Visakhapatnam AI Data Center Project: అవి ఊహాజనిత వాదనలు
ABN, Publish Date - Nov 19 , 2025 | 02:15 AM
విశాఖపట్టణంలో గూగుల్–అదానీ–ఎయిర్‌టెల్ నిర్మించతలపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా హబ్ గురించి అక్టోబర్ 30న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన నెల్లూరు నరసింహారావు వ్యాసంలో అనేక వాస్తవ విరుద్ధవాదనలున్నాయి....
విశాఖపట్టణంలో గూగుల్–అదానీ–ఎయిర్‌టెల్ నిర్మించతలపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా హబ్ గురించి అక్టోబర్ 30న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన నెల్లూరు నరసింహారావు వ్యాసంలో అనేక వాస్తవ విరుద్ధవాదనలున్నాయి. విశాఖపట్టణంలో నిర్మించదలుచుకున్నది సాధారణ డేటా సెంటర్ కాదు, ఏఐ డేటా సెంటర్. రెంటికీ ఎంతో తేడా ఉంది. గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్, యూట్యూబ్, క్రోమ్, మ్యాప్స్ లాంటివి వాడేటప్పుడు మనకు అందే సమాచారం సాధారణ డేటా సెంటర్స్‌లో ఉండే సర్వర్ల నుంచి లభిస్తుంది. అయితే గూగుల్ సంస్థ ఏఐ ఉత్పత్తులను తయారు చేయాలన్నా, పెద్దఎత్తున సమాచారం క్రోడీకరించాలన్నా వాటిని ఏఐ డేటా సెంటర్‌ల ద్వారా చేయాల్సి ఉంటుంది. క్లౌడ్ సర్వీసెస్ ఇందులో భాగమే. అందుకనే ఏఐ డేటా సెంటర్లు సాధారణ సెంటర్ల కన్నా పెద్దవిగా, సంక్లిష్టంగా ఉంటాయి. వీటిలో క్లిష్టమైన పరికరాలు వాడతారు కనుక అవసరమైన నీరు, విద్యుత్తు, కాలుష్యం సాధారణ డేటా సెంటర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది.
ఇక, వ్యాసకర్త చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక విద్యుత్తు రంగంలో దేశంలో అగ్రస్థాయిలో లేదు. మార్చి 2024 నాటికి 11 గిగావాట్ల సామర్థ్యంతో ఏడవ స్థానంలో, దక్షిణ భారతంలో మూడవ స్థానంలో ఉంది. అలాగే, చైనాలో వేల సంఖ్యలో డేటా సెంటర్లు ఏమీ లేవు. అక్కడ సాధారణ డేటా సెంటర్లు 449, ఏఐ డేటా సెంటర్లు వంద దాకా ఉన్నాయి. అమెరికాలో ఏఐ డేటా సెంటర్లు పదుల సంఖ్యలోనే (20–30 మధ్యలో) ఉన్నాయి. గూగుల్ ఏఐ డేటా హబ్ విషయానికి వస్తే, పైన పేర్కొన్నట్టు ఇందులో వాడే పరికరాలు చాలా క్లిష్టమైనవి. వీటిల్లో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాడతారు. ఇవి సంవత్సరం పొడుగునా పనిచేస్తూనే ఉండాలి కాబట్టి తొందరగా, తీవ్రంగా వేడెక్కుతాయి. ఆ వేడిని తగ్గించడానికి ముఖ్యమైనది కూలెంట్ నీరు. ఈ సెంటర్లలో వెలువడే విపరీతమైన వేడి ఒక సమస్య అయితే, సర్వర్లను చల్లబరచడానికి అత్యధిక మోతాదులో అవసరమయ్యే నీరు మరొక సమస్య. విశాఖపట్టణం ఉష్ణోగ్రతలకు ఈ నీటి అవసరం మరింత ఎక్కువ.
ఒక ఏఐ డేటా సెంటర్‌కు ఎంత నీరు అవసరమన్నదానిపై మన దగ్గర స్పష్టమైన లెక్కలు లేవు కానీ, ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన సాధారణ డేటా సెంటర్‌కు రోజుకు ఒక కోటి 11 లక్షల గ్యాలన్ల నీరు కావాలి. అంటే విశాఖపట్టణం మొత్తానికి రోజుకు అవసరమైన నీటిలో 11శాతం అన్నమాట. ‘ఇంత నీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు’ అనేదానికి ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. వ్యాస రచయిత మాత్రం పోలవరం ఎడమ కాలువ అని చెప్పారు. పోలవరం ఇప్పటివరకు పూర్తవ్వనే లేదు, అప్పటివరకు అంత ఎక్కువ మొత్తంలో నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? ఒకవేళ పోలవరం పూర్తి అయినా దీనికి అవసరమైన కేటాయింపు ఆ ప్రాజెక్ట్‌లో ఉందా? కేవలం నీటితోనే ఆ సర్వర్లు, పరికరాలు చల్లబడవు. అనేక రసాయనాలు కలపాలి. మరి ఆ కాలుష్యమంతా ఎక్కడికి వెళ్తుంది? పూర్తిగా రీసైకిల్ చేస్తామనే ప్రకటన అయితే ఇస్తారు కానీ, అది సాధ్యపడని విషయం. దీని గురించి మనకు సమాచారం లేదు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక వంటిదేమీ అందుబాటులో లేదు. సమాచారం ఏమీ లేకుండా ఆశావాదం ప్రకటించడం సబబు కాదు.
ఈ సెంటర్‌కు అవసరమైన విద్యుత్తు అంతా పునరుత్పాదక విద్యుత్తు ద్వారా సమకూర్చుకుంటారని నరసింహారావు చెబుతున్నారు. అది అసాధ్యం. సంప్రదాయ విద్యుత్తు వాడవలసిందే. అందుకే, అమెరికాలోని డేటా సెంటర్ సంస్థలు తమ విద్యుత్ అవసరాల కోసం అణు విద్యుత్తు రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సెంటర్‌ను పూర్తిగా విశాఖపట్టణం, దాని పరిసరాలలోనే పెట్టబోతున్నారు. అంటే దానికి అవసరమయ్యే నీరు, విద్యుత్తు, కాలుష్యం అంతా కూడా ఆ నగరం, పరిసరాలపై ప్రభావం చూపెట్టే అంశం. ప్రపంచ డేటా సెంటర్ రాజధానిగా పేరున్న వర్జీనియా రాష్ట్రంలో ఉన్న డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం 2.5 గిగావాట్లు అయితే విశాఖపట్టణంలో నిర్మించదలుచుకున్న ఈ ఒక్క సెంటర్ సామర్థ్యమే 1 గిగావాట్. అంటే కేంద్రీకరణ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఈ డేటా సెంటర్ వల్ల 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి’ అని రచయిత తెలిపారు. ఈ సంఖ్య ప్రభుత్వం మోడలింగ్ చేసి, 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన సంఖ్యకు దగ్గరగా ఉంది. ప్రభుత్వం ఏమి మోడలింగ్ చేసిందో, ఏ ఇన్‌పుట్స్ తీసుకుందో తెలియదు. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారనేది చాలాసార్లు పక్షపాతంతో కూడి ఉంటుంది. కాబట్టి ఈ మోడలింగ్‌కు ఒక శాస్త్రీయ పునాది ఉన్నదని నమ్మటం కష్టం. 2023లో గూగుల్ సంస్థ విడుదల చేసిన ఒక నివేదికలో అమెరికాలో యాష్‌బర్న్, లీస్‌బర్గ్‌లలో ఉన్న తమ డేటా సెంటర్లలో మొత్తం 400 మంది పనిచేస్తున్నారని తెలిపింది. అదే విధంగా మెటా సంస్థ తాము లూసియానా రాష్ట్రంలో కట్టబోతున్న ఒక అతి పెద్ద డేటా సెంటర్‌లో ఇవ్వనున్న ఉద్యోగాలు 500 అని తెలిపింది. అమెరికా మొత్తం మీద సుమారు 5,500 డేటా సెంటర్లు ఉండగా, అందులో మొత్తం ఉద్యోగులు దాదాపు 5 లక్షలు. అంటే డేటా సెంటర్‌కు వందమంది.
అయితే ‘ఇక్కడ రాబోయే ఉద్యోగాలు ఈ ఒక్క సెంటర్ కారణంగా కాక, ఎకో సిస్టమ్ ఆధారంగా వస్తాయి’ అని వాదించవచ్చు. కానీ ఇది ఒక ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటరో, టెస్టింగ్ సెంటరో కాదు. కేవలం సర్వర్ సెంటర్. డేటా సెంటర్ చుట్టూ ఒక ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటే అమెరికా టెక్నాలజీ పరిశ్రమ సిలికాన్ వ్యాలీని వదిలేసి ఎప్పుడో వర్జీనియాకు వచ్చేసి ఉండాల్సింది. ఇటువంటి పెద్ద ప్రాజెక్టుల గురించి, ప్రభుత్వం వాటికి అందిస్తున్న వేలకోట్ల రాయితీల గురించి, వాటి వెనుక ఉన్న భావజాల–రాజకీయ కారణాల గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతా మన మంచికే అని నమ్మే రోజులు పోయాయి.
గుత్తా రోహిత్
మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్)
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2025 | 02:17 AM