Jubilee Hills Bypoll: కిషన్ రెడ్డికి పొన్నం సవాల్
ABN, Publish Date - Nov 03 , 2025 | 08:22 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు.
హైదరాబాద్, నవంబర్ 03: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఈ పదేళ్లలో ఏం చేశారో చెప్పగలరా? అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జి. కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోనే ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి ఆయన గుర్తు చేశారు.
అలాంటి ఈ నియోజకవర్గంపై మీరు కనీసం శ్రద్ధ కూడా పెట్టలేదంటూ విమర్శించారు. అలాంటి మీరు.. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ.. మీ ప్రగల్భాలు చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పొన్నం చురకలంటించారు.
సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాస్తా ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పది వేల ఓట్లు కూడా దాటవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ సందర్భంగా పొన్నం ఛాలెంజ్ విసిరారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద జోక్ అని అభివర్ణించారు. గతంలో ఇదే జూబ్లీహిల్స్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచి 25 వేల ఓట్లు మాత్రమే ఆయనకు పోలైన విషయాన్ని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అతడికి ఈ ఎన్నికల్లో 10 వేల కంటే ఎక్కువ ఓట్లు రావని జోస్యం చెప్పారు.
మీరు నేరుగా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మకై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి.. ప్రచార సరళి మొత్తం దింపుడు కళ్లెం ఆశలాగా మారిందన్నారు. ఈ ఎన్నికల వేళ.. బీజేపీ వ్యవస్థనంతా బీఆర్ఎస్ చేతిలో పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వారి మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురు భక్తిగా మీరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నారని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యువతలో పెద్ద చర్చ నడుస్తుందన్నారు.
ఇప్పటికైన నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా.. మీ పార్టీని బీఆర్ఎస్‌కు అమ్మకుండా నిజాయితీగా పని చేయమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్లు వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
Updated Date - Nov 03 , 2025 | 08:22 PM