నేరస్తులెవరు బాధితులెవరు
ABN, Publish Date - May 08 , 2025 | 02:09 AM
రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్ళు ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు వింటూంటే త్వరలోనే యుద్ధం ఆగుతుందని ఒకసారి, మరింత సాగుతుందని మరోసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ విషాద నాటకంలో పాత్రధారులు తక్కువేం లేరు. అమెరికా, మిగతా నాటో దేశాలు...
రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్ళు ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు వింటూంటే త్వరలోనే యుద్ధం ఆగుతుందని ఒకసారి, మరింత సాగుతుందని మరోసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ విషాద నాటకంలో పాత్రధారులు తక్కువేం లేరు. అమెరికా, మిగతా నాటో దేశాలు, రష్యా–ఉక్రెయిన్ దేశాల పాలకులు ప్రధానం. ఈ యుద్ధంలో ఇరు దేశాల ప్రజలూ, సైనికులూ బాధితులు. మరి, నేరగాళ్లెవరు? వీరిలో ఎవరెక్కువ నేరగాళ్లో చూద్దాం. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. అమెరికా ఏకఛత్రాధిపత్యానికి మార్గం సుగమమైంది. అది రెండు జర్మనీలూ కలిసిపోతున్న సందర్భం. ఒక జర్మనీ వార్సా (సోవియట్) కూటమిలోనూ, రెండోది, నాటో (అమెరికా) కూటమిలోనూ ఉన్నాయి. ఆ రెండూ కలిసిపోయి నాటో కూటమికి వచ్చేస్తే నాటో ఇక తూర్పు వైపుకి ‘‘ఒక్క అంగుళం కూడా విస్తరించదు’’ అని ఆనాటి అమెరికా అధ్యక్షుడు బుష్(పెద్ద)... గర్బచోవ్‌కి హామీ ఇచ్చాడు. ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత నాలుగేళ్లకి వార్సా కూటమి రద్దయింది. కనుక నాటో కూటమిని కూడా రద్దు చేయండన్న డిమాండ్ రష్యా నుంచే కాక, పశ్చిమ ప్రపంచంలో ప్రముఖుల నుంచి కూడా వచ్చింది.
నాటో– ఒక సైనిక కూటమి. అందులోని ఒక దేశం మరో బయటి దేశంతో కయ్యానికి దిగితే, మొత్తం నాటో దేశాలన్నీ ఆ బయటి దేశం మీద దాడికి పాల్పడవచ్చు. అటువంటప్పుడు నాటోలో చేరాలనుకోవడం సింపుల్‌గా ఎవరిష్టం వాళ్లది అనవచ్చా? గత ఎనభై ఏళ్ల చరిత్రలో జరిగిన వందలాది యుద్ధాలలో 90 శాతం యుద్ధాలు అమెరికా ప్రమేయంతో జరిగినవే. అమెరికా ఉందంటే, దానితోపాటు తోకల్లా నాటో దేశాలూ ఉంటాయి. అమెరికా అన్ని యుద్ధాలూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే చేస్తున్నా అంటుంది. అది ప్రజాతంత్రయుతంగానో లేదా విప్లవం ద్వారానో ఏర్పడిన ప్రభుత్వాల్ని కూల్చి, నియంతల్ని నిలిపిన ఘటనలు కొల్లలు. అయినా తాను గొప్ప ప్రజాతంత్రవాదినే అని బుకాయిస్తుంది అమెరికా.
