ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Red Fort Blast: ఎర్రకోట ఘటన దేశానికి ఓ హెచ్చరిక

ABN, Publish Date - Nov 18 , 2025 | 05:59 AM

ఈ నెల 10న ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో జరిగిన భయంకరమైన పేలుడుతో మన దేశం సహా, ఉగ్రవాదుల చర్యలతో సతమతమవుతున్న అన్ని దేశాలూ ఉలిక్కిపడ్డాయి. కొందరి పాశవిక ఆలోచనలతో కూడిన ప్రవర్తన వల్ల ఇలాంటి...

ఈ నెల 10న ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో జరిగిన భయంకరమైన పేలుడుతో మన దేశం సహా, ఉగ్రవాదుల చర్యలతో సతమతమవుతున్న అన్ని దేశాలూ ఉలిక్కిపడ్డాయి. కొందరి పాశవిక ఆలోచనలతో కూడిన ప్రవర్తన వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేయించి, దీన్ని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. పేలుడు ఘటనకు కారణమైన కారు ఉమర్‌–ఉన్–నబీ అనే డాక్టర్‌దని, ఆయన కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందినవాడని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎర్రకోటను మరొక డాక్టర్‌ ముజమ్మిల్‌ గనై సందర్శించాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఘటనకు ముందే (అక్టోబర్‌ 30న) ఉగ్రవాద అనుమానితుడిగా పేర్కొంటూ ముజమ్మిల్‌ను కశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి ఫొటోలు దర్యాప్తు సంస్థలకు చిక్కాయి. ఈ ఇద్దరు డాక్టర్లు పుల్వామాకు చెందినవారే. వీరు అల్‌–ఫలాహ్ యూనివర్సిటీ (హర్యానా)లో పనిచేస్తున్నారు. ముజమ్మిల్‌, అతని సోదరుడు కొన్నేళ్ల క్రితం టర్కీని సందర్శించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ టెర్రరిస్టు సంస్థతో వీరికి ఒక హ్యాండ్లర్‌ ద్వారా సంబంధాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.

వీళ్ళిద్దరూ అల్‌–ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నంత మాత్రాన మొత్తం యూనివర్సిటీ వారందరినీ అనుమానితుల జాబితాలో చేర్చడం తప్పు. ఉగ్రవాదుల ముఖ్యోద్దేశ్యం కూడా అదే. ఏదోవిధంగా మతోన్మాదాన్ని రెండు వర్గాల మధ్య రగిల్చి, ఆ వర్గాలను వీడదీసి, తమ పబ్బం గడుపుకుందామనే. అది సాగనీయకుండా చేయటమే ప్రభుత్వాలు, పాలకులు, ప్రతిపక్షాలు, ప్రజల కర్తవ్యం. రాజకీయాలు ప్రవేశించనంత వరకూ మతానికి సంబంధించిన గొడవలు అడపాదడపా జరుగుతాయి కానీ – మూకుమ్మడిగా చంపుకోవటాలూ, గృహ దహనాలూ, పెచ్చరిల్లిన వైషమ్యాలు... వంటివన్నీ కొంతమంది స్వలాభం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. సమాజంలో వర్గాలు ఏర్పడినప్పుడే అణచటానికి వీలులేని విధంగా గొడవలు విస్తరిస్తాయి.

ఈ దాడి మరింత వికృతరూపం దాల్చకుండా ఉండడానికి ఒక ప్రధాన కారణం డా. జీవీ సందీప్‌ చక్రవర్తి. ఈయన 2014 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన సమయస్ఫూర్తితో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని కథనాలు వస్తున్నాయి. కొంతమంది పోస్టర్లు మాత్రమే చూస్తారు. సందీప్‌ చక్రవర్తి లాంటి పోలీసు అధికారులు ఆ పోస్టర్‌ వెనకాల ‘ప్లాన్‌’ కూడా కనిపెడతారు. కశ్మీర్‌ లోని నవ్‌గాంలో జైషే మహ్మద్‌ పోస్టర్లు చూసిన వెంటనే సందీప్‌ ఎంక్వైరీ చేయించారు. దాంతో 2,900 కిలోల ఐఈడీ, స్లీపర్‌ సెల్స్‌–నెట్‌వర్క్‌, ఇండియా మొత్తాన్ని కబళించే ఎత్తుగడలు బయటపడ్డాయి. ‘అది కేవలం పోస్టర్‌’ అని సందీప్‌ తీసిపారేసినట్లయితే ఈపాటికి దేశమంతటా ఎన్నో పేలుళ్లు సంభవించేవి. ఈ ఆఫీసర్‌ ఇప్పటికే ఆరు గాలంట్రీ అవార్డులు పొందారు. సందీప్‌ తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణం.

