ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kakatiya Dynasty Defending: రాజవంశీకుల శాసనం అబద్ధమా

ABN, Publish Date - Oct 26 , 2025 | 12:29 AM

కొత్త శాసనాలు బయటపడితే పాతవి మూలకు పడేయాలా? ఇదేం వాదన! సామంతుడో, మరెవరో వేసిన తామ్ర శాసనాలకు ఉన్న విలువ స్వయానా రాజవంశీకులే వేసిన బయ్యారం...

కొత్త శాసనాలు బయటపడితే పాతవి మూలకు పడేయాలా? ఇదేం వాదన! సామంతుడో, మరెవరో వేసిన తామ్ర శాసనాలకు ఉన్న విలువ స్వయానా రాజవంశీకులే వేసిన బయ్యారం శాసనానికి లేదా? ఇదేం శాస్త్రీయత?! (కాకతీయులపై కొత్త వెలుగులు– సెప్టెంబర్‌ 28). అది పవర్‌ పాయింట్‌ ప్రదర్శన అయినా, ఐమాక్స్‌ తెర మీద ప్రదర్శన అయినా నిజాలు తారుమారవుతాయా?

క్రీ.శ 956 నాటి దానార్ణవుని ‘మాంగల్లు దాన శాసనం’ కాకర్త్య గుండన వంశక్రమాన్ని వెనుకకు మూడు తరాల వరకు ప్రస్తావించింది. కాకతీయ వంశం, గుండియ రాష్ట్రకూట, ఎర్రియ రాష్ట్ర కూట (భార్య వంధ్యనాంబ), కాకర్త్య గుండన... ఈ శాసనంతో హనుమకొండకు చెందిన మొదటి తరం కాకతీయులను కలపడంలో నాటి చరిత్రకారులు విఫలమైన సందర్భంలో, 1966లో ఆవిష్కరించిన బయ్యారం చెరువు శాసనం కాకతీయ వంశక్రమాన్ని సంపూర్ణంగా వివరించింది. దీంతో కాకతీయ వంశక్రమంపై అప్పటివరకు ఉన్న సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి! మాంగల్లు శాసనంలో 4 నుంచి 9 తరాలు వర్ణనతో, రుద్రదేవుడి అనుమకొండ శాసనంలో 12, 13 తరాల వర్ణనతో, బయ్యారం శాసనంలోని 14 తరాల వరకు పోల్చి చూస్తే, ఎట్టి భేదం లేకుండా బయ్యారం శాసనం కాకతీయుల వంశవృక్ష నిరూపణకు ప్రబల సాక్ష్యంగా నిలిచింది.

దుర్జయ వంశం– వెన్నయ– మొదటి గుండన– రెండవ గుండన– మూడవ గుండన– ఎర్రియ–పిండి గుండన(కాకర్త్య గుండన)– ఇలా గణపతి దేవుడి వరకు 14 తరాల వరకు సాగుతుంది. ఈ విధంగా కాకతీయ వంశక్రమంపై బయ్యారం చెరువు శాసనం మనకు ఒక స్పష్టత ఇస్తుంది. ఎందుకంటే ఇది స్వయానా కాకతీయ వంశస్థులే వేయించారు కాబట్టి! (ఈ శాసనాన్ని వేయించింది గణపతి దేవుడి చెల్లెలైన మైలమాంబ– ఈమె నతవాటి వక్కటి మల్లరుద్రుని భార్య.) కాకతీయ వంశస్థాపకుడు అయిన వెన్ననృపుడు పృథ్విని కాకతీ పట్టణం నుంచి పాలించాడని స్పష్టంగా చెబుతున్నది (గణపతి దేవుడి గారవపాడు దాన శాసనం కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నది). ఈ వెన్నయ్య, ఆయన సైన్యంతో కలిసే, రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడు... బాదామి చాళుక్యులపై విజయాన్ని సాధించి, ఆ రాజ్య భాగాలను కలుపుకున్న తరువాతే రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు!

కాకతీయుల వంశానికే గాక వారి చరిత్రకు సంబంధించి కూడా బయ్యారం శాసనం ఆయువుపట్టు లాంటిది, అటు తర్వాత ఎక్కడ ఏ శాసనాలు దొరికినా (అవి శిలాశాసనాలైనా, రాగిరేకుల శాసనాలైనా, సాహిత్యాధారాలైనా) ఇప్పటివరకు బయల్పడిన అతిపెద్ద పూదండ లాంటి వేల కాకతీయ శాసనాలలో (వాటిలో ఏదైనా అదనపు సమాచారం ఉంటే) అవి ఒక పుష్పంలా ఒదిగిపోగలవే తప్ప, వాటికవే చరిత్రను తిరగరాయలేవు! అలా రాయాలని అభిలషించేవారు స్వయానా కాకతీయ రాజవంశీకులు వేసిన తమ వంశవృక్ష శాసనాన్ని చరిత్రలో కనుమరుగు చేయాల్సి ఉంటుంది!!

