Share News

PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:11 AM

దేశం, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో మావోయిస్టు...

PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి

  • ఛత్తీస్‌గఢ్‌ రజత్‌ మహోత్సవ్‌లో ప్రధాని మోదీ

రాయ్‌పూర్‌, నవంబరు 1: దేశం, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో మావోయిస్టు ప్రభావితజిల్లాల సంఖ్య గత 11 ఏళ్లలో 125 నుంచి మూడుకు పరిమితం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. నవ రాయ్‌పూర్‌లో ఛత్తీ స్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ‘ఛత్తీ్‌సగఢ్‌ రజత్‌ మహోత్సవ్‌’లో ఆయన మాట్లాడారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టుల హింసతో నలిగిపోయిన ఈ రాష్ట్రం నేడు దాన్నుంచి విముక్తి చెందడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమన్నారు. మావోయిస్టు సిద్ధాంతం గిరిజన ప్రాంతాల్లో కనీస అవసరాలు కూడా తీరకుండా చేసిందన్నారు. ఏళ్లుగా గిరిజన గ్రామాలకు రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ‘‘ఆఖరికి ఉన్నవాటిని కూడా బాంబులతో పేల్చివేశారు.. వైద్యులను, ఉపాధ్యాయులను చంపారు.. మరోవైపు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారు తాము ఏసీ గదుల్లో ఉంటూ.. మిమ్మల్ని పట్టించుకోలేదు.’’ అని ప్రధాని విమర్శించారు. కొద్ది నెలలుగా రూ.లక్షలు, కోట్ల రివార్డులు ఉన్నవారు సహా పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. వారు నేడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి శాంతి బాట పట్టారని ఆయన తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 04:11 AM