MLA Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. అత్యవసర విచారణకు నో చెప్పిన హైకోర్టు..
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:52 PM
అరెస్టు భయంతో హైకోర్టును మాజీ ఎమ్మెల్యే వంశీ ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా విచారణ చేయాలని అభ్యర్థించారు.
అమరావతి: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్(Former MLA Vallabhaneni Vamsi)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) షాక్ ఇచ్చింది. వంశీ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్(Anticipatory Bail Petition)పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. 2024 జులైలో వంశీ, అతని అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డిసెంబర్ 18న పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, అరెస్టు భయంతో హైకోర్టును మాజీ ఎమ్మెల్యే వంశీ ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా విచారణ చేయాలని అభ్యర్థించారు. అయితే, పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వంశీ దాదాపు 137 రోజులపాటు జైలులో ఉన్నారు. అనంతరం ఎట్టకేలకు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా లేరు. అయితే, తాజాగా కేసు నమోదు కావడంతో వంశీపై మరో పిడుగు పడినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి:
YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. 50 మంది రాజీనామా..!