Airport Proposal: శివరాజ్ పాటిల్ ప్రతిపాదించిన విమానాశ్రయం
ABN, Publish Date - Dec 16 , 2025 | 05:04 AM
నేను 1988లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయినప్పుడు డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ రాజ్యసభ అధ్యక్షులు. సభలో చర్చలకు నాకు అవకాశాలిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన పరమ దైవభక్తులు. తిరుపతిలో...
నేను 1988లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయినప్పుడు డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ రాజ్యసభ అధ్యక్షులు. సభలో చర్చలకు నాకు అవకాశాలిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన పరమ దైవభక్తులు. తిరుపతిలో పెక్కు పర్యాయాలు పొర్లు దండాలు చేసేవారు. శనివారం జరిగే సుప్రభాత సేవలో తప్పకుండా పాల్గొనమని ఆయనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారట. ఒకరోజు శంకర్‌దయాళ్ శర్మ నన్ను తన ఛాంబర్‌కు పిలిచి ‘‘శివాజీ, రాత్రిపూట కూడా విమానాల రాకపోకలుండేటట్లు, బోయింగ్ విమానాలు కూడా దిగేందుకు వీలుగా రేణిగుంట విమానాశ్రయాన్ని ఆధునీకరించమని పౌరవిమానయాన శాఖామాత్యులు శివరాజ్ పాటిల్‌కు చెప్పాను. సుముఖంగా స్పందించారు. నీవు దానిపై ఒక ప్రతిపాదనను తయారుచేసి ఆయనతో మాట్లాడు’’ అని శెలవిచ్చారు. శంకర్‌దయాళ్ శర్మ ఒక పర్యాయం విజయవాడ వచ్చినప్పుడు చినజియ్యర్ స్వామిని చూద్దామన్నారు. ఇద్దరం వెళ్లాం. వారిద్దరూ సంస్కృతంలో మాట్లాడుకొంటుంటే నేను తెల్లముఖం వేసుకొని వింటూ కూర్చున్నాను. “Any small excuse is good enough to go to Tirupati to me” అని ఎవరు, ఏ చిన్న కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన తిరుపతికి విచ్చేసేవారు. రాష్ట్రపతిగా ఉండగా కూడా అదే ధోరణి కొనసాగింది.
శర్మ గారి సూచన మేరకు ఒక మహజరు తయారుచేసి, అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులతో సంతకాలు చేయించాను. గురుదాస్ దాస్‌గుప్తా, దీపేన్ ఘోష్, చతురానన్ మిశ్రా, ఎన్‌ఈ బలరాం వంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు... తిరుపతి పర్వత ప్రాంతం, రాత్రిపూట విమానాల రాకపోకలు అంత అభిలషణీయం కాదు. అయినా శివాజీ అడిగాడు గనుక, కాదనలేక సంతకం చేస్తున్నామన్నారు. ఆ మహజరును నేను మంత్రికి అందించాను. అదసలు చూడకుండానే ‘‘శివాజీ, అది సరేగాని గన్నవరంలో విమానాశ్రయమేమిటయ్యా? అది ద్వితీయ ప్రపంచ సంగ్రామ అవసరాలకు నిర్మించారు. పౌర విమానయానానికి అది పనికొచ్చేది కాదు. దానిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పంట పొలాలపై క్రిమిసంహారక మందులు చల్లే హెలికాప్టర్లు, ప్రైవేటు విమానాల రాకపోకలకు, ప్రకృతి వైపరీత్యాలలో సహాయ కార్యక్రమాలకు, ఇంకా ఏదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌కు వాడుకోండి. విజయవాడ–గుంటూరు మధ్య స్థలం సేకరించి ఇస్తే, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిద్దాం’’ అన్నారు. ఇది దాదాపు నాలుగు దశాబ్దాల నాటి మాట. ఈ ప్రాంతాలలో అప్పటికే ఎన్‌ఆర్‌ఐలు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. ఈ నినాదం స్వర్గీయ కొత్త రఘురామయ్య గళం నుండి వినపడుతూనే ఉన్నది. అప్పటికే లోక్‌సభ సభ్యునిగా ఉన్న సోదరులు వడ్డే శోభనాద్రీశ్వరరావు– ‘‘శివాజీ, మా రైళ్లన్నీ విజయవాడ నుంచి గుంటూరుకు తీసుకుపోయావు. ఇక విమానాశ్రయాన్ని కూడా వదిలిపెట్టవా?’’ అని దెప్పేవాడు. శివరాజ్ పాటిల్ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, అప్పుడే విజయవాడ–గుంటూరు జంట నగరాలుగా వెలుగొందేవి.
డా. యలమంచిలి శివాజీ
ఇవి కూడా చదవండి..
నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 16 , 2025 | 05:04 AM