Ram Vilas Vedanti: అయోధ్య ఉద్యమ నేత, మాజీ ఎంపీ రామ్‌విలాస్ వేదాంతి కన్నుమూత
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:14 PM
అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వేదాంతి కీలక భూమిక పోషించారు. పలు ర్యాలీలు, కార్యక్రమాలతో ప్రజామద్దతును కూడగట్టారు.
లక్నో: విశ్వహిందూ పరిషత్ (VHP) సీనియర్ నేత, బీజేపీ నాయకుడు, ప్రతాప్‌గఢ్ లోక్‌సభ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి (Ram Vilas Vedanti) సోమవారంనాడు కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వేదాంతి వయస్సు 67 సంవత్సరాలు.
అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వేదాంతి కీలక భూమిక పోషించారు. పలు ర్యాలీలు, కార్యక్రమాలతో ప్రజామద్దతును కూడగట్టారు. ప్రతాప్ గఢ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రాజ్‌కుమారి రత్న సింగ్‌ను 68,460 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.
సంతాపాల వెల్లువ
వేదాంతి మృతికి పలువురు ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. సనాతన ధర్మానికి ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని, ఆయన మృతి సనాతన ధర్మానికి తీరని లోటని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ సంతాప సందేశంలో తెలిపారు. వేదాంతి కన్నుమూయడంతో ఒక శకం ముగిసిందన్నారు. ఆయన తన జీవితాన్నంతా దేశం కోసం, మతం, సమాజం కోసం అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన అనుయాయులందరికీ ఈ సమయంలో గుండెనిబ్బరం ప్రసాదించాలని శ్రీరాముని ప్రార్థిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.
భారతీయ సమాజం, రామభక్తులకు వేదాంతి మృతి తీరని లోటని మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా సంతాపం తెలిపారు. రుషిత్వం, దేశభక్తి, మతం పట్ల అంకితభావానికి వేదాంతి జీవితమే నిదర్శనమని అన్నారు. ఆయన ఆలోచనలు, పోరాటం లక్షలాది మంది రామభక్తుల్లో ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. వేదాంతి మృతి బాధాకరమని, ఆయన లేని లోటు తీరదని బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ నివాళులర్పించారు. రామజన్మభూమి ఉద్యమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని, రామభక్తులందర్నీ ఏకతాటిపైకి తెచ్చారని గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు దేశాల పర్యటన.. బయల్దేరిన ప్రధాని మోదీ
గ్రామీణ ఉపాధిపై కొత్త చట్టం.. లోక్‌సభకు ప్రతిపాదిత బిల్లు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి