ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sardar Patels Vision of Unity: సమైక్యతే భారతీయ జీవన ధర్మం

ABN, Publish Date - Oct 31 , 2025 | 05:08 AM

గణతంత్ర భారత పునాదులను నిశ్చయాత్మకంగా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో ప్రముఖుడు స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రి, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతిని పురస్కరించుకుని...

గణతంత్ర భారత పునాదులను నిశ్చయాత్మకంగా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో ప్రముఖుడు స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రి, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతిని పురస్కరించుకుని, ఏటా అక్టోబరు 31న ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ (జాతీయ సమైక్యతా దినోత్సవం) జరుపుకుంటున్నాం. 1947 అనంతరం 560కు పైగా సంస్థానాలను ఏకతాటి పైకి తెచ్చి ఒకే రాజకీయ ఛత్రం కింద వాటిని విలీనం చేశారాయన.

దేశ విభజనానంతర పరిస్థితుల్లో... పటేల్ వాస్తవిక దృక్పథం, సహనం, దృఢత్వాలే భారత ఉపఖండం విచ్ఛిన్నం కాకుండా నిరోధించాయి. ఆయన చొరవ, దృఢ సంకల్పమే లేకపోతే జునాగఢ్, హైదరాబాద్, జమ్మూ–కశ్మీర్‌ అనిశ్చితిలోకి జారిపోయి ఉండేవి. పటేల్ ప్రతిపాదించిన ‘సమైక్యతా’ భావన ‘అందరూ ఒకేలా ఉండి తీరాల’న్నది కాదు.. ఉమ్మడి వారసత్వంతో ముడిపడి ఉన్న దేశ జనుల భావాలు, హృదయాల కలయిక అది. విస్తృతమైన వైవిధ్యాలు, సరికొత్త ఆకాంక్షల శకంలో ఆ విశ్వాసమే భారత్‌ను స్థిరంగా నిలుపుతోంది.

ఐక్యత అంటే ‘నిశ్చిత భావన’ కాదని, దేశ చేతన దిశగా నిరంతర చర్యగా దాన్ని గుర్తిస్తూ.. పటేల్ జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా నిర్వహించాలని 2014లో ప్రభుత్వం నిర్ణయించింది. దేశ సమగ్రత కోసం పునరంకితమవుతామని దేశవ్యాప్తంగా పాఠశాలలు, పౌర సమాజ సంస్థలు, ప్రజలు ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తారు. సమష్టి కార్యాచరణ దిశగా పటేల్ ఇచ్చిన పిలుపును ప్రతిబింబించేలా ‘ఐక్యత కోసం పరుగు (రన్ ఫర్ యూనిటీ)’ వంటి కార్యక్రమాలుంటాయి. దేశభక్తి భావోద్వేగాలకు మాత్రమే పరిమితం కాదని, మన క్రియాశీల భాగస్వామ్యం ఆవశ్యకమని ఇవి చాటుతాయి. పటేల్ దేశ నిర్మాణ పరంపరను చిరస్మరణీయం చేసేలా నెలకొల్పిన 182 మీటర్ల ఎత్తైన ‘ఐక్యతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)’ సమీపంలో.. ఏక్తా నగర్‌లో ఈ సంవత్సరం ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిన్న స్వరాలు ఒక్కటవ్వడమే భారత్ బలమన్న స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలు, రాష్ట్రాల శకటాలు, 900 మందికి పైగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.

విస్తృతమైన భాషలు, విశ్వాసాలు, జానపద సంప్రదాయాలు కలసిమెలసి సాగుతున్న మన దేశంలో.. ‘సంస్కృతీ’ భావనే అనాదిగా ఐక్యతకు శాశ్వత వారధిగా నిలిచింది. జోనల్ సాంస్కృతిక కేంద్రాల నుంచి జాతీయ స్థాయి మ్యూజియాల వరకు.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలన్నీ దేశ వారసత్వ సంపదను అందరికీ అందుబాటులోకి తేవడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. దేశ సాంస్కృతిక పథం నుంచి ఏ ప్రాంతమూ వేరుపడి లేదన్న భరోసానిస్తున్నాయి.

