Pawan Kalyan: రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:51 PM
‘సాస్కి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజలకు ‘సాస్కి’ నిధుల ఫలాలు అందించాలని సూచించారు.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. ప్రజలకు ‘సాస్కి’ నిధుల ఫలాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల అధికారులకి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు రూ.2 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
ఆ బాధ్యత అధికార యంత్రాంగానిదే..
సాస్కి నిధులతో నిర్మించే రోడ్లలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో బాధ్యత అధికార యంత్రాంగానిదేనని ఆజ్ఞాపించారు. రోడ్ల నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకూ అధికారులు పరిశీలించాలని హుకుం జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో మరో ముందడుగు వేశామని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.
ఏపీలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించడానికి కేంద్రప్రభుత్వం ‘సాస్కి’ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రూ.2వేల కోట్లు నిధులు సమకూర్చిందని వ్యాఖ్యానించారు. ఈ నిధులతో ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం..
ఈ క్రమంలో దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో ఏపీకి సాస్కి నిధులు సమకూరాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వీటిని సద్వియోగం చేసుకుందామని సూచించారు. ఈ నేపథ్యంలో సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
రహదారుల నాణ్యతలో రాజీపడబోం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి సాస్కి నిధులు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంపై ఉందని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దని మార్గనిర్దేశం చేశారు పవన్ కల్యాణ్ .
ఎప్పటికప్పుడు పరిశీలించాలి..
రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదేనని హుకుం జారీ చేశారు. నిర్మాణ కాంట్రాక్టు పొందినవారికి ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియజేయాలని ఆదేశించారు. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలని ఆజ్ఞాపించారు. క్షేత్రస్థాయికి వెళ్లి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో తాను, నిపుణులు తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దని హెచ్చరించారు పవన్ కల్యాణ్.
ప్రతి గ్రామానికీ మంచి రహదారులు ఉండాలి
‘ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అవసరం. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవి. సాస్కి ద్వారా వస్తున్న రూ.2వేల కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకొనే అవకాశం వచ్చింది. ప్రత్యేకమైన ప్రాంతాల్లో, సందర్భాల్లో ఈ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయొచ్చు. పుట్టపర్తిలో సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడ మౌలిక వసతులు కల్పనలో భాగంగా పంచాయతీ రోడ్లు పటిష్ట పరచాలని ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించారు. ఇందుకోసం రూ.35 కోట్లను ఈ నిధుల నుంచి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి కీలకమైన అభివృద్ధి పనులకు సాస్కి నిధులు ఎంతగానో తోడ్పడతాయి. రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించింది. వివిధ మార్గాల్లో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎప్పటికప్పుడు ఏపీలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తున్నాం. సాస్కి నిధులు విడుదల చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. నిధులు పొందటంలో, వాటిని వినియోగించే ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇందులో అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలి’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News