The dictator is rattled: నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:29 PM
పశ్చిమబెంగాల్లో ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్‌కతా స్టేడియనంలో అభిమానులు విధ్వంసం సృష్టించడంతో బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పించింది.
కోల్‌కతా: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ (West Bengal)లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee)ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ (BJP) బెంగాల్ విభాగం తాజా పోస్ట్ వివాదానికి తెరతీసింది.
హిట్లర్‌తో పోలుస్తూ...
మమతా బెనర్జీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ సోషల్ మీడియా 'ఎక్స్'లో బీజేపీ ఒక పోస్ట్ పెట్టింది. దీనికి 'నియంత భయపడుతోంది' (ది డిక్టేటర్ ఈజ్ రాటిల్ట్) అనే క్యాప్షన్ ఉంచింది. ఇద్దరి నేతల సగం సగం ఫోటోలను జతచేసి 'ఇద్దరూ ఒకటే' అని అభివర్ణించింది. ఈ పోస్టుపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది.
బీజేపీ-టీఎంసీ ఫైట్
పశ్చిమబెంగాల్లో ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో అభిమానులు విధ్వంసం సృష్టించడంతో బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, క్షమాపణలు తెలియజేశారు. అయితే మమతా బెనర్జీ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ ఘటన ఇటు పశ్చిమబెంగాల్‌కు, ఫుట్‌బాల్ క్రీడకు జరిగిన అవమానంగా విమర్శలు గుప్పించింది. దీనికి టీఎంసీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ సైతం తప్పుపట్టింది. అధికార పార్టీ మాత్రం ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఈవెంట్‌ను ఒక ప్రైవేటు పార్టీ నిర్వహించిందని, రాష్ట్ర ప్రభుత్వం కాదని ప్రకటించింది. కొద్ది గంటల్లోనే ఈవెంట్ నిర్వహకుడు శతద్రు దత్తాను బెంగాల్ పోలీసులు అరెస్టు చేసి బిధాన్నగర్ కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తూ 14 రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
అయోధ్య ఉద్యమ నేత, మాజీ ఎంపీ రామ్‌విలాస్ వేదాంతి కన్నుమూత
మూడు దేశాల పర్యటన.. బయల్దేరిన ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి