ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The High Command Has Changed Parties: పార్టీ మారిన హై కమాండ్‌

ABN, Publish Date - Dec 21 , 2025 | 04:44 AM

హై కమాండ్‌! రాజకీయ వ్యవహారాలలో తరచూ విన్పించే వాక్సరణి అది. హై కమాండ్‌ అనే ఆలోచన బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి భావనాత్మకంగా అసంగతమైనది. పార్లమెంటరీ...

హై కమాండ్‌! రాజకీయ వ్యవహారాలలో తరచూ విన్పించే వాక్సరణి అది. హై కమాండ్‌ అనే ఆలోచన బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి భావనాత్మకంగా అసంగతమైనది. పార్లమెంటరీ వ్యవస్థకు ప్రాతిపదికలు అయిన ప్రజా ప్రాతినిధ్యం, జవాబుదారీతనం, పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం మొదలైన సూత్రాలకు హై కమాండ్‌ ప్రాథమికంగా విరుద్ధమైనది. ఎన్నికైన నిరంకుశ పాలకుడి ప్రభావ ప్రాబల్యాలకు అదొక నిండు తార్కాణం. సంప్రదాయకంగా ఈ పదం కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ– గాంధీ కుటుంబంతో ముడివడి ఉంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రప్రథమంగా రాజకీయ వర్గాలలోను, సామాన్య ప్రజానీకంలోను కాంగ్రెస్‌ హై కమాండ్‌గా పేరుపొందారు. పార్టీ వ్యవహారాలలో తిరుగులేని రీతిలో నిర్ణయాత్మక అధికారాలను చెలాయించడం ఇందిరతోనే ప్రారంభమవడం వల్లే కాంగ్రెస్‌ హై కమాండ్‌కు ఆమె పర్యాయపదంగా వెలుగొందారు. ఈ రాజకీయ చరిత్ర ఇప్పుడొక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. సమకాలీన హై కమాండ్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి; 10, జన్‌పథ్‌ నుంచి 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌, 6 ఎ కృష్ణ మీనన్‌ మార్గ్‌కు మారింది. ఇవి, పదకొండేళ్ల క్రితం వరకు గుజరాత్‌లోను, ఇప్పుడు యావద్భారతంలోను రాజకీయ జోడీ నంబర్‌ వన్‌గా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధికార నివాసాలని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ తాజా పరిణామాన్ని పరిగణనలోకి తీసుకోండి. మొన్నగాక అటు మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా 45 ఏళ్ల నితిన్‌ నబిన్‌ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆయనెవరో మీకు తెలుసా? బిహార్‌లో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగాను, ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రిగాను ఉన్న ఈ యువనేత గురించి శ్రద్ధ చూపినవారు ఆ రాష్ట్రం వెలుపల ఎవరూ లేరు. అయితే ఇప్పుడాయన మన జాతీయ పాలకపక్షంలో ఉదయిస్తున్న తారగా, ప్రభవిస్తున్న నాయకుడుగా దేశ ప్రజల దృష్టిలో ఉన్నారు. జగత్‌ ప్రకాష్‌ నడ్డా అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నిక లేదా ఎంపిక అవుతారు (కౌన్‌ బనేగా బీజేపీ అధ్యక్ష) అనే విషయమై అంతూ పొంతూ లేకుండా ఊహాగానాలు జరుగుతున్నాయి. రాజకీయ వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఇంతలో, అకస్మాత్తుగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా నితిన్‌ నబిన్‌ పేరు ప్రకటించారు(నాన్‌– వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తరహా పదవి ఏదైనా ఉన్నదా ఏమిటి?). కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరో తెలియగానే ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెల్లువెత్తారు. ఇలావచ్చిన వారిలో కొంతమంది నితిన్‌ నబిన్‌ ఎవరో తాము గుర్తు పట్టలేకపోయామని చెప్పారు.

బీజేపీ అధ్యక్షుడుగా నితిన్‌ నబిన్‌ ‘ఎన్నిక’ పార్టీలో ఎటువంటి అసమ్మతికీ దారి తీయలేదు. ఎవరూ తమ సొంత అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేదు, భిన్నాభిప్రాయానికి తావు లేదు. నితిన్‌ నబినే అధ్యక్షుడు. ఒప్పుకుని తీరవల్సిందే. ‘మాది కచ్చితంగా క్రమశిక్షణతో వ్యవహరించే పార్టీ’ అని ఒక నాయకుడు సగర్వంగా చెప్పాడు. క్రమశిక్షణను పాటించే పార్టీ కావచ్చు కానీ, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే పార్టీయేనా? సంపూర్ణంగా మాత్రం కానేకాదు, సందేహం లేదు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నితిన్‌ నబిన్‌ ‘ఎంపిక’ ఆ పార్టీలో విస్తృత సంప్రతింపులు, కఠినమైన చర్చల ద్వారా జరగలేదు. ఎదురులేని పార్టీ ‘హై కమాండ్‌’ అయిన నరేంద్ర మోదీ– అమిత్‌ షా ద్వయమే ఆయన్ని ఎంపిక చేసింది. అది వారిరువురి సొంత నిర్ణయం. అందులో మరెవ్వరి ప్రమేయం లేదు. జోడీ నెంబర్ వన్‌ నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఎటువంటి ఆక్షేపణ లేకుండా అంగీకరించింది. సంఘ్‌ పరివార్‌తో పూర్తిగా ముడివడి ఉన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేత కదా నితిన్‌ నబిన్‌.

