Teaching AI to Children: ఏఐ బోధనతో పిల్లల ప్రతిభకు ప్రమాదం
ABN, Publish Date - Nov 05 , 2025 | 03:36 AM
‘బాలలకు ‘కృత్రిమ మేధ’ అవసరమా!’ (అక్టోబర్ 28, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంపై నా ఆభిప్రాయాలు కొన్ని వెల్లడించదలుచుకున్నాను. వ్యాసకర్త ఆర్.రామానుజం ప్రస్తుతం చాలా అవసరమైన ప్రశ్న వేశారు...
‘బాలలకు ‘కృత్రిమ మేధ’ అవసరమా!’ (అక్టోబర్ 28, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంపై నా ఆభిప్రాయాలు కొన్ని వెల్లడించదలుచుకున్నాను. వ్యాసకర్త ఆర్.రామానుజం ప్రస్తుతం చాలా అవసరమైన ప్రశ్న వేశారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ‘కృత్రిమ మేధ’కు సంబంధించిన పాఠ్యాంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు, ఆ అధునాతన సాంకేతిక నైపుణ్య బోధనను మూడవ తరగతి నుంచే ప్రారంభించనున్నట్లు రామానుజం తెలియజేశారు. కృత్రిమ మేధ బోధనకు సంబంధించిన పాఠ్యప్రణాళిక విధి విధానాలు, ఏయే తరగతులలో ఏయే విషయాలు ఉన్నాయో సమగ్రంగా వివరించారు. గమనార్హమైన విషయమేమిటంటే వ్యాస శీర్షికగా ఉన్న ప్రశ్నకు సంబంధించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు! ఆ పాఠ్య ప్రణాళిక అమలు చేయటంలో ఉండే సాధకబాధకాల గురించి వివరించారు. కానీ ‘కృత్రిమ మేధ– బోధన’ పాఠశాల స్థాయి నుంచే అవసరమా? అన్న విషయాన్ని చర్చించకపోయినా చివరలో ఒక మంచిమాట అన్నారు: ‘ఒత్తిడితో పాఠశాల విధులను నిర్దేశించటం లేదా ప్రభావితం చేయటం, విద్యారంగ దీర్ఘకాలిక లక్ష్యాలకు దోహదం చేయదు. సమాజానికి మేలు జరగదు. కృత్రిమ మేధ బలీయమైన ఆకర్షణ గల సాంకేతికత. అంతేకాదు, దాన్ని వినియోగించుకునే అలవాటు వదిలించుకోలేని వ్యసనంగా మారుతుంది. భావి పౌరులను తీర్చిదిద్దే విద్యాలయాలలో ఈ నవ సాంకేతికతను ఉపయోగించడంలో పై నిర్ణయాలను నిష్పాక్షిక వివేచన, సమగ్ర అవగాహన, నిశిత అంతర్దృష్టితో కూడిన సామాజిక వివేకంతో తీసుకోవలసి ఉంది’. విలువైన మాట, సందేహం లేదు.
అభివృద్ధి చెందిన దేశాలలో ఏఐ సాంకేతికతను ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో అమలు చేయడంలో ఉన్న అనుభవాలు, అధ్యయనాల గూర్చి వ్యాసకర్త కనీసమాత్రంగానైనా పేర్కొనలేదు. మొబైల్ ఫోన్‌లు ఎలా ఉపయోగించాలో నేర్పించాలంటున్నారు. అసలు ఆ వయస్సులో మొబైల్ ఫోన్‌లు అవసరమా? కేవలం దాన్ని అవసరం మేరకే ఉపయోగించటం అనేది సాధ్యపడుతుందా? అది ఉపాధ్యాయుల వల్ల అవుతుందా? అంతేకాకుండా కరోనా విపత్తు కాలంలో ఆన్‌లైన్‌లో విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించారు. చదువు సంగతి ఎలా ఉన్నా, ఆ స్మార్ట్ ఫోన్ల వల్ల పాఠాలకన్నా, సినిమాలు, నీలి చిత్రాల వల్ల ఎంత నష్టం జరిగిందో తరువాత జరిగిన అధ్యయనాలు వల్ల మనందరికీ తెలిసిన విషయమే.
