ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన యుద్ధం, మిగిలిన ప్రశ్నలు

ABN, Publish Date - May 16 , 2025 | 06:29 AM

‘మన తోబుట్టువుల, కుమార్తెల సిందూరాన్ని తుడిచివేసిన పర్యవసానమేమిటో నేడు ప్రతి ఉగ్రవాదికి, ప్రతి ఉగ్రవాద సంస్థకు తెలిసివచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక పేరు కాదు, కోట్లాది భారతీయుల మనోభావాలకు ప్రతిబింబం’... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి జాతినుద్దేశించి...

‘మన తోబుట్టువుల, కుమార్తెల సిందూరాన్ని తుడిచివేసిన పర్యవసానమేమిటో నేడు ప్రతి ఉగ్రవాదికి, ప్రతి ఉగ్రవాద సంస్థకు తెలిసివచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక పేరు కాదు, కోట్లాది భారతీయుల మనోభావాలకు ప్రతిబింబం’... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని మాటలవి. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఆపరేషన్‌ సిందూర్‌లో ఒక విరామం మాత్రమేనని దేశ ప్రజలు విశ్వసించేలా చేసేందుకు ఆయన ప్రయత్నించారు. మోదీ స్వాభావిక వాక్చాతుర్యం, శ్రోతలను సమ్ముగ్ధం చేసే మాటకారితనం ఆ ప్రసంగంలో బాగా కనిపించాయి. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు భారీ నష్టాన్ని కలిగించడంలో ఆపరేషన్‌ సిందూర్ సఫలమయిందని మోదీ అన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రాతిపదికన కొత్త లక్ష్మణ రేఖలు నిర్దేశిస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వంతో చర్చలు ఉగ్రవాదం, ఆక్రమిత కశ్మీర్‌పైన మాత్రమే జరుగుతాయని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇస్లామాబాద్‌ పాలకులు అణ్వస్త్రాల బూచిని చూపుతూ పాల్పడుతున్న బ్లాక్‌ మెయిల్‌కు భారత్‌ బెదరదు, జడవదు అని, మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే కఠినంగా ప్రతిస్పందించేందుకు భారత సైన్యం సదా యుద్ధ సన్నద్ధమై ఉందని నరేంద్రమోదీ హెచ్చరించారు. ఒకపక్క, ఇక్కడ, ఇలా, భారత రాజకీయాల శక్తిమంతుడు తాను పాకిస్థాన్‌ను కాళ్ళబేరానికి రప్పించాకనే కాల్పుల విరమణ జరిగిందంటూ టీవీలో ప్రసంగిస్తుండగానే అక్కడ వేలమైళ్ళ దూరంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ కథనానికి వరుస తూట్లుపొడిచాడు. తాను, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర ప్రయత్నాలు చేసి దక్షిణ ఆసియాలోని రెండు అణ్వస్త్ర రాజ్యాలను కాల్పుల విరమణకు ఒప్పించామని ట్రంప్‌ పేర్కొన్నారు.