బీజేపీ హై కమాండ్‌ ఏకపక్ష నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ ఊగిసలాట వైఖరికి ఎంత విరుద్ధంగా ఉన్నదో చూడండి. కర్ణాటకలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించడమా లేక ఆయన స్థానంలో డి.కె. శివకుమార్‌ను నియమించడమా అనే విషయమై కాంగ్రెస్‌ నాయకత్వం ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేకపోతోంది. 2022లో రాజస్థాన్‌లో సైతం ఏమి జరిగిందో గుర్తు చేసుకోండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్‌ గెహ్లోత్‌ను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు ఆయన ససేమిరా అన్నారు. పార్టీ నాయకత్వం ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోయింది. విధిలేక, ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అంగీకరించింది. రాజకీయ వర్గాలలోను, రాజకీయేతర వర్గాలలోను పేరు ప్రఖ్యాతులు ఉన్న పార్టీ ఎంపీ శశి థరూర్‌ అనేక కీలక అంశాలపై పార్టీ అధిష్ఠానంతో విభేదిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ ‘హై కమాండ్‌’ ఆయనతో బహిరంగంగా ఘర్షణపడేందుకు సిద్ధంగా లేదు. పార్టీ క్రమశిక్షణను పాటించడమా అది? కాదు. ప్రజాస్వామ్య వైఖరితో వ్యవహరించడమా? ఒక విధంగా అదే అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు: నేడు బీజేపీలో ఎటువంటి అసంతృప్తినైనా వ్యక్తం చేయడానికంటే, కాంగ్రెస్‌లో గాంధీల సర్వాధిపత్యాన్ని ప్రశ్నించేందుకే ఎక్కువ ఆస్కారమున్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ శ్రేణులు తమ ‘హైకమాండ్‌’కు భయపడుతుండగా, కాంగ్రెస్‌ వర్గాలు గతంలో వలే తమ ‘హై కమాండ్‌’ మాటను శిరసావహించడం లేదు.

దీన్నిబట్టి కాంగ్రెస్‌ రాత్రికి రాత్రే ఒక ‘ప్రజాస్వామిక’ పార్టీగా మారిపోయిందనీ లేదా బీజేపీ అనూహ్యంగా, గతించిన కాలంలోని కాంగ్రెస్‌ వ్యవహార శైలిని అలవర్చుకున్నదని భావించనవసరం లేదు. నిజమేమిటంటే అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యమివ్వని శక్తిమంతమైన నాయకుడి కేంద్రిత పార్టీ సంస్కృతి ఫలితమే ‘హై కమాండ్‌’. భయభీతులు, ముఖస్తుతులను అపేక్షించే భూస్వామ్య సంస్కృతి ప్రబలంగా ఉన్న మన రాజకీయ పార్టీలలో శక్తిమంతుడైన నాయకుడి మాటే తుది మాటగా చలామణి అవుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ పది సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో లేదు. పైగా పలు రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. ఈ కారణంగా హై కమాండ్‌ ప్రభావ ప్రాబల్యాలు క్షీణించాయి. ఎంతగా అంటే గతంలో వలే ఎవరూ ఇప్పుడు ‘హై కమాండ్‌’కు భయపడడం లేదు. కాంగ్రెస్‌కు భిన్నంగా బీజేపీ ఇదే కాలంలో శీఘ్రగతిన అపూర్వ విజయాలను సాధిస్తూ దేశవ్యాప్తంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది. ఇందుకు ప్రధాన కారకులైన జోడీ నెంబర్ వన్‌ (నరేంద్ర మోదీ, అమిత్‌ షా) మాటను ఎంత భయభీతులతో పాటించడం జరుగుతుందో ఆ నాయక ద్వయాన్ని అంతగా అభిమానించడమూ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికను అప్రతిహతంగా గెలుస్తూ ఉన్నంతవరకు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఎవరు పట్టించుకుంటారు? బీజేపీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత వేదిక అయిన పార్లమెంటరీ బోర్డ్‌ చివరిసారి ఎప్పుడు ఒక జాతీయ సమస్యపై అర్థవంతమైన చర్చ జరిపింది? చెప్పవచ్చిందేమిటంటే ముఖ్యమంత్రుల ఎంపిక మొదలు, పార్టీ వ్యూహాన్ని రూపొందించడం వరకూ అన్నీ జోడీ నెంబర్‌వన్‌ నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే జరుగుతున్నాయి.

2023లో రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ఎంపికే జోడీ నెంబర్ వన్‌ సర్వాధిపత్యానికి ఒక తిరుగులేని నిదర్శనం. గతంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధరా రాజే 2023లో కూడా ఆ పదవికి పోటీ పడ్డారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ప్రాతిపదికన ఎంపిక చేయడం జరిగి ఉన్నట్టయితే వసుంధరా రాజే తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ అలా జరగలేదు. ఆమెకు బదులుగా, మొదటిసారి శాసనసభకు ఎన్నికయిన భజన్‌లాల్‌ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయం న్యూఢిల్లీలో జరిగింది. జోడీ నెంబర్ వన్‌ నిర్ణయాన్ని జైపూర్‌లోని పార్టీ బాధ్యులకు తెలియజేశారు. ఆ మాట పార్టీ శాసనసభా పక్షానికి అక్షరాలా ఒక ఆదేశం. ఈ నిర్ణయం పట్ల వసుంధరా రాజే ఆశ్చర్యపోయారు. అదే విధంగా భజన్‌లాల్ శర్మ సైతం నిర్ఘాంతపోయారు.

నరేంద్ర మోదీ– అమిత్‌ షా ‘హై కమాండ్‌’ ఒక విధంగా ఇందిరాగాంధీ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, పద్ధతుల నుంచి గ్రహిస్తున్నదని చెప్పవచ్చు. ఢిల్లీలో ముఖ్యమంత్రులు ఎవరో నిర్ణయించి, సదరు పెద్ద మనిషిని తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని రాష్ట్రాల శాసనసభా పక్షాలను ఆదేశించే సంప్రదాయానికి అంకురార్పణ చేసింది ఇందిరాగాంధీయే కాదూ? ఆ ఆనాడు ఆమె మాటను ఏ రాష్ట్ర నాయకులూ జవదాటలేదు. ఇప్పుడు జోడీ నెంబర్ వన్‌ మాటకు కూడా అటువంటి మన్ననే దక్కుతోంది.

బీజేపీ హై కమాండ్‌ నమూనా కాంగ్రెస్‌ హై కమాండ్‌ నమూనాకు నకలు అని భావించడం పొరపాటు. కాంగ్రెస్‌ హై కమాండ్‌ చాలా నిర్దయగా నిర్ణయాలు తీసుకునేది. అవి దృఢమైనవి, అసాధారణమైనవి. మోదీ–షా ద్వయం అటువంటి నిర్దయను, దృఢనిశ్చయాన్ని తమ పార్టీలో అంతర్గతంగా తరం మార్పు సాధించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది కాంగ్రెస్‌, బీజేపీ హై కమాండ్‌ల వ్యవహార శైలుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడా. బీజేపీ ముఖ్యమంత్రులు దాదాపుగా అందరూ తమ యాభైలలో ఉన్నవారే. కాంగ్రెస్‌ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. సప్తపదుల, అష్టపదుల వయసులో ఉన్నవారే పార్టీ పదవులలో ఉంటున్నారు. చట్ట సభలకు ఎన్నికవుతున్నారు.

బీజేపీ ‘హై కమాండ్‌’ వ్యూహాత్మక అధికార క్రీడలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉన్నది: ‘మోదీ తరువాత, ఎవరు?’ 61 ఏళ్ల వయసులో ఉన్న అమిత్‌ షా పార్టీలో ముఖ్యమైన పదవులు అన్నిటినీ జాతీయ స్థాయిలోను, రాష్ట్రాలలోను తన సన్నిహితులకే కట్టబెడుతున్నారు. తద్వారా సంభావ్య వారసత్వ పోటీలో తనకు సానుకూల పరిస్థితుల నేర్పర్చుకుంటూ తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. ఈ కారణంగానే ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అయినా, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఎంపిక అయినా అమిత్‌ షా ప్రమేయం అత్యంత ప్రభావశీలంగా ఉంటుంది. పార్టీలో ఏ నియామకాలపైన అయినా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా ఈ కారణం వల్లే బీజేపీ హై కమాండ్‌ తదుపరి నిర్ణయం ఎలా ఉండగలదని జోస్యం చెప్పడం చాలా కష్టం. సమస్యలు, సంకటాలతో కూడుకున్న విషయమది. బీజేపీ ‘హై కమాండ్‌’ భావి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఏ ఒక్కరూ, చివరకు ఆరెస్సెస్‌ సైతం నిశ్చితంగా చెప్పలేదు. అది గుజరాత్‌ నుంచి ప్రభవించిన జోడీ నెంబర్ వన్‌కు మాత్రమే తెలుస్తుంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలు కూడా చదవండి:

AP Politics: ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత

MLA Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. అత్యవసర విచారణకు నో చెప్పిన హైకోర్టు..

Updated Date - Dec 21 , 2025 | 04:44 AM