తూర్పు వైపు ఒక్క అంగుళం కూడా జరగం, అన్న హామీ 1999లోనే గాలిలో కలిసిపోయింది. ఆ ఏడాది... పోలెండు, హంగరీ, చెక్ రిపబ్లిక్‌నీ నాటోలో చేర్చుకొన్నారు. రష్యా గోల చేసింది. నాటో లెక్క చేయలేదు. నాటో విస్తరణ తప్పని పశ్చిమ దేశాల ప్రముఖులూ చెప్పారు. ఇది ‘విషాదకరమైన పొరబాటు’ అని పశ్చిమ దేశాలకి చెందిన 50 మంది విదేశాంగ విధాన నిపుణులు బిల్ క్లింటన్‌కి చేసిన విజ్ఞప్తిలో హెచ్చరించారు. నాటో ఖాతరు చేయలేదు. తర్వాత 2004–09 మధ్య, బల్గేరియా, రుమేనియా, లాత్వియా, ఇస్తోనియా, స్లావోనియా, లిథువేనియా, క్రోవేషియానీ నాటో చేర్చుకొంది. ఇదంతా రష్యాపై ఒత్తిడి పెంచడానికి తప్ప, వేరే కారణమే కనిపించదు. మళ్లీ రష్యా మొత్తుకుంది. నాటో ఖాతరు చెయ్యలేదు. 2017–20లలో మాంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా దేశాలనీ అది చేర్చుకొంది. ఆ రెండూ కూడా రష్యాకి అతి సమీపంగా ఉన్న దేశాలే. ఇదంతా రష్యా చుట్టూ కమ్ముకురావడమే.
యూరపు దేశాలనిగానీ, అమెరికానిగానీ రష్యా రెచ్చగొట్టిన దాఖలాలేమీ లేవు... నాటో విస్తరణకి నిరసన చెప్పడం తప్ప. అయినా 2021లో మరో అరడజను దేశాలను నాటోలో చేర్చుకోవచ్చన్న వార్తలు వచ్చాయి. అవి– బోస్నియా, హెర్జెగోవ్నా, జార్జియా, ఉక్రెయిన్, ఫిన్లాండు, స్వీడన్, సెర్బియా. ఈ దశలో యూరప్, అమెరికాలకి చెందిన ప్రముఖులు మరోసారి నాటో విస్తరణని తప్పుబట్టారు. ఇక్కడ స్పష్టంగా రష్యా బాధితురాలు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ లాంటి దేశాలన్నీ అకారణంగా రష్యాని నాశనం చెయ్యాలనుకుంటున్నాయి. బైడన్ అధ్యక్షుడిగా ఉన్నంతవరకూ అమెరికా వైఖరి కొంతవరకు మనకి అర్థమవుతుంది. ప్రపంచంలో తన రౌడీయిజాన్ని అడ్డుకోగలిగిన సైనిక శక్తి ఇప్పటికీ రష్యాకి ఉంది. అందుకే రష్యా అంటే, అమెరికాకు అంతులేని చికాకు. మరి యూరప్ దేశాలకి రష్యా పట్ల అంత ద్వేషం ఎందుకుండాలో మాత్రం మనకి అర్థంకాదు. మొత్తం మీద బైడన్, స్టార్మర్ లాంటివాళ్లు బైటికి చెప్పిన కారణం ఏమంటే, పుతిన్ ఒక నియంత, దుర్మార్గుడు. కాబట్టి అతను పోవాలి. అక్కడికేదో అమెరికాకీ, దాని ఉపగ్రహాలకీ నియంతలంటే ద్వేషం అన్నట్టుగా. రష్యాలో పుతిన్‌ని వ్యతిరేకిస్తున్న ప్రధాన పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అమెరికా పాలకుల సాకులను చూస్తే వారు కొంపదీసి రష్యాలో పుతిన్‌ని కూలదోసి కమ్యూనిస్టుల్ని గద్దెనెక్కిస్తారేమో అనిపిస్తుంది.