ప్రపంచ మీడియా పతాక శీర్షికల్లో ఉండేందుకు మోదీ కంటే ఎక్కువగా ట్రంప్‌ ఆరాటపడడం గత కొద్ది రోజుల్లో ఇది మూడోసారి. కాల్పుల విరమణకు అంగీకరించినట్టు భారత్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు ప్రకటించకముందే ట్రంప్ ఆ విషయాన్ని తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’లో వెల్లడించారు. మరి కొద్ది గంటల్లోనే, భారత్‌, పాకిస్థాన్‌లకు నచ్చచెప్పేందుకు అమెరికా ప్రభుత్వం రాత్రికి రాత్రి చేసిన ప్రయత్నాల గురించి సవివరంగా ట్వీట్‌ చేశారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపుతానని కూడా ఆయన ప్రతిపాదించారు. మే 12న వైట్‌ హౌజ్‌లో మీడియా రోజువారీ గోష్ఠిలో ట్రంప్‌ ఆశువుగా చేసిన వ్యాఖ్యలు ఇంటా బయటా అసాధారణ వ్యక్తిలా వ్యవహరించే ప్రధాని మోదీని చిన్నబుచ్చేవిగా ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌లతో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తామని ఉభయ దేశాల ప్రధానమంత్రులకు గద్దించి చెప్పడం ద్వారా ఈ ఘర్షణ నుంచి విరమించుకునేలా చేశామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇలా ట్రంప్ తనను వెంటాడడం కొనసాగుతుండడంతో సర్వత్రా తనకు ప్రచారాన్ని, ప్రాధాన్యాన్ని పొందడంలో అనితరసాధ్యుడైన మోదీ, ఇప్పుడు ఆ విషయంలో ఇబ్బందుల్లో పడ్డారు! భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య సైనిక ఘర్షణలు తమ ప్రయత్నాల వల్లనే నిలిచిపోయానని అమెరికా ఘనంగా చెప్పుకున్న అంశాన్ని, కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపుతానన్న ట్రంప్‌ ప్రతిపాదనను ప్రధాని మోదీ తన ప్రసంగంలో మాట మాత్రంగానైనా స్పృశించకుండా యథావిథిగా తన ఉద్వేగపూరితమైన ప్రసంగంలో ప్రజలను ముంచెత్తారు. పాకిస్థాన్‌ నాయకులు తమ ప్రసంగాల్లో అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపగా, ఆమెరికా ఉనికిని భారత్‌ కనీసమాత్రంగానైనా అంగీకరించలేదు. భారతీయ ఆడపడుచుల నుదుటి ‘సిందూరం’ను ఉగ్రవాదులు తుడిచేశారని మోదీ తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో భావోద్వేగాలను పురిగొల్పారు.


అమెరికా వ్యాఖ్యలు, వాటిపై నరేంద్ర మోదీ మౌనం వహించడం ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు వీలు కల్పించింది. ప్రధానమంత్రిని ‘విశ్వగురు’గా ఆరాధిస్తున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులను ఈ పరిణామం కలవరపరుస్తోంది. మోదీ తన విదేశీ పర్యటనలలోను లేదా భారత్‌ పర్యటనకు వచ్చిన అంతర్జాతీయ నాయకులను ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం లేదా అభినందనపూర్వకంగా వారి వెన్నుచరచడం పరిపాటి. అలాంటిది ఇప్పుడు ట్రంప్‌ ఆయన్ను, పాకిస్థాన్‌ ప్రధానమంత్రిని సమరీతిలో గౌరవించడం, ఇరువురినీ ఒకే నాణేనికి బొమ్మా బొరుసులాగా పేర్కొనడం ద్వారా మోదీని తీవ్ర ఇబ్బందికి లోను చేశారు. ట్రంప్‌ తీరుతో మోదీ ప్రతిష్ఠ దెబ్బతిన్నది. విధేయ మీడియా, సామాజిక మాధ్యమాల శ్రేణులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ జరిగిన నష్టాన్ని భర్తీచేయడం అసాధ్యంగా ఉన్నది. ఆకస్మికంగా, అనూహ్యంగా అమలు జరిగిన కాల్పుల విరమణను యుద్ధోన్మాదులు హర్షించలేకపోయారు. యుద్ధం చుట్టూ బీజేపీ నిర్మిస్తూవచ్చిన దేశభక్తియుత, ఉద్వేగపూరిత వాతావరణాన్ని ఒక్కసారిగా ఛిద్రంచేసిన నిర్ణయమది. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే అవకాశం వ్యర్థమయిందని వారి బాధ. ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమయ్యేందుకు వారు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. పహల్గాం ఊచకోతలకు ప్రతీకారంగా భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య రగుల్కొనే సైనిక ఘర్షణల గురించి ఈ యుద్ధోన్మాదులు అసాధారణ ఊహలు చేశారు. భారత సైనిక దళాలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటాయని, బంగ్లాదేశ్‌ను విముక్తం చేసినట్లుగానే బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌ శృంఖలాల నుంచి విడిపిస్తాయని వారు ఆశించారు. కానీ, ఆపరేషన్‌ సిందూర్‌లో పాకిస్థాన్‌కు భారీ నష్టాలు వాటిల్లాయని నిరూపించే గట్టి సాక్ష్యాధారాలు ఏవీ ప్రజల దృష్టికి రాలేదు. పైగా పాకిస్థాన్‌ను చావుదెబ్బకొట్టే అవకాశం వచ్చినా కూడా, అంతలోగానే అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం లొంగిపోయి కాల్పుల విరమణకు అంగీకరించిందనే అభిప్రాయం ప్రజలకు కలిగింది. ప్రధానమంత్రి వ్యవహరించిన తీరుపట్ల అసంతృప్తితో సామాజిక మాధ్యమాలలో ట్వీట్లు వెల్లువెత్తాయి. కాల్పుల విరమణను ప్రకటించిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కూడా పోకిరీ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధాన్ని ప్రారంభించాలని సంఖ్యానేకులు డిమాండ్‌ చేశారు. ఈ ధోరణులకు వ్యతిరేకంగా మే 13 రాత్రి మోదీ చాలా కఠినంగా మాట్లాడినప్పటికీ, ఆయన మాటలు వారి ఆవేశాన్ని తగ్గించలేకపోవచ్చు.


