్ల (Benefits of Eating in Banana Leaf) అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మధుమేహం, జీర్ణక్రియతో పాటు ఉబ్బసం వంటి వ్యాధుల నియంత్రణకు సాయపడుతుంది. వీటితో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.
మన పూర్వీకుల్లో దాదాపు అందరూ అరటి ఆకుల్లోనే తినేవారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో నేటికీ చాలా మంది అరటి ఆకులపైనే తినడానికి ఇష్టపడతారు. సాధారణంగా అయితే పండుగలు , శుభకార్యాలు, వివాహాలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం మాత్రమే కాదు, పర్యావరణానికి మేలు చేసే మంచి మార్గం కూడా. కానీ చాలా మందికి దీని ప్రయోజనాల గురించి తెలియదు. ఆయుర్వేదం ప్రకారం, అరటి ఆకులపై తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇంతకీ, అరటి ఆకుల్లో తింటే కలిగే లాభాలేంటి? ఎందుకు మంచిదో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుదల
అరటి ఆకులలో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ఇతర సహజ పోషకాలు ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. వేడి ఆహారాన్ని అరటి ఆకులపై వడ్డించినపుడు.. ఆకులోని ఈ పోషకాలు తేలికగా ఆహారంతో కలిసిపోయి ప్రత్యేక రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ఆహార రుచిని పెంచుతుంది
మెత్తని అరటి ఆకుపై రుచికరమైన వేడి ఆహారాన్ని వడ్డించినప్పుడు ఒక ప్రత్యేకమైన సహజ వాసన వెలువడుతుంది. ఈ వాసన భోజనాన్ని మరింత రుచికరంగా చేస్తుంది.
పర్యావరణ పరిరక్షణ
అరటి ఆకులు పూర్తిగా సహజమైనవి. నూరుశాతం భూమిలో కరిగిపోతాయి. వీటిని పారవేసిన తర్వాత సహజంగా కుళ్ళిపోయి నేలకు ఎరువుగా మారుతాయి. ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాల మాదిరిగా ఇవి పర్యావరణానికి ఏ విధంగానూ హాని కలిగించవు.
వేడి ఆహారం
అరటి ఆకుల్లో వేడి వంటకాలను వడ్డించినపుడు చీలిపోవు. వాటిపై ఉన్న సహజ మైనపు పొర ఆహారం అంటుకోకుండా నిరోధిస్తుంది. అదనంగా, వేడి కారణంగా ఎటువంటి హానికరమైన రసాయనాలు ఉత్పత్తి కావు.
జీర్ణక్రియకు మంచిది
అరటి ఆకుల్లో తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ ఆచారం శరీరంలో సానుకూల శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది.
అరటి ఆకుల్లో విటమిన్లు బి, సి, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రతిరోజూ భోజనం తినడం వల్ల మధుమేహం, అధిక బరువు, అజీర్ణం, ఆస్తమా వంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ పద్ధతి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
ఈ 5 సమస్యలున్న వ్యక్తులు కందిపప్పు తినకూడదు..!
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..
Updated Date - Aug 15 , 2025 | 08:24 PM