MGNREGA: గ్రామీణ ఉపాధిపై కొత్త చట్టం.. లోక్‌సభకు ప్రతిపాదిత బిల్లు..
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:00 PM
మాహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం.. గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితమైన ఈ పథకానికి ఇక కాలం తీరినట్టే కనిపిస్తోంది. దీనిని రద్దు చేస్తూ, ఆ స్థానంలో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతూ.. ప్రతిపాదిత బిల్లును లోక్‌సభకు పంపింది కేంద్రం. ఇంతకీ ఆ కొత్త పథకం పేరేంటి.? ఆ పూర్తి వివరాలు మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA). ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఈ చట్టాన్ని రద్దు చేసి, దీని స్థానంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు వేసింది. 'ది వికసిత్ భారత్.. గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్(VBGRAMG)' పేరిట నూతన స్కీమ్‌ను ప్రతిపాదిస్తూ.. సంబంధిత బిల్లును లోక్‌సభ(Lok Sabha)కు పంపింది. ఇది ఆమోదం పొందినట్లయితే.. ఎమ్ఎన్ఆర్ఈజీఏ స్థానంలో రానుంది. కొత్త పథకం ప్రకారం.. పని దినాల సంఖ్య 125 రోజులకు పెరగనుంది. గతంలో 100 రోజుల పని మాత్రమే ఉండేది.
తొలుత ఈ పథకం NREGAగా 2005లో అమలులోకి వచ్చింది. కాగా అప్పటి యూపీఏ ప్రభుత్వం 2009 అక్టోబర్ 02 నుంచి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA)గా పేరు మార్చింది. ఈ పథకం కింద.. ప్రతి గ్రామీణ నిరుపేద కుటుంబానికి ఒక ఆర్థిక ఏడాదిలో 100 రోజుల ఉపాధి పొందే హక్కు ఉంటుంది. దీని పనితీరును పరిశీలించేందుకు 2022లో ఓ ప్రత్యేక కమిటీని నియమించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ కమిటీ తన నివేదికను గతేడాది ప్రభుత్వానికి సమర్పించింది.
కమిటీ నివేదిక ప్రకారం.. 2024-25 ఏడాదిలో ఈ పథకం కింద ప్రతి కుటుంబం సగటున 50 రోజుల ఉపాధిని పొందాయి. 40.7 లక్షల కుటుంబాలు మాత్రమే 100 పని దినాలు పూర్తి చేశాయి. ఇక.. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కేవలం 6.74 లక్షల కుటుంబాలే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాయి. గతంలో.. ఈ పథకం కింద అందించే ఉపాధి రోజులను పెంచాలని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. గతేడాది.. 290 కోట్ల వ్యక్తిగత పని దినాలతో ఆయా రాష్ట్రాలు తమ సొంత బడ్జెట్‌ను ఉపయోగించి రూ.4.35 కోట్లతో తక్కువ పని దినాలను కల్పించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణా వంటి రాష్ట్రాలు సొంత వనరులను వినియోగించుకుని ఎక్కువ పనిని సృష్టించుకోగలిగాయి.
ఇవీ చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
నీ భర్తపై కేసు ఉందంటూ వృద్ధురాలికి కాల్.. చివరకు