Bihar Verdict Indias Political Future: బిహార్ తీర్పు ఏ మార్పులకు సంకేతం
ABN, Publish Date - Nov 20 , 2025 | 05:19 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మీరు ఎలా పరిగణిస్తున్నారు? దేశ రాజకీయాలలో రాబోయే మార్పుల స్వరూప స్వభావాలకు చిహ్నంగానా? బిహార్ ఓటర్ల తీర్పును మీరు అలా చూడాలనే మీడియా అభిలషిస్తోంది సుమా! చకితపరిచిన,...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మీరు ఎలా పరిగణిస్తున్నారు? దేశ రాజకీయాలలో రాబోయే మార్పుల స్వరూప స్వభావాలకు చిహ్నంగానా? బిహార్ ఓటర్ల తీర్పును మీరు అలా చూడాలనే మీడియా అభిలషిస్తోంది సుమా! చకితపరిచిన, అదరగొట్టిన ఆ ప్రజా తీర్పు కేవలం ఒక రాష్ట్ర ప్రజల తీర్పు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర పునరారంభానికి ఒక నాంది కూడా. ఇదిగో, ఈ సానుకూల కథనానికి ఒక విరుద్ధ దృక్కోణం కూడా ఉన్నది: ఎన్నికలు అర్థం పర్థం లేనివి. ఎన్నికలలో పాల్గొని, దగాకోరు ఎన్నికలకు శాసనసమ్మతి కల్పించడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వ నిరంకుశాధికార పాలనను మీరు సవాల్ చేయలేరని బిహార్ నిరూపించింది. ఈ రెండు అభిప్రాయాలలో సత్యమూ ఉన్నది, కట్టుకథా ఉన్నది. రాజకీయ వాస్తవికత గురించి విస్తృత, దీర్ఘకాలిక, లోతైన అవగాహనపైనే ఈ సత్యాసత్యాలు ఆధారపడి ఉన్నాయి.
2024 సార్వత్రక ఎన్నికల అనంతరం దేశ రాజకీయ ప్రస్థానంలో ‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఒక ముఖ్యమైన మలుపు’ అన్న భావనకు మూడు అంచనాలు ప్రాతిపదికగా ఉన్నాయి: ఒకటి– ఆ తీర్పు అనూహ్యమైనది; రెండు– ప్రబల రాజకీయ ధోరణులను విచ్ఛిన్నం చేసింది; మూడు– ఆగామి రాజకీయ పరిణామాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మూడూ సందేహాస్పదమైనవే. నిశితంగా పరిశీలిద్దాం. తొట్ట తొలుత మనం గుర్తించవలసిన వాస్తవం: బిహార్ రాజకీయ ప్రస్థానం విశాల భారతదేశానికి కాదు కదా, ఇరుగు పొరుగు హిందీ రాష్ట్రాల రాజకీయ ప్రస్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించదు. ఉత్తర భారతావనిలో ఒక సమస్థాయి భాగస్వామితో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీకి తప్పనిసరి అయిన ఏకైక రాష్ట్రం బిహార్. ఆ రాష్ట్రంలోని రాజకీయాల వైచిత్రి పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లోనే ఏ మాత్రమూ ప్రతిబింబించదు. ఇక బెంగాల్‌ను బిహార్ ధోరణులు ప్రభావితం చేయడమనేది జరగని మాట; రెండు– బిహార్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయలేదు. బిహార్‌లో ఎన్డీఏ తన ప్రాబల్యాన్ని కొనసాగించింది. 174 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్డీఏ, ప్రత్యర్థి కూటమి మహాగఠ్ బంధన్ (ఎమ్‌జీబీ)పై 8 శాతం ఓట్ల ఆధిక్యతతో తిరుగులేని ముందంజలో ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు ఆ ఆధిక్యతను మరింతగా పెంచాయేకానీ ఏ మాత్రమూ తగ్గించలేదు. రాష్ట్ర శాసనసభలోని 243 సీట్లలో 202 సీట్లను కైవసం చేసుకోవడమనేది నమ్మశక్యంగా కనిపించనప్పటికీ ఎమ్‌జీబీపై 1.2 శాతం పాయింట్ల అదనపు ఓట్ల ఆధిక్యత మూలంగానే అంత అత్యధిక సంఖ్యలో సీట్లను ఎన్డీఏ గెలుచుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. ఈ దృష్ట్యా బిహార్‌ను ఆ రాష్ట్రాల సరసన చేర్చకూడదు.