పూర్తి విచారణ తర్వాతే మిగిలిన చాలా అంశాలు వెలుగులోకి వస్తాయి. పేలుడులో చనిపోయిన డాక్టర్‌కు దేశంలో చాలా మందితో లింకులు ఉన్నాయని, వీరంతా ‘టెర్రర్‌ స్ట్రయిక్స్‌’ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అదృష్టవశాత్తూ ఈ కుట్రభగ్నమైందని తెలుస్తోంది. అందుకే భారత ప్రభుత్వం, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, తదితర సంస్థలు ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తును చేపట్టాయి. వార్తా సంస్థలు, ప్రతిపక్షాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తేనే నిజానిజాలు శీఘ్రగతిన బయటకు వస్తాయి. లేకపోతే ‘నిప్పొకచోట, నీళ్ళు మరో చోట’ అన్నరీతిలో అనేక అవరోధాలు కల్పించినవారవుతారు. వ్యవస్థీకృత నేరాలు తరచూ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న మాట నిజం. అమెరికాలోని అధికార ప్రతినిధి– ఈ సందర్భంగా ‘భారత్‌లోని దర్యాప్తు సంస్థలు క్రమపద్ధతిలో దర్యాప్తు చేస్తుండటం గమనార్హం’ అని మీడియాకు చెప్పటం ఒక విధంగా ఉగ్రవాదుల చర్యలను పరోక్షంగా ఖండించినట్లే. భారతదేశ విదేశాంగమంత్రి జైశంకర్‌తో ఆ దేశపు డిఫెన్స్‌ సెక్రెటరీ మాట్లాడి, వివరాలు తెలుసుకోవటం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తిదాయకంగానే కనపడుతోంది.

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కౌంటర్‌ టెర్రరిజం చర్యలు ప్రత్యేకంగా సత్ఫలితాలు ఇస్తున్నాయి. నిజానికి ఉగ్రవాదుల చర్యలు అనేక దేశాలను వణికిస్తున్నాయి. మన చట్టాలను పటిష్ఠరీతిలో అమలుచేయటంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను బలోపేతం చేసి, ఉగ్రవాద చర్యలకు కేంద్రం చాలావరకు చెక్‌ పెట్టిన మాట వాస్తవం. ఇలాంటి ఘటనలు జరగడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలను ముందుగానే కేంద్రం హెచ్చరించి ముందు జాగ్రత్త చర్యలను తీసుకొనే విధంగా వాటిని సంసిద్ధపరచడం ద్వారా కూడా చాలావరకు సమస్యలు సమసిపోయాయి. సంసిద్ధంగా పోలీసు వ్యవస్థలూ, ఎన్‌ఐఏ లాంటి విభాగాల వల్ల ఎన్నో ఘటనలు ఆదిలోనే అంతమవుతున్నాయి. అయితే ఎర్రకోట పేలుడు లాంటి ఘటన దేశంలో ఎక్కడైనా జరిగితే... దేశంలో ఆందోళనలతో పాటు, విపక్ష నేతలు, మీడియా కూడా కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలనూ తప్పుబట్టడానికి అప్పుడప్పుడూ ప్రయత్నం చేస్తుంటాయి. అది సరికాదని అందరూ గమనించి, ప్రభుత్వాలకు తగు సహకారం అందిస్తేనే కౌంటర్‌ టెర్రరిజం చర్యలు ఫలవంతమవుతాయి. ఈ ఘటన అనంతరం దేశంలో నలుమూలలా అనేక అరెస్టులు జరిగాయి. ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలనూ వెలికితీయటం వల్ల ఎలాంటి అనర్థాలూ జరగలేదు. అందుకే దేశరక్షణకు అప్రమత్తతతో పాటు అందరి సహకారం అవసరం.

రావులపాటి సీతారాంరావు

ఈ వార్తలు కూడా చదవండి:

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Updated Date - Nov 18 , 2025 | 05:59 AM