‘కృత్రిమ మేధను నేర్పించే క్రమంలో విమర్శనాత్మకంగా ఆలోచించటం బాలలకు నేర్పించాలి’ అని రామానుజం అన్నారు. అసలు పాఠశాల స్థాయి చిన్నారులలో సహజంగా ఉండే నైపుణ్యాలను, సృజనాత్మకతను, అభిరుచులను పెంపొందించకుండా ఏఐ లాంటి నవీన సాంకేతికతను వారి మెదళ్లలోకి ఎక్కించటంతో సాధించగలిగేది ఏమిటి? దానివల్ల బాలల్లో ఉండే సహజసిద్ధమైన తెలివితేటలకు ఎనలేని హాని సంభవించే ప్రమాదమున్నది. ఇప్పటికే అనవసరమైన సిలబస్ భారంతో బాలలు కుంగిపోతున్నారు. నిర్బంధంగా ఒత్తిడి చదువులు చదువుతున్నారు. వాటికి తోడు కృత్రిమమేధ లాంటి అధునాతన సంక్లిష్ట సాంకేతికత నేర్చుకోవడం అవసరమా? ఇప్పటికే ఉపాధిరంగంగా భావించి యువతరం అంతా సాంకేతిక విద్య వైపే దృష్టి కేంద్రీకరించింది. తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా మూసలో పోసిన విధంగా ఉండటం అనేది ఒక విషాదకర పరిణామం. మానవీయ, సామాజిక శాస్ర్తాల బోధనపై శ్రద్ధ అడుగంటిపోయింది. భాషా సాహిత్యాలపై ఎక్కడలేని ఉపేక్ష! ఫలితంగానే ఈ రోజు తెలుగు భాష ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. పాలకులు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల ఉద్యోగావకాశాలు కూడా కుంచించుకు పోతున్నాయనే వాస్తవాన్ని విస్మరించకూడదు. పిల్లల్లో సాహిత్యం, లలితకళలపై ఆసక్తులు నెలకొల్పడంలో ప్రస్తుత చదువులు విఫలమవుతున్నాయి. ఫలితంగా.. ఎదిగే క్రమంలో సమాజం గురించి గానీ, మానవ సంబంధాల గురించి గానీ ఈనాటి పిల్లలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేని వయోజనులుగా పరిణమిస్తున్నారు. ఈ దుస్థితికి ప్రధాన కారణం విద్యావ్యవస్థ కార్పొరేటీకరణ కాదా? ప్రభుత్వాలు సైతం విద్యారంగంపై సరైన దృష్టి పెట్టకపోవటం కూడా గర్హనీయమే.
అభివృద్ధి చెందిన దేశాలలో ఏఐ సాంకేతికత అదీ ఉన్నత విద్యలో ప్రవేశపెట్టటం అనేది కొంతవరకు సమర్థించదగిన విషయమే. అయితే మనలాంటి వెనకబడిన దేశాలలో ప్రభుత్వాలు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని నిర్వీర్యం చేస్తోన్న పరిస్థితుల్లో బాలలకు కృత్రిమ మేధ బోధనను ప్రారంభించడమనేది బహుళజాతి కంపెనీల వస్తువులకు మార్కెట్ కల్పించటమే. బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు కేటాయించలేని ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేసే ఈ చర్యలు ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కిన’ చందంగా ఉంటుంది. ఇంకో విషయమేమంటే, ప్రభుత్వాల దృష్టిలో విలువలు కలిగిన విద్య అంటే సాంకేతిక విద్య, ఇంగ్లీషు మీడియం చదువులు అని భావించటం వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విలువలు కలిగిన చదువులు అంటే మనిషి తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించటమే. ఈ రోజున అలాంటి చదువులు లేవు కాబట్టే సమాజం ఇంత అరాచకంగా తయారవుతోంది. మొత్తం మీద కృత్రిమ మేధ లాంటి అత్యాధునిక సాంకేతిక విద్యలు మనిషికి సౌకర్యవంతమయిన జీవితం కల్పించవచ్చు కానీ దాని వల్ల సంభవించే నష్టదాయక పరిణామాలే ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మనుషుల మధ్య ఉండాల్సిన మానవీయ సంబంధాలు మరింత అమానవీయంగా మారే ప్రమాదముంది.
రాజ్యలక్ష్మి పొన్నపల్లి
ఈ వార్తలు కూడా చదవండి...
రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 05 , 2025 | 03:36 AM