ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Local Body Elections: ఇది మార్పు కాదు.. విప్లవం

ABN, Publish Date - Dec 20 , 2025 | 06:14 AM

తెలంగాణలో గ్రామం ఒకప్పుడు మౌనంగా ఓటు వేసేది. ఇప్పుడు మాత్రం తమ జీవితాన్ని చూసుకుని ఓటు వేసి తీర్పునిచ్చింది. నినాదాల మీద కాదు, నిత్య జీవితంపై ప్రభావం చూపిన కాంగ్రెస్‌...

తెలంగాణలో గ్రామం ఒకప్పుడు మౌనంగా ఓటు వేసేది. ఇప్పుడు మాత్రం తమ జీవితాన్ని చూసుకుని ఓటు వేసి తీర్పునిచ్చింది. నినాదాల మీద కాదు, నిత్య జీవితంపై ప్రభావం చూపిన కాంగ్రెస్‌ పాలనపైనే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఇక తీసుకుంటారు. రాష్ట్రంలో తాజాగా ముగిసిన మూడు దశల స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మార్పును ఘాటుగా వెల్లడించాయి. ఇవి కేవలం రాజకీయ గెలుపోటముల లెక్కలు కాదు, తెలంగాణ సామాన్య ప్రజాజీవన ప్రమాణంపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన, పరిపక్వమైన తీర్పు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు పొందిన సర్పంచ్‌ అభ్యర్థులు సుమారు 7 వేల పంచాయతీల్లో విజయం సాధించడం యాదృచ్ఛికం కాదు.

గత రెండేళ్లుగా ప్రజలు తమ జీవితాల్లో ప్రత్యక్షంగా అనుభవించిన పాలనకు ఇచ్చిన ధ్రువీకరణ ఈ విజయం. రైతు, మహిళ, యువకుడు, విద్యార్థి, మధ్యతరగతి వ్యక్తి, ఉద్యోగి... ఇలా ప్రతి వర్గం తన రోజువారీ జీవితంలో ఏం మారిందో చూసి ఓటు వేసింది. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే నిజమైన రాజకీయ విశ్లేషణ ఇంకేదీ ఉండదేమో. ఈ ప్రజా తీర్పు ఫలితాల్లోనే కాదు, ఎన్నికల ప్రక్రియలోనూ ప్రతిబింబించింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు. అయినా జనం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. తాను చెప్పిన, ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే మాట మార్చకుండా కాంగ్రెస్‌ అమలు చేసింది. పాలకపక్ష ప్రయోజనాల కోసం వ్యవస్థను వంచడం సులభమే అయినా, అలా చేయలేదు. ప్రజాస్వామ్య ఆత్మను కాపాడాలనే ఆచరణాత్మక సంకల్పం అది. ఇక్కడే కాంగ్రెస్‌ పాలనలోని ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.

అధికారంలో ఉన్నప్పుడు నియమాలు మార్చి లాభపడటం భారత రాజకీయాల్లో సాధారణ చరిత్ర. కానీ నియమాలను గౌరవించి, ప్రజల తీర్పునకు కట్టుబడడం మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏడు వేల పంచాయతీల్లో గెలవడం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజలు పార్టీ గుర్తుకు కాదు, పాలనకు ఓటు వేశారు. స్థానిక సంస్థలు అధికార విస్తరణకు కాదు, ప్రజల స్వయం పాలనకు వేదికలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నమ్మింది. అందుకే తుది తీర్పును ప్రజల చేతిలోనే ఉంచింది.

ఈ ప్రజా తీర్పునకు ఆధారం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తోన్న ఆరు గ్యారెంటీలు (మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత). వీటి అమలుకు 2025–26 బడ్జెట్‌లో రూ.56,000 కోట్లు కేటాయించడం రాజకీయ సాహసమే, కానీ అది ప్రజల జీవితాల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన సాహసం. ఈ తీర్పునకు కేంద్రబిందువుగా నిలిచింది మహిళలే. ఇంటి బడ్జెట్‌ నడిపే ఆమెకు పాలన మారిందా లేదా అన్నది ముందే తెలుస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత విద్యుత్‌... ఇవి ఆమెకు ఆత్మగౌరవం. మధ్యతరగతి కూడా నినాదాలతో మోసపోయే వర్గం కాదు. గృహజ్యోతి, ఉద్యోగ భర్తీలు వారికి రేపటిపై నమ్మకాన్ని ఇచ్చాయి. రైతు భరోసా, బోనస్‌ వంటివి అన్నదాతకు మద్దతిచ్చాయి. పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ గౌరవం తెచ్చాయి. రేషన్‌ బియ్యం అంటే నిర్లక్ష్యం అన్న భావనను తుడిచేసిన ఈ నిర్ణయం గ్రామాల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని బలపరిచింది. ఈ అన్ని చర్యల వెనుక ఒక స్పష్టమైన పాలనాతత్వం ఉంది, అదే సంక్షేమం. ఆ సంక్షేమం అంటే దానం కాదు, అది హక్కు. గత రెండేళ్లలో హామీల అమలుకే ప్రభుత్వం రూ.76,382 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో ప్రతిపక్షాల పాత్రనూ ప్రజలు గమనించారు.

గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పెరిగిన అప్పులు, పెండింగ్‌ ప్రాజెక్టులు... ఈ భారాన్ని నేటి ప్రభుత్వం మోస్తూనే ముందుకు సాగుతోంది. ఈ వాస్తవాలపై ప్రతిపక్షాల వద్ద సమాధానం లేదు. అందుకే అవి ఆరోపణలకే పరిమితమయ్యాయి. కానీ ప్రజలు ఇప్పుడు ఆరోపణలు వినరు, అనుభవాన్ని మాత్రమే నమ్ముతారు. అందుకే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన విజయం సంబరానికి కాదు, బాధ్యతకు. ఈ విజయంతో– ప్రజలు మాట్లాడారు. పాలన మాట్లాడింది. ప్రతిపక్షాలు మౌనమయ్యాయి. ఇది తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య పరిపక్వత. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఇది. పల్లెల్లో సమీకరణాలను మార్చిన ఈ విజయం తెలంగాణ ప్రజల శక్తిని మరొకసారి ప్రపంచానికి చాటింది. సీఎం రేవంత్‌ నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. నేడు ప్రతి గ్రామం ప్రగతి పథంలో, ప్రతి కుటుంబం సంక్షేమ సామ్రాజ్యంలో ఉంది. ఇది మార్పు కాదు.. విప్లవం.

చనగాని దయాకర్‌

(టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ)

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:53 AM