MP Avinash Reddy: ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:49 PM
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు అవినాశ్ రెడ్డి.
కడప, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతుల (Onion Farmers) సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (Kadapa MP YS Avinash Reddy) డిమాండ్ చేశారు. 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. కడప కలెక్టర్ శ్రీధర్‌ని ఇవాళ (మంగళవారం) కలిశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్‌ని కలిసి ఉల్లి రైతుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని కోరానని చెప్పుకొచ్చారు. అక్టోబరులో కూడా ఈ విషయంపై కలెక్టర్ శ్రీధర్‌ని కలిశానని గుర్తుచేశారు అవినాశ్ రెడ్డి.
ఆ జీవో రాలేదు..
హెక్టార్‌కు రూ.50 వేల మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉల్లి రైతుల కోసం తక్షణం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గతంలో చెప్పినా ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో కలెక్టర్‌ని కలిసినప్పుడు ఉల్లి రైతులని ఆదుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నెల రోజులు అయినా సంబంధిత జీవో కూడా రాలేదని... సీఎం దగ్గర ఫైల్ ఉందని కలెక్టర్ శ్రీధర్ చెబుతున్నారని తెలిపారు. రెండు వారాల్లో రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేపడతామని చెప్పుకొచ్చారు అవినాశ్ రెడ్డి.
ఫసల్ బీమాని వెంటనే చెల్లించాలి..
ఫసల్ బీమాలో రైతుల కోసం రూ.173 కోట్లు వచ్చాయని కలెక్టర్ శ్రీధర్ చెబుతున్నారని అన్నారు. ఫసల్ బీమా పైసలని రైతులు ఎవరికీ ఇస్తున్నారో వివరాలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. 2024 ఖరీఫ్ వరకు పెండింగ్‌లో ఉన్న ఫసల్ బీమాని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అన్ని రకాల పంటలు నీట మునిగాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే విధానం అమలు చేయాలని కోరారు అవినాశ్ రెడ్డి.
ధాన్యం కొనుగోలు చేయాలి..
‘ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వం అక్టోబరు 27వ తేదీ నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని.. అయినా ఇప్పటి దాకా ఎందుకు కొనుగోలు చేయలేదు. కడప జిల్లాలో 17 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఏపీ సర్కార్ చెప్పింది. తక్షణం ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. గత ప్రభుత్వంలో మూడు వారాల్లో దిగుబడి చేతికి వచ్చే పంటలపై గిట్టుబాటు ధర ప్రకటించే వారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి విధానం లేదు. గతంలో దళారులు కూడా ప్రభుత్వం ప్రకటించిన ధరకే ధాన్యం కొనుగోలు చేసేవారు. గిట్టుబాటు ధర ప్రకటించక పోవడం వల్ల తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం.. ఎంత ఖరీదంటే
కల్పిత వీడియోలపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News