Nitin Nabin: నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:43 PM
జేపీ నడ్డా 2019 జూన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అమిత్‌షా కేంద్ర మంత్రి అయ్యేంత వరకూ ఆరు నెలల పాటు ఆయనకు జేపీ నడ్డా సహాయకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత 2020 జనవరిలో జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: బీజేపీ చరిత్రలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (National Working President) పదవికి నియమితులైన రెండో వ్యక్తి నితిన్ నబీన్ (Nitin Nabin). మొదటి వ్యక్తి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ రాజ్యాంగంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే నిబంధన లేదు. అయితే 2019 నుంచి బీజేపీ చీఫ్ పదవిని చేపట్టేందుకు సోపానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నిలుస్తోంది.
జేపీ నడ్డా 2019 జూన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అమిత్‌షా కేంద్ర మంత్రి అయ్యేంత వరకూ ఆరు నెలల పాటు ఆయనకు జేపీ నడ్డా సహాయకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత 2020 జనవరిలో జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నడ్డా సుమారు ఆరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒక నేత మూడేళ్లు చొప్పున రెండు పర్యాయాలు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించవచ్చు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం తాత్కాలిక ఏర్పాటని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరో కారణం కూడా ఉందని అంటున్నారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 14 వరకు ఏ శుభకార్యాలు జరగని మాసంగా హిందువులు పాటిస్తారు. ఆ కారణంగానే నబీన్ పేరును 14వ తేదీ ఆదివారంనాడే ప్రకటించారు. జనవరి 14వ తేదీతో 'ఖర్మాస్' మాసం పూర్తి కాగానే పార్టీ కొత్త చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు.
పార్టీ చీఫ్ ఎన్నిక అప్పుడే..
బీజేపీ ఇప్పటికే 37 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 30 చోట్ల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసింది. పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరపాలంటే కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. బీజేపీ నేతల సమాచారం ప్రకారం అధ్యక్షుడి ఎన్నికల జనవరి 14 తర్వాత నాలుగు రోజుల్లో పూర్తి చేయనున్నారు. బీజేపీ సైద్ధాంతిక గురువుగా భావించే ఆర్ఎస్ఎస్‌తో కమలనాథులు సంప్రదించి, ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే నబీన్ ఎంపిక జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఆ ప్రకారం చూసినప్పుడు ఆరేళ్ల క్రితం అమిత్‌షాకు సహాయకుడిగా ఆరు నెలల పాటు పనిచేసిన జెపీ నడ్డా తరహాలోనే, నబీన్ కూడా అధ్యక్ష పగ్గాలు పట్టుకునే మందు జేపీ నడ్డాకు సహాయకుడిగా ఉంటారని తెలుస్తోంది.
ఎవరీ నితిన్ నబీన్
నలభై ఐదేళ్ల నితిన్ నబీన్ బిహార్ క్యాబినెట్‌లో రోడ్ల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఐదుసార్లు పాట్నాలోని బంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన తండ్రి, బీజేపీ సీనియర్ నేత నవీన్ కిషోర్ సిన్హా మరణించడంతో పాట్నా అసెంబ్లీ సీటు నుంచి తొలిసారి పోటీ చేసి నబీన్ గెలిచారు. అప్పటికి ఆయన వయస్సు 26 ఏళ్లు మాత్రమే. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ ఇప్పుడు బిహార్ నుంచి తొలి బీజేపీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది పార్టీ చీఫ్‌గా ఆయన పగ్గాలు చేపడితే బీజేపీ చరిత్రలోనే ఆ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా నిలుస్తారు. 52 ఏళ్ల వయస్సులో బీజేపీ చీఫ్ పగ్గాలు చేపట్టిన నితిన్ గడ్కరి రికార్డును బ్రేక్ చేసినట్టవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం నబీన్‌పై ప్రశంసలు కురిపించారు. కఠోర పరిశ్రమ చేసే పార్టీ కార్యకర్తగా ఆయనను అభివర్ణించారు. సంస్థాగత అనుభవంతో పాటు ఎమ్మెల్యేగా, పలుమార్లు బిహార్ మంత్రిగా చక్కటి రికార్డు ఆయనకు ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అహరహం శ్రమించే నాయకుడని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు
అయోధ్య ఉద్యమ నేత, మాజీ ఎంపీ రామ్‌విలాస్ వేదాంతి కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి