Pahalgan Attack-NIA Chargesheet: పహల్గామ్ దాడి కేసు.. నేడు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఎన్ఐఏ
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:51 AM
పహల్గామ్ దాడి కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ కాసేపట్లో చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో అధికారులు ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేడు చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు చార్జ్‌షీటును దాఖలు చేస్తారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే (NIA Charge Sheet).
ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే బాట్‌కోట్‌కు చెందిన పర్వెయిజ్ అహ్మద్ జోథార్, బషీర్ అహ్మద్ జోథార్‌లను అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా వారు ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల వివరాలను వెల్లడించారు. వీరికి సంబంధించి అనేక ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. పహల్గామ్ దాడిలో పాలుపంచుకున్న ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను నిందితులు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పర్వెయిజ్, బషీర్‌లు.. ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వారికి ఆహారం, నివాసంతో పాటు రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఉపా చట్టం సెక్షన్ 19 కింద ఎన్‌ఐఏ నిందితులను అరెస్టు చేసింది.
పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని ఎల్ఈటీ అనుబంధ ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. సులేమాన్ అలియాస్ ఫైజల్ జాట్, హమ్జా అప్ఘానీ, జిబ్రాన్ అనే ఉగ్రవాదులు ఈ మారణహోమానికి దిగారు. ఈ దాడులో 26 మంది అమాయకులు కన్నుమూయగా, 16 మంది గాయపడ్డారు. కేంద్రం ఆపరేషన్ మహాదేవ్‌ను ప్రారంభించి ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ముగ్గురు ఉగ్రవాదులు ఎల్‌ఈటీకి చెందిన కేటగిరీ ఏ కమాండర్లుగా అధికారులు గుర్తించారు.
ఈ ఉగ్రవాదులను ఉసిగొల్పిన పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ను మే 7న ప్రారంభించింది. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా భారత్ విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని హోమ్ మంత్రి షా కూడా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
8వ వేతన సంఘం ఎఫెక్ట్.. పెరిగిన జీతాలు చేతికొచ్చేదెప్పుడో?
నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్