రష్యా వైపు నుంచి చూద్దాం. 2021 వరకూ రష్యా చుట్టూ నాటో ఎలా కమ్ముకొస్తోందో చూశాం. అంతిమంగా, తాను నాటోకి దాసోహం అనే దాకా దాని విస్తరణ ఆగదు అని రష్యాకి అర్థం కాదా? ఇక ఇప్పుడు కూడా యుద్ధాన్ని వాయిదా వెయ్యడమంటే, భవిష్యత్తులో తాను కాళ్లూ చేతులూ కదపలేని స్థితిలో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం కాదా? అందుకే, రష్యా 2022 ఫిబ్రవరిలో యుద్ధభేరి మోగించింది. పుతిన్ స్థానంలో ఎవరున్నా ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. యుద్ధం మొదలుకాగానే, విదేశీ బ్యాంకుల్లో ఉన్న రష్యా డబ్బుల్ని స్తంభింపజేశారు. అది మూడు వందల బిలియన్ డాలర్లు. దానిపై వచ్చే వడ్డీని నాటో దేశాలు వాడేసుకుంటున్నాయి. ఇది ఏ రకమైన వాణిజ్య నీతో తెలియదు. అంతులేనన్ని ఆర్థిక ఆంక్షల్ని రష్యాపై వారు రుద్దారు.
ఆనాడు అమెరికా నాయకత్వాన యూరపు దేశాలు ఉక్రెయిన్‌లో పన్నిన కుట్రలన్నీ, ఇప్పుడు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. అక్కడ 2009లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యెనుకోవిచ్ గెలిచాడు. అతని మొగ్గు రష్యా వైపు ఉన్నా, విధానాల పరంగా తటస్థ వైఖరి అనుసరించాడు. 2014లో వేలాదిగా ప్రజలు అతని పాలనపై తిరగబడ్డారు. యెనుకోవిచ్ రష్యా పారిపోయాడు. ఆ తర్వాత పరొషెంకో అనే నాటో అనుకూలుడు అధ్యక్షుడయ్యాడు. ఇక్కడే ఒక మతలబు ఉంది. ఆనాటి ఉక్రెయిన్ ప్రజలు వారంతటవారే స్వచ్ఛందంగా తిరగబడలేదని ఇటీవల తెలిసింది. మచ్చుకి... జెఫ్రీ సాక్స్ అనే అమెరికా ఆర్థిక నిపుణుడు సరిగ్గా ఆ సమయానికి ఉక్రెయిన్‌కి ఆర్థిక సలహాదారుగా వచ్చాడు. వేల సంఖ్యలో జనం పోటెత్తిన ‘మైదాన్’కి వెళ్లాడు. అమెరికా అధికారులు ఆ తిరుగుబాటుని ఆర్గనైజ్ చేసిన ముఠాలకి డబ్బులు పంచడం స్వయంగా చూశాడు. వారిలో నియో నాజీలు కొల్లలుగా ఉన్నారు. వారే అల్లర్లు సృష్టించి, జనాన్ని విచ్చలవిడిగా చంపారు. అదే ఇటీవల జెఫ్రీ సాక్స్ బయటపెట్టాడు. ఆ సంగతినే అప్పుడు రష్యా మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల ట్రంప్ దూత విట్కాఫ్... రష్యాకి వ్యతిరేకంగా ప్రచారం కోసమూ, రష్యాను రెచ్చగొట్టడానికీ 2014లో, అమెరికా ఐదు బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది అంటున్నాడు. పరొషెంకో అధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్ తూర్పున డాన్‌బాస్ ప్రాంతంలో జనాన్ని టెర్రరిస్టులు అని ముద్రవేసి ఊచకోత కోశారు. అక్కడ ఎక్కువమంది సోవియట్ కాలంలో ఉక్రెయిన్‌లో స్థిరపడిన రష్యన్లు. 2019లో అధికారానికి వచ్చాక, జెలెన్‌స్కీ కూడా ఆ పనే చేశాడు. అక్కడ రష్యన్ భాషపై ఆంక్షలు పెట్టాడు.
ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారకులు– 1. అమెరికా పాలకులు, 2. మిగతా నాటో దేశాల పాలకులు, 3. ఈ ఇద్దరి దన్ను చూసుకొని రష్యాని రెచ్చగొట్టిన ఉక్రెయిన్ నేతలు. వీరితో రష్యా నేత పుతిన్‌ని చేర్చక తప్పదు అంటే, అతన్ని సగం నేరగానిగానూ, సగం బాధితునిగానూ పరిగణించాలి.
ఎ. గాంధీ
సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Updated Date - May 08 , 2025 | 02:09 AM