Sardar Patels Spirit: సర్దార్ స్ఫూర్తే వికసిత భారత్
ABN, Publish Date - Oct 31 , 2025 | 05:12 AM
స్వతంత్ర భారతదేశానికి తొలి ఉప ప్రధాని, హోంశాఖా మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తెలంగాణ బిడ్డలుగా...
స్వతంత్ర భారతదేశానికి తొలి ఉప ప్రధాని, హోంశాఖా మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తెలంగాణ బిడ్డలుగా సర్దార్ పటేల్‌కు గౌరవ వందనం చేయడం మన అదృష్టం. ఆయన చూపిన ధైర్యం, రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే దక్కన్ ప్రాంతానికి గుండెకాయ అయిన హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో అవిభాజ్య భాగంగా నిలిచింది.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన నేతలు దేశంలో ఉన్న సుమారు 565 సంస్థానాలను ఒక సార్వభౌమ దేశంగా ఏకీకరించే మహత్తరమైన కార్యానికి పూనుకున్నారు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు భారత్ విభజిత ఉపఖండంలా ఉంది. దీన్ని పరిష్కరించడానికి మొక్కవోని ధైర్యం, అకుంఠిత కార్యదీక్ష కావాలి. అప్పటికి చాలా సంస్థానాలు స్వయం చాలకంగానే భారత్‌లో అంతర్భాగం అయ్యేందుకు అంగీకరించాయి. కేవలం హైదరాబాద్ సంస్థానం, జునాగఢ్, కశ్మీర్ వంటి రాజ్యాలు స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్థాన్‌లో భాగం కావాలని కోరుకున్నాయి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం దేశంలోని ఏ ఒక్క స్వతంత్ర సంస్థానాన్నీ విడిగా ఉంచేందుకు అంగీకరించలేదు.
నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలో సమృద్ధి, స్వావలంబనతో ఉన్న రాష్ట్రం హైదరాబాద్. దీనికి సొంత కరెన్సీ, సైన్యం, పరిపాలన ఉన్నాయి. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయిన నిజాం, భారత యూనియన్ నుంచి తాను స్వతంత్రంగా ఉండగలనన్న బలమైన నమ్మకంతో ఉన్నాడు. వల్లభాయ్ పటేల్ మాత్రం ఏకీకృత భారతంలో హైదరాబాద్ ప్రత్యేకంగా ఉండబోదని స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వం కశ్మీర్‌ను కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నా, ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనానికి రజాకార్లు, నిజాం వ్యక్తిగత సైన్యం ఒప్పుకోలేదు. వారు తెలంగాణ పౌరులపై ప్రత్యేకించి భారత్‌లో విలీనం కోసం నిలబడిన హిందువులపై అనేక దాడులు చేశారు. కశ్మీర్ యుద్ధానికి, పాకిస్థాన్‌కు నిజాం ఆర్థిక మద్దతు ఇవ్వడం వంటి చర్యలు పటేల్ సంకల్పాన్ని మరింత బలపరిచాయి. దాంతో భారతదేశ ఏకీకరణకు ఆయన దృఢమైన నిశ్చయంతో ముందుకు కదిలారు. 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ కింద భారత సైన్యం మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నాయకత్వంలో వేగంగా హైదరాబాద్ వైపునకు మళ్లింది. నిజాం సైన్యం కనీసం పోరాటాన్ని కూడా చూపలేదు. కేవలం నాలుగు రోజుల్లో నిజాం ఓటమిని ఒప్పుకుని లొంగిపోయాడు. వ్యూహం, దౌత్యం, నిర్ణయాత్మకమైన సైనిక చర్యల సంవిధానంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో పటేల్ విలీనం చేయించగలిగారు. ప్రధాని నెహ్రూ ఊహించినట్లుగా... విషయం యునైటెడ్ నేషన్స్ వరకూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యుత్తమ రాజనీతిజ్ఞతకు, ధైర్యానికి ఇది గొప్ప ఉదాహరణ.
సర్దార్ పటేల్ ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఒక రూపకర్త. అనేక అడ్డంకులను అధిగమించి విభిన్న ప్రాంతాలను ఏకం చేశారు. మనం ఈ రోజు ఒకే దేశంగా మనగలుగుతున్నాం అంటే అది సర్దార్ పటేల్ కృషి వల్లే. ఇప్పటికీ దేశంలోని కొన్ని శక్తులు ఈ సమగ్రతను వ్యతిరేకిస్తున్నారు. వీళ్లు ఆయుధాలు, బాంబులు, వివిధ ప్రచార మాధ్యమాలు ఉపయోగించి ప్రజలను విభజిస్తున్నారు. పటేల్ నిర్మించిన ఈ దేశ సమైక్యతను ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల నాయకత్వంలో భారతదేశ సమగ్రత, అంతర్గత భద్రత వంటి అంశాలు ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాయి.
దురదృష్టం ఏమిటంటే వల్లభాయ్ పటేల్‌కు మన పాఠ్యపుస్తకాలలో సరైన స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వలేకపోయాం. చరిత్రను కేవలం ఒక కుటుంబం గౌరవానికి అనుకూలంగా రచించడం, స్వాతంత్ర్యం కోసం పనిచేసిన ఎంతో మంది గొప్ప నాయకుల చరిత్రను పుస్తకాల్లో లేకుండా చేయడం వాస్తవ చరిత్రను కప్పి ఉంచడమే.
అంతర్జాతీయంగా దేశాల మధ్య భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు, ప్రతి దేశం ప్రత్యక్షంగా, పరోక్షంగా సమస్యలను ఎదుర్కొంటుంది. అలాగే వివిధ దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ఏకతా మార్గంలో ప్రయాణించవలసిన అవసరం ఉంది. ఈ రోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గౌరవిస్తూ, ఆయన గుండె ధైర్యాన్ని, దూరదృష్టిని, ఏకీకృత భారతదేశానికై చూపిన అచంచల విశ్వాసాన్ని స్మరించుకుందాం. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకుంటూ ఒక ఆత్మనిర్భర భారతాన్ని, సుస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి మనమంతా కృషి చేద్దాం. వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో సర్దార్ పటేల్ చూపిన ఆదర్శం మనకు మార్గదర్శకం.
ఎన్. రామచందర్ రావు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
ఇవి కూడా చదవండి
ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..
ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..
Updated Date - Oct 31 , 2025 | 05:12 AM