మొదటి తరం కాకతీయులు బయలుదేరిన కాకతీపురం విషయానికొస్తే... ఊహలే సిద్ధాంతాలకు దారితీస్తాయి, సిద్ధాంతాలు పరికల్పనలకు... అంటే ప్రయోగాలకు దారితీస్తాయి. మొహంజోదారో నగరం బయలు పడకముందు 1920లో జాన్‌ మార్షల్‌ మదిలో ఊహలే ఉన్నాయి, అక్కడ ఎందుకు ప్రాచీన అవశేషాలు దొరుకుతున్నాయని! ఆ తర్వాత ఆయన ఒక సిద్ధాంతాన్ని నిర్మించుకుని, నిరూపణ కోసం అక్కడ తవ్వకాలు చేశాడు. మొహంజోదారో నగరాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాడు! ప్రాచీన కాకతీపురానికి సంబంధించి హన్మకొండకు దగ్గరలోని కక్కిరాలపల్లి, కట్రియాల గ్రామ పేర్లలో కాకతీయ నామ సామ్యం ఉంది. పంథిని, కట్రియాల, కక్కిరాలపల్లిని కలుపుతూ ఒక త్రిభుజాన్ని గీస్తే ఆ మధ్యలో ప్రాచీన విశేషాలు ఇబ్బడి ముబ్బడిగా దొరికాయి. ఆ ప్రాచీన అవశేషాల్ని ఆయా గ్రామాల్లో నేటికీ చూడవచ్చు. పంథిని గ్రామశివారులో రెండు పురాతన గుళ్లు ఉన్నాయి. వాటిలో విగ్రహాలు లేవు, ఆ గుళ్లకు ఓ పేరంటూ లేదు. అయితే అవి సకలేశ్వరాలయం, గుండేశ్వర భట్టారక ఆలయం ఎందుకు కాకూడదు?

ప్రాచీన కాలంలో ప్లేగు, కలరా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఊళ్లకు ఊళ్లే నిర్మానుష్యమయ్యేవి. చావగా మిగిలిన వాళ్ళు కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ మళ్లీ గ్రామాలను నెలకొల్పుకునేవారు! అలా ఆ కాకతీపురం నుంచి ఇరువైపులా వెళ్లిపోయిన ప్రజా సమూహాలే ఈ కట్రియాల, కక్కిరాలపల్లి లాంటి గ్రామాలను నిర్మించుకున్నాయని శాస్త్రీయంగా ఊహించవచ్చు! అందుకే ఈ రెండు గ్రామాల పేర్లలో కాకతీపుర నామ సామ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తవ్వకాలు సాగించి, ఏ ఆధారం దొరకక, ప్రయత్నం విఫలమైనప్పుడు మాత్రమే... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కాగిత (కాకతీయ) రామచంద్రపురం కాకతీపురమా? లేక అదే జిల్లాలో కోదాడ మండలంలో దొండపాడు గ్రామంలో గల ‘కాకతమ్మ బీడు’ను తవ్వితే కాకతీపురం బయలుపడుతుందా? లేక కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం పట్టణానికి 12 మైళ్ళ దూరంలో కాకతీయ అనే గ్రామం ఉందని కర్ణాటక చరిత్రలో ఉంది, మరి అదా? అదీ కాకపోతే నేటి మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని కాందారపురము నుంచి కాకతీయులు బయలుదేరినట్టుగా ప్రతాప చరిత్ర తెలుపుతున్నది, మరి ఇది నిజమా? ఇవన్నీ మనం శాస్త్రీయంగా తేల్చుకున్నాక మాట్లాడుకోవల్సి ఉన్నది! స్వస్తివాక్యం ఏమంటే– స్థానిక చారిత్రక అస్తిత్వం నిలుపుకోవడానికి ఆరాటపడే మాలాంటి వాళ్ళమంతా అడిగే ప్రశ్న ఒక్కటే! ఎక్కడో ఏదో ఒక శాసనం బయలు పడినంత మాత్రాన ఆ ఒక్క శాసనమే కాకతీయ చరిత్రను మొత్తం తిరగ రాయగలదా? అలాంటప్పుడు అంతకు ముందున్న వేల శాసనాల అస్తిత్వం మాటేమిటి?

డా. అంబటి శ్రీనివాస్‌రాజు

‘మన కాకతీయులు’ గ్రంథకర్త

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 12:32 AM