భాష, వంటకాలు, కళల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పరస్పర వినిమయం ద్వారా.. ‘ఏక్ భారత్ శ్రేష్ఠతా భారత్’ వంటి కార్యక్రమాలు ఈ స్ఫూర్తిని సంస్థాగతీకరిస్తున్నాయి. మహారాష్ట్ర విద్యార్థులు బిహూ నేర్చుకుంటారు, అస్సాం యువ కళాకారులు పూణేలో లావణి ప్రదర్శిస్తారు.. ‘ఒకరినొకరు తెలుసుకోవడమే కలిసి నిలిచేందుకు తొలి మెట్టు’ అన్న పటేల్ భావనను అనుసరించడమే ఇది.

పర్యాటకం కూడా ఐక్యతకు సాధనం. పంజాబ్ స్వర్ణ దేవాలయం నుంచి కేరళ మిగులు జలాల వరకు, అస్సాం తేయాకు తోటల నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు... ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమం, నవీకరించిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా డిజిటల్ వేదిక’లు ప్రజలు తమ మాతృభూమిలోని అన్ని ప్రాంతాలనూ చుట్టి వచ్చేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఒక్క 2024లోనే దేశీయ పర్యటనలు 294 కోట్ల మార్కును దాటాయి. భారత్ పట్ల భారతీయుల్లో పెరుగుతున్న ఉత్సుకతకు, చైతన్యానికి ఇది నిదర్శనం.

‘స్వదేశ్ దర్శన్, ప్రసాద్’ వంటి పథకాలు మౌలిక వసతుల కల్పనకే పరిమితం కాకుండా, స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. నాగాలాండ్‌లో ఓ మహిళ నడిపే అతిథి గృహానికి గుజరాత్ సందర్శకులు వెళ్లడం, జోధ్‌పూర్‌లోని ఓ కళాకారుడు తమిళనాడు పర్యాటకులకు హస్త కళాకృతులను విక్రయించడం... ఇవన్నీ వస్తువుల విక్రయమో, వ్యాపారం మాత్రమో కాదు.. వారు అనుభవాలను పంచుకుంటారు. అది దేశాన్ని మరింత దగ్గర చేస్తుంది.

సమైక్యతా భావన తరతరాల చైతన్యంగా ఉండాలన్నదే సర్దార్ పటేల్ అంతరంగం. ఉదాసీనత, అవివేకం, సంకుచిత ప్రాంతీయ భావన వంటి విచ్ఛిన్నకర అంశాల నుంచి దాన్ని రక్షించుకోవాలి. 2047 వైపు దేశం వేగంగా అడుగులేస్తున్న తరుణంలో... దేశ సంఘటనా కృతనిశ్చయమే కేంద్రంగా పంచ ప్రాణ్ (ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ అయిదు సంకల్పాలు) రూపకల్పన జరిగింది.

సర్దార్ పటేల్ 150వ జయంతిని జరుపుకుంటున్న తరుణమిది. పాలరాతి విగ్రహాలో, స్మారకాలో కాదు... దేశ ఐక్యతా ప్రస్థానంలో భాగమని ప్రతి భారతీయుడూ భావించేలా చూడడమే ఆ ఉక్కు మనిషికి మనమిచ్చే నిజమైన నివాళి. సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొనడం, మ్యూజియాల సందర్శన, అనేక రాష్ట్రాల సందర్శన... ఇలా ప్రతి సమష్టి కార్యక్రమమూ మన నాగరికతను అనుసంధానించే అమూర్త బంధాలను మరింత పటిష్ఠం చేస్తుంది.

సర్దార్ పటేల్ మాటల్లో చెప్పాలంటే.. సమైక్యతే దేశ భవితకు మార్గం, మన అంతిమ లక్ష్యం – ఇదే ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్ స్ఫూర్తి... ఆయన నిర్దేశాన్ని శిరసావహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే బాటలో నడుస్తున్నారు.

గజేంద్రసింగ్ షెకావత్

కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..

ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..

Updated Date - Oct 31 , 2025 | 05:08 AM