ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telanganas Cultural Policy: సాంస్కృతిక విధానం మాటేమైంది

ABN, Publish Date - Nov 08 , 2025 | 05:28 AM

తెలంగాణ ఏర్పడిన పుష్కర కాలానికి పర్యాటక శాఖ విధానాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ కళాకారులకు సంబంధించిన ‘సమగ్ర సాంస్కృతిక విధానం’ను నేటికీ పాలకులు రూపొందించలేదు...

తెలంగాణ ఏర్పడిన పుష్కర కాలానికి పర్యాటక శాఖ విధానాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ కళాకారులకు సంబంధించిన ‘సమగ్ర సాంస్కృతిక విధానం’ను నేటికీ పాలకులు రూపొందించలేదు. దీనికోసం గతంలో 20 మందితో సాంస్కృతిక శాఖ సలహామండలిని ప్రభుత్వం ప్రకటించింది. సంబంధిత అధికారులు మూడుసార్లు సమావేశమయ్యారు. కళాకారులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా నేటికీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ పాలసీని కోరుతూ రెండుసార్లు రవీంద్రభారతిని కళాకారులు ముట్టడించారు. ఆరు గంటల సేపు దీక్షలు చేపట్టారు. అయినా ఫలితం లేదు. ఈ విధాన రూపకల్పనలో గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వమూ ఉదాసీనత ప్రదర్శిస్తోంది. ‘పాలకులంతా ఒక తాను ముక్కలే’ అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిజానికి కల్చరల్‌ పాలసీ ఆలోచన నేటిది కాదు. మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ దీనికి బీజం వేశారు. ‘ఏ దేశానికైనా, ఏ భాషకైనా, ఏ కళలకైనా, ఒక స్పష్టమైన సాంస్కృతిక ప్రణాళిక ఉండాలి’ అని చెబుతూ ‘మెహతా కమిటీ’ వేశారు. జానపద సాహిత్యం, సంస్కృతి, నాటకం, సినిమా తదితర రంగాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని ఆ కమిటీకి నెహ్రూ నిర్దేశించారు. తెలంగాణ సంస్కృతి విలక్షణమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు పోషించిన పాత్ర అనితరసాధ్యమైనది. కానీ రాష్ట్రంలో ‘సాంస్కృతిక విధానం’ లేకపోవడంతో కళలకు, కళాకారులకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. రాష్ట్రంలో కళాకారుల సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో కళాకారుల్లో భాగమైన జానపదులు ఎంతగానో నష్టపోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 36 జానపద కళారూపాలు వాటి ఉనికిని కోల్పోయాయి. ఇంకా 65కు పైగా కళారూపాలు కొన ఊపిరితో ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలో మనుషులకే కాదు... ప్రతి పల్లెకు, చెరువుకు, నదికి, కొండకు, కోటకు, కోనకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలుపమని జానపదులను కదిపితే ఎన్నో ఆసక్తికర విషయాలను చెబుతారు. ఇది వారికి వారసత్వంగా వస్తున్న కళ. సర్దార్ పాపన్న, పండుగ సాయన్న, మీరాసాయబ్, సమ్మక్క–సారలమ్మ తదితరుల వీరగాథలన్ని వీరి కంఠంలో ప్రతిధ్వనిస్తాయి. జానపద కళాకారులు తరాల సంస్కృతీ ప్రదాతలు.

శ్రమైక జీవన సౌందర్య దృష్టికి ప్రతిరూపాలు. నేడు రాష్ట్రంలో జానపదుల పరిస్థితి దయనీయంగా ఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి మరింతగా దిగజారుతోంది. వారిని కదిలిస్తే కన్నీటి గాథలే. ‘మా కులాలకు, మా కళలకు ఆదరణ లేదయ్యా. తరతరాలుగా కుల పురాణాలను ఆట పాటలతోనూ, మా వాద్య పరికరాలతోనూ గానం చేస్తూ అలరించాం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కళాకారుల ప్రదర్శనల్లో, నినాదాల్లో మా గొంతులనూ జతకలిపాం. కానీ నేడు పాలకులు పట్టించుకోకపోవడంతో చావలేక బతుకీడుస్తున్నాం’ అంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వీళ్లంతా పాలకులు విస్మరించిన జనం. ఓటు బ్యాంకు లేని సంచార, మైనార్టీ కులం. ఇలా సామాజిక వివక్షకు, అణచివేతకు, పాలకుల నిర్లక్ష్యానికి గురైన అట్టడుగు జాతుల వారిని ఉద్దేశిస్తూ.. ఇహెచ్ కార్ అనే చరిత్రకారుడు ‘what is history? History from below’ అంటాడు. అట్టడుగు వర్గాల నుంచే చరిత్ర వచ్చిందంటూ వివరించాడు. కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ‘జానపద అకాడమీ’లను ఏర్పాటు చేసుకుని కళల్ని, జానపద కళాకారుల్ని సంరక్షించుకుంటున్నాయి. తెలంగాణలో ఈ కృషి ఎందుకు జరగడం లేదో పాలకులు, సాంస్కృతిక సలహామండలి ఆలోచించాలి. జానపద కళల, ఇతర కళాకారుల అభివృద్ధికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ‘సమగ్ర సాంస్కృతిక విధానం’ రూపకల్పనకు నడుం బిగించాలి.

భూపతి వెంకటేశ్వర్లు

ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 05:28 AM