Share News

CM Chandrababu: రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 07 , 2025 | 06:26 PM

ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజల కోసం అన్నదాతలు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. తాను ఐటీని ప్రోత్సహించి ఎందరో రైతన్నల బిడ్డలను ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లేలా చేశానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు
CM Chandrababu On Acharya NG Ranga Jayanti

అమరావతి, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా కేవలం 33 ఏళ్ల వయసులో ఆంధ్రా రైతాంగ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కొనియాడారు. రైతులకు శిక్షణా పాఠశాల పెట్టి శిక్షణ అందించారని ఉద్ఘాటించారు. ఓవైపు దేశం కోసం మరో వైపు రైతుల కోసం ఆచార్య ఎన్జీ రంగా పోరాడారని నొక్కిచెప్పారు. ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యత సాధించిన రంగా.. మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని నొక్కిచెప్పారు. సైమన్ కమిషన్ గో బ్యాక్, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆచార్య ఎన్జీ రంగా పాల్గొన్నారని కీర్తించారు సీఎం చంద్రబాబు.


ఆచార్య ఎన్జీ రంగా పార్లమెంట్‌లో ఉన్నంత కాలం రైతులు సుభిక్షంగా ఉంటారని జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు చెప్పారని ఉద్ఘాటించారు. ఆచార్య ఎన్జీ రంగా చేసిన పోరాటాలకు పద్మ విభూషణ్‌తో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయని కీర్తించారు. తాను మొదటిసారి సీఎం కాగానే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్జీ రంగా పేరు పెట్టానని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత యూనివర్సిటీ పేరు మార్చారని తెలిపారు. దీంతో ఏపీలో రంగా పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.


రైతులకు పంటల బీమా చెల్లింపులో ఇబ్బంది లేకుండా చేశామని చెప్పుకొచ్చారు. కౌలు రైతులు ఎక్కువ భూమిలో వ్యవసాయం చేస్తున్నారని.. నష్టాలు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. గుంటూరులో ఇవాళ(శుక్రవారం) ఆచార్య ఎన్జీ రంగా జయంతి సభ జరిగింది. ఈ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతితో పాటు వందేమాతరం 150 వసంతాల వేడుకలు ఒకే రోజు రావటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. ఆచార్య ఎన్జీ రంగా 33 ఏళ్ల వయస్సులో ఆంధ్రా రైతాంగ ఉద్యమాన్ని నడిపించారని కొనియాడారు. 1964లో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పార్లమెంట్‌లో ఆచార్య ఎన్జీ రంగా పోరాడారని కీర్తించారు. ప్రాంతాలకు అతీతంగా నాలుగుచోట్ల ఎంపీగా గెలిచిన చరిత్ర ఆచార్య ఎన్జీ రంగాది అని ప్రశంసించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖుల్లో ఎన్జీ రంగా ఒకరని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.


ప్రాంతాలకు అతీతంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఎంపీగా గెలిచిన అరుదైన వ్యక్తి ఎన్జీ రంగా అని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పీహెచ్‌డీ కోసం పని చేశామని ఉద్ఘాటించారు. దేశం కోసం పిల్లలు వద్దనుకుని జీవించిన రంగా దంపతులు ఆదర్శనీయులని కొనియాడారు. తాను మొదటిసారి మంత్రి అయిన సమయంలో ఎన్జీ రంగా కూడా మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.


ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రజల కోసం అన్నదాతలు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. తాను ఐటీని ప్రోత్సహించి ఎందరో రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లేలా చేశానని నొక్కిచెప్పారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి రైతన్నల ఆదాయం పెంచటంపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. అన్నదాతలకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి, దిగుబడి పెరగాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.


జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) హయాంలో ప్రాజెక్టుల నిర్వాహణని గాలికొదిలేశారని, కనీసం గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని ఆరోపించారు. 2014 నుంచి 2019 మధ్యలో వ్యవసాయ రంగంలో జీఎస్డీపీ 6 శాతం పైగా పెరిగిందని.. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్డీపీ మళ్లీ పడిపోయిందని ఆక్షేపించారు. తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని తెలిపారు. పంటల బీమా ప్రీమియం కూడా జగన్ ప్రభుత్వం చెల్లించలేదని ధ్వజమెత్తారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ప్రీమియం సకాలంలో చెల్లించామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.


ఇవి కూడా చదవండి...

అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

ఆలూరులో వైసీపీకి షాక్.. బీజేపీలో భారీగా చేరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 07:02 PM