Liver Health: లివర్ హెల్త్ కోసం వర్షాకాలంలో తప్పక తీసుకోవాల్సిన 5 ఆహారాలు..
ABN, Publish Date - Jun 28 , 2025 | 08:36 AM
Monsoon Liver Care Tips: వర్షాకాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. చల్లని వాతావరణంలో రోడ్డు పక్కన అమ్మే వేడి వేడి పకోడీలు, బజ్జీలు లాంటి ఆహారాలను విపరీతంగా తినేస్తుంటారు. కానీ, మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పక తీసుకోవాలి.
Monsoon Diet For Liver Health: వర్షాకాలంలోని చల్లటి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతూనే.. వ్యాధులు ప్రబలేందుకు అనుకూలంగా ఉంటుంది. వాన కురిసిన ప్రతిసారీ రోడ్లు జలమయం అయిపోయి.. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉంటుంది. అదీగాక చాలామంది ఈ సీజన్లో బయట అమ్మే పకోడీలు, బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ తరహా ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి మీ కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదముంది. కాబట్టి, లివర్ ఆరోగ్యం కోసం వర్షాకాలంలో కింద చెప్పిన 5 రకాల ఆహారాలు తప్పక తీసుకుంటూ ఉండండి.
వర్షాకాలం వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందించినప్పటికీ.. ఈ కాలంలో తీసుకునే ఆహారం కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించే అవకాశముంది. అంతేగాక, ఈ సీజన్లో తేమతో కూడిన వాతావరణం, జీర్ణక్రియలో అవాంతరాలు కారణంగా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, ఈ సమయంలో ప్రతిఒక్కరూ రోగనిరోధకశక్తిని పెంచుకోవడంపై శ్రద్ధ వహించాలి. ఇందుకోసం శరీరంలోని విషపదార్థాలను ఫిల్టర్ చేసి జీర్ణక్రియకు, జీవక్రియకు తోడ్పడే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ప్రస్తుతం మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD)గా వర్గీకరించబడిన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటి కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, MASLD ప్రధానంగా ఆల్కహాల్ వినియోగం కంటే జీవక్రియలు సరిగా లేనివారిలోనే వస్తుంది. ప్రధానంగా ఊబకాయం, మధుమేహం, హైపర్ కొలెస్టెరోలేమియా వంటి సమస్యలు ఉన్నవారిలో అధికం. హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక ప్రకారం చూస్తే, 2024లో లివర్ టెస్ట్ చేయించుకున్న 65% మంది వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ సంకేతాలు ఉన్నట్లు తేలింది.
వర్షకాలంలో కాలేయ ఆరోగ్యం కోసం రోజూ తీసుకోవాల్సిన 5 ఆహారాలు..
1. పసుపు
పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం కాలేయాన్ని హానికర టాక్సిన్ల నుంచి రక్షిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. మీరు గనక ప్రతిరోజు పాలు లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు పసుపు కలిపి తాగారంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
2. ఆకుకూరలు
ఆకుపచ్చని తాజా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలికూర ఇలా ఏ ఆకుకూర అయినా సరే. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తాయి. తక్కువ కేలరీలు ఉండే ఆకుకూరలను రోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. ఇవి ప్రేగులో కదలికలను పెంచి కాలేయ గోడలపై కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి.
3. సిట్రస్ పండ్లు
నిమ్మకాయలు, నారింజలు, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరిచేందుకు సాయపడుతుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపడతో పాటు లివర్ తనను తాను మరమ్మతు చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఇక, ద్రాక్షపండులోని నరింగెనిన్ అనే సమ్మేళనం కాలేయ కణాలలో కొవ్వు నిల్వ ఉండకుండా ఆపగలదు.
4. అల్లం
వానాకాలంలో తడి వాతావరణం కారణంగా జలుబు వ్యాప్తి చెందే అవకాశమెక్కువ. ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బందిపెట్టకూడదన్నా.. శరీరంలో వేడి పెరగాలన్నా.. అల్లం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది కాలేయ ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను అందించడంతో పాటు.. మందగించిన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జలుబు చేసినప్పుడు అల్లం పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక, రోజువారీ ఆహార పదార్థాల్లోనూ అల్లం ఉండేలా చూసుకుంటే మంచిది.
5. బొప్పాయి
బొప్పాయిని సాధారణంగా ఎవరూ 'సూపర్ ఫుడ్' జాబితాలోనూ చేర్చరు. కానీ, మృదువైన ఆకృతి, తేలికపాటి తీపి ఉండే ఈ పండు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గొప్ప ఆహారం. ముఖ్యంగా కడుపు నిండా తిన్నాక కడుపులో భారంగా అనిపిస్తే ఈ పండ్ల ముక్కలను కాసిన్ని నోట్లో వేసుకుంటే చాలు. ఇట్టే కడుపు భాగం తేలికపడుతుంది. బీటా- కెరోటిన్, విటమిన్ సి సమృద్ధిగా ఉండే బొప్పాయి కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారా? ఈ సమస్యలు తప్పవు.. సైంటిస్టుల సర్వేలో
పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?
For More Health News
Updated Date - Jun 28 , 2025 | 09:25 AM