బిహార్ రాజకీయాల మౌలిక వాస్తవాలను అర్థం చేసుకున్నవారికి అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఊహించనిదేమీ కాదు. 2005 నుంచీ మూడు ప్రధాన పార్టీల– ఆర్‌జేడీ, జేడీ(యూ), బీజేపీ–లలో రెండు పార్టీల సంకీర్ణం, (2020లో మినహా) మంచి మెజారిటీతో గెలుస్తూ వస్తూన్నది. సాధారణ వాస్తవం ఏమిటంటే ప్రత్యర్థి ఎమ్‌జీబీ కంటే ఎన్డీఏ చాలా పెద్ద రాజకీయ సంకీర్ణం. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించుకున్న ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఎన్డీఏకు 5 పాయింట్ల ఆధిక్యత ఉన్నది. ఎన్డీఏ సామాజిక సంకీర్ణం కూడా ఎమ్‌జీబీ సామాజిక సంకీర్ణం కంటే చాలా పెద్దది. 32 శాతంగా ఉన్న ఎమ్‌జీబీ ప్రధాన మద్దతుదారులు (ముస్లిం+యాదవ్), ఎన్డీఏకు 28 శాతం ప్రధాన మద్దతుదారులైన (అగ్రకులాలు+ కుర్మీ+కుష్వాహ+బనియా/ తెలి+పాశ్వాన్) సామాజిక వర్గాల కంటే అధికమే. అయితే ఎమ్‌జీబీకి సహాయక మద్దతుదారులుగా 10శాతం (మల్లా+రవిదాసి+తన్తి / పాన్) సామాజిక శ్రేణుల జన సంఖ్య, ఎన్డీఏ వైపు మొగ్గే 20 శాతం హిందూ ఈబీసీల కంటే తక్కువ. అంతేకాకుండా ఆ పదిశాతం సామాజిక శ్రేణులలో విధిగా ఎమ్‌జీబీకే ఓటు వేసే నిబద్ధత కూడా తక్కువే.
ఎన్డీఏకు మొదటి నుంచీ అనుకూలతలు ఉన్నాయనేది స్పష్టం. సామాజిక సమీకరణాలను మార్చడం లేదా సమస్త కులాల వారినీ ఆకట్టుకునే విధంగా ప్రభావదాయక ప్రచారాన్ని నిర్వహించడం ద్వారా పరిస్థితులను తనకు అనుకూలం చేసుకునే విషయంలో ఎమ్‌జీబీకి మరింత బరువు బాధ్యతలు ఉన్నాయి. ఈ దిశగా ప్రతిపక్ష కూటమి కొన్ని ప్రయత్నాలు చేయక పోలేదు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే చాలా ఆలస్యంగా ఇచ్చిన ఆ హామీలు చాలా స్వల్ప ప్రభావాన్ని మాత్రమే చూపాయి. వివిధ పెన్షన్ పథకాల కింద చెల్లించే మొత్తాలను పెంచడమే కాకుండా విద్యుత్ చార్జీలను తగ్గించడంతో పాటు ప్రతి మహిళకు రూ.10 వేలు చెల్లించడం ఎన్డీఏ విజయానికి విశేషంగా దోహదం చేసింది. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తొలుత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా ఓటర్లను తిరుగులేని మద్దతుదారులుగా చేసుకోవడానికి చేసిన వివిధ ప్రయత్నాలు కూడా బాగా కలిసివచ్చాయి. ఈ వాస్తవాలతో పాటు నితీశ్‌కుమార్ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉండడం కూడా ఎన్డీఏ ఘన విజయానికి దోహదం చేసింది.
రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ ప్రతి విషయంలోనూ విఫలమయ్యాయని, బీజేపీ చాలా నైపుణ్యంతో వ్యవహరించిందని మనం భావించనవసరంలేదు. తీర్పు కలిగించిన విస్మయం, దిగ్భ్రాంతి మీడియా కల్పించినవే. ఎన్డీఏ సర్కార్ మళ్లీ గెలవడంపై పలువురు విమర్శకులకు కలిగిన దిగ్భ్రాంతి సరైన ప్రతిస్పందన కాదని నేను భావిస్తున్నాను. బిహార్ పరిణామాలను సుదూర ప్రదేశాలలో ఉండి, సామాజిక మాధ్యమాల ద్వారా గమనిస్తున్న వారికి ఎమ్‌జీబీ ముందంజలో ఉన్నదనేది తప్పుడు భావనే అని చెప్పి తీరాలి. సరే, బిహార్ ఎన్నికల అంతిమ ఫలితం అనుమానాలకు తావిచ్చింది. ఈసీఐ తీరుతెన్నులలో లోపించిన విశ్వసనీయత, పాలక కూటమికి సానుకూలంగా ఎన్నికల ఫలితం ఉండేలా చేసేందుకు ప్రయత్నించడం మొదలైన కారణాలు ఆ అనుమానాలకు తావిచ్చాయి. ఆ సందేహాలతోనే కొన్ని వర్గాలు ఇప్పటికే ఎన్నికల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చాయి.
నిష్పాక్షికత లోపించిన ఎన్నికలు, మోసపూరిత ఎన్నికల మధ్య భేదాన్ని చూడవలసిన అవసరమున్నది. మన దేశంలో ఎన్నికలు ఇంకెంత మాత్రం నిష్పాక్షికంగా జరగడం లేదనడంలో సందేహం లేదు. ఎన్నికలలో పోటీ చేస్తున్న వారందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరగడమే లేదు అందుకు బిహార్ ఎన్నికలే సమృద్ధమైన రుజువులు సమకూరుస్తున్నాయి. వ్యవస్థీకృత పక్షపాతం, ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణతో తొలుత 68 లక్షల ఓటర్ల పేర్లు, ఆ తరువాత అదనంగా మరో 24 లక్షల మంది ఓటర్లను తొలగించడమే అందుకు నిదర్శనం. ఎన్నికల నిబంధనావళిని పాలక కూటమి భాగస్వామ్య పక్షాలు ఉల్లంఘిస్తున్నప్పటికీ ఈసీఐ ఏ విధంగాను ఆక్షేపించలేదు. మతతత్వ ప్రచారం, అక్రమ వలసదారుల స్వాభిప్రాయబద్ధమైన ఆరోపణలు, పోలింగ్‌కు ముందు ప్రతి మహిళా ఓటరుకు రూ.10వేలు ఇవ్వడం, ఓటర్లను తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను బీజేపీ నడపడం మొదలైన వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. పత్రికలు, ప్రసార సాధనాలపై పాలక కూటమికి అసాధారణ నియంత్రణతో పాటు అపార ఆర్థిక వనరులు ఉండడం చూస్తే ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎందుకు జరగడం లేదో అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితులలో కూడా ప్రతిపక్షాలకు అసలు విజయావకాశాలు లేవని చెప్పలేం. అయితే అవి దుస్సాధ్యమైన కార్యాన్ని సాధించేందుకు కృతనిశ్చయంతో పూనుకోవలసి ఉన్నది. ఓటింగ్ సరళిని నేర్పుగా అనుకూలం చేసుకోవడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకోవడం మొదలైనవన్నీ ఎన్నికల వంచనే. పోలింగ్‌లో పాల్గొన్న మొత్తం ఓటర్ల సంఖ్యను ఆలస్యంగా వెల్లడించడం, పోస్టల్, ఈవీఎమ్ ఓట్ల మధ్య వ్యత్యాసాలు, ఓటర్ జాబితాల నుంచి అత్యధిక ఓటర్ల తొలగింపు మొదలైనవాటిని అందుకు రుజువులుగా చూపవచ్చు. అయితే ఈ అక్రమాలకు గట్టి సాక్ష్యాధారాలు లేవు. ఈ కారణంగా ఎన్నికల వంచన జరిగిందని ఘంటాపథంగా చెప్పేందుకు బిహార్‌ను నిదర్శనంగా చెప్పలేము. ప్రతిపక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆరాటపడుతున్నవారికి ఇది ఒక పెద్ద విఘాతమే. అయితే భవిష్యత్తు నిరాశాజనకంగా ఉన్నదని భావించనవసరం లేదు. పశ్చిమ బెంగాల్లో జరగనున్న ఎన్నికలు ఎన్నికల నైతికతకు మెరుగైన పరీక్షగా భావించవచ్చు. దేశ రాజకీయాలలో రాబోయే మార్పులకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిజమైన సంకేతాలు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Updated Date - Nov 20 , 2025 | 05:19 AM