Bihar Elections: హింసను సహించేది లేదు.. బిహార్ ఘటనపై సీఈసీ
ABN, Publish Date - Nov 02 , 2025 | 06:51 PM
ఏడు కోట్ల మంది పేర్లతో ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేశామని, ఒక్క నకీలీ ఓటును చేర్చడం కానీ, అర్హులను తొలగించడం కానీ జరగలేదని సీఈసీ చెప్పారు. ఎన్నికల యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, భద్రతా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాన్పూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జన్‌సురాజ్ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ ఇటీవల హత్యకు గురైన ఘటన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) స్పందించారు. హింసను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని కాన్పూర్‌లో ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
'ఎన్నికల్లో హింసాత్మక ఘటనలను సహించేది లేదు. బిహార్‌లో శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రజలందరూ పండుగలు జరుపుకున్నట్టుగానే ప్రజాస్వామ్య పండుగలోనూ పాలుపంచుకోవాలని కోరుతున్నాను. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు వస్తారని ఆశిస్తున్నాను' అని జ్ఞానేశ్ కుమార్ అన్నారు.
ఏడు కోట్ల మంది పేర్లతో ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేశామని, ఒక్క నకీలీ ఓటును చేర్చడం కానీ, అర్హులను తొలగించడం కానీ జరగలేదని చెప్పారు. ఎన్నికల యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, భద్రతా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బిహార్ ఎన్నికలు దేశానికే కాకుండా, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలకు సైతం ఒక ఉదాహరణగా నిలిచేందుకు ఈసీ కృషి చేస్తోందన్నారు. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 02 , 2025 | 08:17 PM