కశ్మీర్‌పై పాకిస్థాన్‌తో ఘర్షించడంలో ముందుకు సాగడంపై తమ మద్దతుదారుల ఆకాంక్షలు, అంచనాలను సహేతుకంగా ఉండేలా చేయడంలో ప్రధానమంత్రి, పాలక బీజేపీ చాలా కృషి చేయవలసిన అవసరమున్నది. తీవ్ర జాతీయవాద ఉన్మాదం లేదా దేశీయ రాజకీయాలలో తన ప్రభావ ప్రాబల్యాలు నిర్దేశించే విధానాలను అనుసరించడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి ప్రధాని మోదీకి కచ్చితంగా తెలుసు. పాకిస్థాన్‌ సమీప భవిష్యత్తులో ఉగ్రవాద, సైనిక దుస్సాహసాలకు పాల్పడే అవకాశం లేదు కనుక భారత్‌కు తక్షణ సవాళ్లు దౌత్య రంగంలోనే ఎదురవుతాయి. అణుయుద్ధం కొద్దిలో తప్పిపోయిందని చెప్పడం ద్వారా కశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయ సమస్యగా చేసేందుకు ఇస్లామాబాద్‌ ప్రయత్నించి, సఫలమయ్యే అవకాశమున్నది. మే 7 అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్న ప్రధానాంశం ఒకటి ఉన్నది. అది: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నందున పాత వ్యూహాత్మక నిశ్చితాలు ఏవీ ఇక చెల్లుబాటు కావు. అంతర్జాతీయ వ్యవహారాలలో తనను తాను ఒక స్వతంత్ర శక్తిగా పరిగణించుకుంటున్న ఇండియా తాత్కాలికంగా ప్రతికూలతలను ఎదుర్కోవలసి రావడం తప్పనిసరి. కశ్మీర్ వివాదంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్‌ మొదటి నుంచీ అంగీకరిస్తున్న దృష్ట్యా భారత్‌ సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవలిసి ఉంటుంది. ఈ వాస్తవాల దృష్ట్యా భారత్‌ దౌత్య వ్యూహాలు పటిష్ఠంగా ఉండాలి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి స్వయంగా చొరవ తీసుకోవాలి.

అజయ్‌ బోస్‌ సీనియర్‌ పాత్రికేయుడు (ది క్వింట్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 06:29 AM