Aluru Politics: ఆలూరులో వైసీపీకి షాక్.. బీజేపీలో భారీగా చేరికలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:53 PM
ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, పలువురు సర్పంచ్‌లు.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.. వీరందరికీ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
విజయవాడ, నవంబర్ 7: ఏపీలో వైసీపీ అధికారం కోల్పాయక ఆ పార్టీకి ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 11 సీట్లు మాత్రమే ఇచ్చి వైసీపీకి ప్రజలు పెద్ద షాకే ఇచ్చారు. ఇక వైసీపీ నేతలు కూడా జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే జగన్‌కు అత్యంత సన్నిహితులు, ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, కిందస్థాయి నేతలు అనేక మంది వైసీపీకి గుడ్‌బై చెప్పేసి వివిధ పార్టీలలో చేరిపోయారు. వైసీపీని వీడే వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా ఆలూరులో పలువురు నేతలు వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు.
ఆలూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, పలువురు సర్పంచ్‌లు.. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు (శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.. వారందరికీ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గం నుంచి కమలమ్మ నేతృత్వంలో జడ్పిటీసీ సభ్యులు శేఖర్, పలువురు సర్పంచ్‌లు, వైసీపీ సీనియర్ నేతలు బీజేపీలో చేరారు. విజయవాడకు చెందిన బీసీ సంఘాల నాయకులు లాకా వెంగళరావు యాదవ్, నాగుల్ మీరా, యలమందలరావు బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యులు, పలువురు సర్పంచ్‌లు, వైసీపీ సీనియర్ నాయకులు బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు. భారత్ మాతాకి జై అనే నినాదంతో పని చేసే పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. ఏపీలో అమలవుతున్న అన్ని పథకాలకు ప్రధాని మోడీ సహకారం ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని వెల్లడించారు. మనమంతా మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం , మన ప్రజల కోసం పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆనందక్షణాలను సీఎంతో పంచుకున్న శ్రీచరణి
అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
Read Latest AP News And Telugu News